అనూహ్యమేమీ కాదు... గత కొంత కాలంగా వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు పుజారా, రహానేలను ‘విశ్రాంతి’ సాకుతో కాకుండా అధికారికంగా సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ మార్పు ఒక్క శ్రీలంక సిరీస్‌కే పరిమితమని చెబుతున్నా... ఈ ఇద్దరు సీనియర్లు మళ్లీ ఎప్పుడు జట్టులోకి తిరిగొస్తారో చెప్పలేని పరిస్థితి... మరోవైపు కోహ్లి తప్పుకోవడంతో ఖాళీగా ఉన్న టెస్టు కెప్టెన్సీ స్థానాన్ని కూడా రోహిత్ శర్మకే అప్పగించిన సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్‌లలో ఒకే ఒక నాయకుడిగా అతనికి గుర్తింపునిచ్చింది.
న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల కోసం 18 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. మరో ఇద్దరు సీనియర్లు పేసర్ ఇషాంత్ శర్మ, కీపర్ వృద్ధిమాన్ సాహాలను కూడా లంకతో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. లంకతో సిరీస్‌కు ఈ నలుగురి పేర్లను పరిశీలించడం లేదని దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే స్వయంగా వారికే సమాచారమిచ్చామని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వెల్లడించారు.
గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను మాత్రం ఫిట్‌నెస్ షరతులకు లోబడి ఎంపిక చేశారు. తొలి టెస్టుకు ముందు అతనికి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహిస్తారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా టెస్టుల్లో మరో అవకాశం లభించింది. శార్దూల్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించిన సెలక్టర్లు... కేఎల్ రాహుల్, సుందర్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని స్పష్టం చేశారు.
మరో మాట లేకుండా...
భారత వన్డే, టి20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను టెస్టు కెప్టెన్‌గా కూడా అధికారికంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికా చేతిలో 1–2తో సిరీస్ ఓడిన తర్వాత కోహ్లి తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు మరో టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్లు రోహిత్‌పై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూస్తే 35 ఏళ్ల రోహిత్‌కు టెస్టు సారథ్యం అప్పగించడంపై కొంత చర్చ జరిగినా ప్రస్తుతానికి అతనికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదని సెలక్టర్లు తేల్చారు. మూడు ఫార్మాట్‌లలో ఆడే రోహిత్ ఫిట్‌నెస్ విషయంలో సందేహాలు ఉన్నా... ఎప్పటికప్పుడు తాము పర్యవేక్షిస్తామని చేతన్ స్పష్టం చేశారు.
కోహ్లి, పంత్‌లకు విశ్రాంతి
శ్రీలంకతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం కూడా టీమ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. విండీస్‌తో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి రాగా... విరామం లేకుండా ఆడుతున్న కోహ్లి, రిషభ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చారు. కోహ్లి, పంత్ విండీస్‌తో రెండో టి20 ముగిసిన వెంటనే ‘బయో బబుల్’ నుంచి బయటకు వచ్చి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌కు కూడా విశ్రాంతినిచ్చినట్లు సెలక్టర్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా... వికెట్ కీపర్ సంజు సామ్సన్‌కు మరో అవకాశం దక్కింది. భారత్, శ్రీలంక మధ్య మూడు టి20 మ్యాచ్‌లు ఈనెల 24, 26, 27వ తేదీల్లో జరుగుతాయి.
ఎవరీ సౌరభ్...
ఉత్తరప్రదేశ్‌కు (యూపీ) చెందిన 28 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. దేశవాళీ కెరీర్ ఆరంభంలో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను ఆ తర్వాతి నుంచి యూపీకి ఆడుతున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో వరుసగా 51, 44 వికెట్ల చొప్పున పడగొట్టిన అతను ఇటీవల భారత ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికాలో రాణించాడు. అనంతరం టెస్టు సిరీస్ కోసం స్టాండ్‌బై ప్లేయర్‌గా అక్కడే ఉండి టీమిండియాతో పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 24.15 సగటుతో సౌరభ్ 196 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ అతని ఖాతాలో 2 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఆట ముగిసినట్లేనా!
డిసెంబర్ 2020... మెల్‌బోర్న్‌లో అద్భుత సెంచరీతో రహానే భారత్‌ను గెలిపించాడు. అతని కెప్టెన్సీలో సిరీస్ కూడా సొంతమైంది. అయితే ఆ టెస్టు తర్వాతి నుంచి రహానే పేలవ ప్రదర్శన మొదలైంది. నాటినుంచి ఇప్పటి వరకు ఆడిన 15 టెస్టుల్లో రహానే 20.25 సగటుతో 547 పరుగులు మాత్రమే సాధించాడు. 2018–19 ఆస్ట్రేలియా సిరీస్‌లో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆడిన 27 టెస్టుల్లో కేవలం 27.38 సగటుతో అతను 1,287 పరుగులు చేశాడు. టీమిండియాకు చాలా వరకు విదేశీ గడ్డపైనే ఈ ఇద్దరు బ్యాటర్ల అవసరం ఉంది.
సుమారు మరో ఏడాది పాటు భారత్ విదేశాల్లో టెస్టులు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లను ప్రభావితం చేసే ఆటతో వీరిద్దరు మళ్లీ ఎప్పుడు అవకాశం దక్కించుకుంటారో చూడాలి. మరోవైపు ప్రధాన పేసర్లంతా అందుబాటులో ఉన్న సమయంలో తుది జట్టులో స్థానం పొందలేకపోతున్న ఇషాంత్ శర్మపై వేటు ఆశ్చర్యం కలిగించలేదు. వికెట్ కీపర్‌గా కూడా పంత్ తన స్థానం పటిష్టం చేసుకోగా, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న సెల క్టర్లు 37 ఏళ్ల సాహాను పక్కన పెట్టక తప్పలేదు.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్, ప్రియాంక్ పాంచల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, విహారి, గిల్, పంత్, కేఎస్ భరత్, అశ్విన్, జడేజా, జయంత్, కుల్దీప్, షమీ, సిరాజ్, ఉమేశ్, సౌరభ్ కుమార్.
భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్, సిరాజ్, సామ్సన్, జడేజా, చహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అవేశ్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment