భారత్‌కు ఎదురుందా? | India Vs West Indies Second T20 In Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎదురుందా?

Published Sun, Dec 8 2019 12:49 AM | Last Updated on Sun, Dec 8 2019 5:01 AM

India Vs West Indies Second T20 In Thiruvananthapuram - Sakshi

టి20 సిరీస్‌ అంటేనే మెరుపు షాట్లు, భారీ స్కోర్లు, ఓవర్‌ ఓవర్‌కు మారిపోయే విజయ సమీకరణాలు. పైగా ఆజానుబాహులు ఉండే వెస్టిండీస్‌ జట్టుతో పొట్టి ఫార్మాట్‌ అంటే అభిమానులకు పరుగుల విందే. సరిగ్గా శుక్రవారం నాటి మ్యాచ్‌ ఇలాగే సాగింది. కావాల్సినంత వినోదం పంచింది.

సిరీస్‌ ఆరంభ పోరే ఇంత అద్భుతంగా సాగితే... సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా వెస్టిండీస్‌ గెలవాల్సిన స్థితిలో ఈ పోరు మరింత రంజుగా జరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో టి20 మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాయి. కోహ్లి సేన రెండో టి20లోనూ నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా? భారత్‌కు ఎదురునిలిచి, గెలిచి విండీస్‌ సిరీస్‌ను సమం చేస్తుందా? వేచి చూడాలి.  

తిరువనంతపురం: అనుకున్నట్లే జరుగుతోంది. ఎలాంటి సంచలనాలకు తావే లేనట్లుగా అనిపిస్తోంది. ప్రత్యర్థి ఎంత చెలరేగినా... సొంతగడ్డపై తమని నిలువరించేదెవరు అన్నట్లుగా కోహ్లిసేన తొలి టి20 మ్యాచ్‌లో విజృంభించింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లను మరిచేలా బ్యాటింగ్‌లో వీరవిహారం చేసిన టీమిండియా అదే ఊపులో మరో మ్యాచ్‌ విజయంపై కన్నేసింది. నేడు వెస్టిండీస్‌తో జరిగే రెండో టి20లో గెలుపొంది మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో ఇక్కడే దక్కించుకోవడంతో పాటు ప్రపంచ చాంపియన్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది.  

పొరపాట్లు సవరించుకుంటేనే...
టి20 ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ అయినప్పటికీ భారత్‌ ముందు వెస్టిండీస్‌ ఆటలు సాగడం లేదు. టి20 మ్యాచ్‌ల్లో చెలరేగిపోయే కరీబియన్లు భారత్‌ ముందు తేలిపోతున్నారు. గత 13 నెలల్లో విండీస్‌పై భారత్‌ సాధించిన విజయాలు దీన్ని నిర్ధారిస్తున్నాయి. 4 నవంబర్‌ 2018 నుంచి శుక్రవారం నాటి తొలి టి20 మ్యాచ్‌ విజయంతో కలిపి భారత్‌ వరుసగా 7 మ్యాచ్‌ల్లో విండీస్‌పై గెలుపొందింది. నిజానికి హైదరాబాద్‌ మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఊహించిన దానికంటే మిన్నగా రాణించింది. అనుభవజు్ఞలు లేని ఆ జట్టు ఏమాత్రం రాణిస్తుందిలే అనుకున్నారంతా. కానీ భారత బౌలింగ్‌ను వేటాడుతూ అలవోకగా పరుగులు సాధించింది. వారి ముందు మన బౌలర్లు తేలిపోయారు.

పునరాగమనం చేసిన భువనేశ్వర్‌ తన ప్రభావం చూపలేకపోయాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లలో ఆకట్టుకున్న స్పీడ్‌స్టర్‌ దీపక్‌ చాహర్‌ అందరికన్నా ఎక్కువగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. తాను ఆడిన గత 6 టి20 మ్యాచ్‌ల్లో కేవలం రెండే వికెట్లు తీయగలిగిన స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ శుక్రవారం నాటి మ్యాచ్‌లో తన కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. ఫీల్డింగ్‌లోనూ అంతంతే అనిపించాడు. స్పిన్నర్లు జడేజా, చహల్‌ రాణించినా... ఫీల్డింగ్‌లోనూ భారత్‌ తడబడింది. రోహిత్‌ శర్మ వరుస క్యాచ్‌ మిస్‌లతో పాటు సుందర్‌ ఏమరపాటు ప్రత్యర్థి భారీ స్కోరుకు బాటలు వేసింది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇంకా బ్యాటింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంది. బ్యాటింగ్‌లో రాహుల్, కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో ఛేదనలో జట్టు గట్టెక్కింది. కానీ ఈ పొరపాట్లే ఒక్కోసారి ఓటమికి కారణమవుతాయనేది మర్చిపోకూడదు.  

బేజారెత్తించిన బౌలింగ్‌...
పాపం వెస్టిండీస్‌. బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించారని సంతోషించేలోపే వారి ఆశలు ఆవిరయ్యాయి. బౌలింగ్‌ దళంలో కాట్రెల్‌ కాస్త పొదుపుగా పరుగులిచి్చనా మిగతా వారు కోహ్లి, రాహుల్‌ విజృంభణతో బేలగా మారిపోయారు. కోహ్లిని కవి్వంచడం ఎంత ప్రమాదకరమో బౌలర్‌ విలియమ్స్‌కి చక్కగా బోధపడినట్లుంది. ఓ వైపు విలియమ్స్‌ ధారాళంగా పరుగులిస్తున్నా... పొలార్డ్‌ అతనినే కొనసాగించడంతో చివర్లో మ్యాచ్‌ వారి నుంచి చేజారిపోయింది. జాసన్‌ హోల్డర్, వాల్ష్ వికెట్లు తీయలేకపోయారు. మరోవైపు భారత్‌పై ఒత్తిడి పెంచాల్సిన కీలక సమయంలో ఎక్స్‌ట్రాల రూపంలో పరుగులు ఇవ్వడం వారి కొంపముంచింది. వీటిని సొమ్ము చేసుకున్న భారత్‌ పరుగులు చేసి లాభపడింది.

కానీ బ్యాటింగ్‌లో హెట్‌మైర్, ఎవిన్‌ లూయిస్, కీరన్‌ పొలార్డ్, హోల్డర్, బ్రాండన్‌ కింగ్‌ తమ ధాటి చూపించడం వారిలో కచి్చతంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉంటుంది. ఇదే ఆత్మవిశ్వాసంతో నేటి   మ్యాచ్‌లో మరింత చెలరేగి భారత్‌ చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేయడంతో పాటు సిరీస్‌లో నిలిచి ఉండేందుకు విండీస్‌ ప్రయతి్నస్తుందనడంలో సందేహం లేదు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి నాలుగు మ్యాచ్‌ల నిషేధానికి గురైన నికోలస్‌ పూరన్‌ సస్పెన్షన్‌ ముగిసింది. దాంతో రెండో టి20లో అతను దినేశ్‌ రామ్‌దిన్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.  

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెపె్టన్‌), రోహిత్‌ శర్మ, రాహుల్, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్, శివమ్‌ దూబే, జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్, దీపక్‌ చాహర్, భువనేశ్వర్‌.  
వెస్టిండీస్‌: కీరన్‌ పొలార్డ్‌ (కెపె్టన్‌), అలెన్, బ్రాండన్‌ కింగ్, దినేశ్‌ రామ్‌దిన్‌/నికోలస్‌ పూరన్, కాట్రెల్, ఎవిన్‌ లూయిస్, హెట్‌మైర్, కారీ పియరీ, హోల్డర్, హేడెన్‌ వాల్‌‡్ష జూనియర్, కాస్రిక్‌ విలియమ్స్‌.  

పిచ్, వాతావరణం
గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో గతంలో రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు (వన్డే, టి20) జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో పిచ్‌ స్పిన్నర్లకు సహకరించింది. ఆదివారం చిరుజల్లులు కురిసే అవకాశముంది. ఈ మైదానంలో విండీస్‌ గతంలో వన్డే ఆడింది. 2018లో జరిగిన ఈ వన్డేలో విండీస్‌ 104 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ వికెట్‌ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.   

‘స్పెషలిస్ట్‌’ ముద్ర నాకొద్దు: కోహ్లి
తొలి టి20లో అద్భుత ఇన్నింగ్స్‌తో పొట్టిఫార్మాట్‌లో తన అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన సంగతి తెలిసిందే. అయినంత మాత్రానా తన బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు చేసుకోనని అంటున్నాడు. తాను మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్‌నని,  ప్రత్యేకంగా ఒక ఫార్మాట్‌ కోసం బ్యాటింగ్‌ స్టయిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోనని స్పష్టం చేశాడు. ‘నా ఆట తీరును మార్చుకోవాలని అనుకోవట్లేదు. నేను వన్డే, టెస్టు, టి20 ఇలా మూడు ఫార్మాట్లలోనూ రాణించాలనుకుంటా.

కాబట్టి ప్రత్యేకంగా ఒక ఫార్మాట్‌ కోసమంటూ ఆటతీరులో మార్పులు చేసుకోలేను. ‘ఫార్మాట్‌ స్పెషలిస్టు’గా ఉండాలనుకోవట్లేదు. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు కచి్చతంగా ఒత్తిడి ఉంటుంది. వరుసగా కొన్ని బంతులకు పరుగులు రానప్పుడు.... కచ్చితంగా చివర్లో ధాటిగా షాట్లు ఆడాలి. అదే నేను చేస్తుంటా’ అని కోహ్లి వివరించాడు. టి20 ఫార్మాట్‌లో మొత్తం 12 ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులను అందుకున్న కోహ్లి, అఫ్గానిస్తాన్‌ ప్లేయర్‌ నబీతో కలిసి ఈ జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement