గెలుపు విజిల్‌ మోగాలి | Third T20 Match India VS Sri Lanka On 10/01/2020 | Sakshi
Sakshi News home page

గెలుపు విజిల్‌ మోగాలి

Published Fri, Jan 10 2020 12:37 AM | Last Updated on Fri, Jan 10 2020 4:44 AM

Third T20 Match India VS Sri Lanka On 10/01/2020 - Sakshi

సొంతగడ్డపై తిరుగులేని రికార్డును పదిలంగా ఉంచేందుకు కోహ్లి సేన మరో విజయంపై కన్నేసింది. రెండో మ్యాచ్‌లో కనీసం పోరాటం చేయలేని  ప్రత్యర్థిని వరుసగా ఈ మ్యాచ్‌లోనూ దెబ్బకొట్టాలని భావిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను గెలవడం, సిరీస్‌ను సమం చేయడం లంకకు శక్తికి మించిన పనే! అయితే ఏ మేరకు పోటీనిస్తుందనేది చూడాలి.

పుణే: ఈ సీజన్‌లో మరో సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. తమకు సరితూగలేని శ్రీలంకతో శుక్రవారం జరిగే ఆఖరి టి20లోనూ గెలిచి 2–0తో కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన విజయారంభం ఇవ్వాలని ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ఏమాత్రం పోరాటమే ఇవ్వలేకపోయిన లంకపై భారత్‌ ఆడుతూ పాడుతూ చెమట చిందించకుండానే గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో భారత్‌దే ఆధిపత్యమైంది.

ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే... ప్రత్యర్థి శ్రీలంక మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆల్‌రౌండర్‌ ఉడాన గాయం కూడా ఆ జట్టును మరింత కలవరపెడుతోంది.  ముందే బ్యాటింగ్‌ చేస్తే భారత్‌ జోరుకు నిలబడగలమా అన్న సందేహం కూడా వారిలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓడినా పోరాటంతోనైనా పరువు కాపాడుకోవాలని లంక చూస్తోంది.

పరుగుల ఓపెనర్‌ రాహుల్‌ 
రాహుల్‌ మ్యాచ్‌ మ్యాచ్‌కు మెరుగవుతున్నాడు. కొన్నాళ్లుగా  ఓపెనింగ్‌లో  మెరికయ్యాడు. ఇంకా చెప్పాలంటే రెగ్యులర్‌ ఓపెనర్‌గా పాతుకుపోయినట్లే! ముప్పు అంటు ఉంటే ధావన్‌కే ఉంది. రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ సిరీస్‌ ఆడుకుంటున్న ధావన్, అతడు జట్టులోకి వస్తే మాత్రం తుది జట్టుకు దూరం కావాల్సిందే. సహచరులతో శుభారంభాలు ఇవ్వడంతో పాటు తాను వ్యక్తిగతంగా భారీస్కోర్లను నిలకడగా సాధించేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతని ఆత్మవిశ్వాసం అద్భుతం. ఎలాంటి ప్రమాదకర బౌలర్‌ ఎదురైనా చక్కగా ఎదుర్కోవడంలో స్థిరత్వం సంపాదించాడు. అతడు ఎదురుదాడికి దిగితే మాత్రం ప్రత్యర్థి బౌలింగ్‌ దళమంతా కకావికలం కావాల్సిందే. ఇప్పుడు అంతటి ప్రమాదకర ఓపెనర్‌గా ఎదిగాడు లోకేశ్‌ రాహుల్‌. 

వాళ్లని ఆడిస్తారా? 
భారత్‌ అన్నింటా పైచేయి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో విన్నింగ్‌ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేక రిజర్వ్‌ బెంచ్‌లోని ఆటగాళ్లకు అవకాశమివ్వాలా అనే సందిగ్ధంలో పడింది టీమిండియా. జట్టుకు ఎంపికవడం... డగౌట్‌లో కూర్చోవడం ఇదే పని అయిన సంజూ శామ్సన్‌తో పాటు మనీశ్‌ పాండేలకు చాన్స్‌ ఇవ్వాలా వద్దా అనే డైలామాలో ఉంది. పొట్టి ప్రపంచకప్‌ ఈ ఏడాదే కాబట్టి కుర్రాళ్లకు చాన్స్‌ ఇస్తే బాగుంటుందని జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది.

పైగా ప్రత్యర్థి కూడా అంత పటిష్టంగా లేకపోవడంతో కెప్టెన్‌ కోహ్లి ఆ దిశగా యోచించే అవకాశాలున్నాయి. ఇక సీనియర్లు లేని పేస్‌ దళంలో ఇటు శార్దుల్‌ ఠాకూర్, అటు నవ్‌దీప్‌సైనీ చక్కగా ఇమిడిపోయారు. భారత ఫాస్ట్‌ బౌలింగ్‌కు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. లంక జట్టులో ఎక్కువగా ఎడంచేతి ఆటగాళ్లుండటంతో కుల్దీప్, వాషింగ్టన్‌ సుందర్‌లనే కొనసాగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్‌లోనూ రవీంద్ర జడేజా, చహల్‌ ఇద్దరు డగౌట్‌కే పరిమితం కావాల్సివుంటుంది.

కష్టాల లంక...

భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది ప్రత్యర్థి పరిస్థితి. ఆతిథ్య జట్టు ఎంత పటిష్టంగా ఉందో... ప్రత్యర్థి జట్టు అంత బలహీనంగా ఉంది. ముఖ్యంగా అనుభవలేమి ఇటు బ్యాటింగ్‌ను, అటు బౌలింగ్‌ను వేధిస్తోంది. జట్టు మొత్తంలో అనుభవజ్ఞులు ఇద్దరే ఒకరు ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌ అయితే... కెప్టెన్, పేసర్‌ మలింగ. కుశాల్‌ పెరీరా, డిక్‌వెలా, ధనంజయలు బాగా ఆడగలరు. కానీ వారితో పోల్చి చూసుకునేంత అనుభవమైతే లేదు. అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాథ్యూస్‌కు ఆడే అవకాశమివ్వలేదు.

నిజానికి ఈ మాజీ కెప్టెన్‌ 16 నెలలుగా పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. ఇపుడు ఉడాన గాయపడటంతో మాథ్యూస్‌ కీలకమయ్యాడు. ఏదేమైనా భీకరమైన  ఫామ్‌లో ఉన్న కోహ్లి సేన ముందు ఎదురుపడే సత్తా ఇప్పటి లంక జట్టుకు లేదు. పొట్టి ఆటలో ఫేవరెట్‌ అంటూ ఎవరూ ఉండరు. ఆ రోజు ఎవరు మెరుపులు మెరిపిస్తే ఆ జట్టే గెలుస్తుందనడంలో సందేహం లేదు. కానీ మెరిపించే వారే శ్రీలంకకు కరువయ్యారు. కాబట్టే పోరాడి పరువు నిలబెట్టుకుంటుందేమో కానీ... మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేసుకుంటుందనేది అత్యాశే అవుతుంది.

జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్, శ్రేయస్, రిషభ్‌ పంత్, శివమ్‌ దూబే, జడేజా, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌/ చహల్, శార్దుల్, బుమ్రా. 
శ్రీలంక: మలింగ (కెప్టెన్‌), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ పెరీరా, రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, మాథ్యూస్, షనక, ధనంజయ, హసరంగ, లహిరు కుమార.

పిచ్, వాతావరణం 
బంతికి, బ్యాట్‌కు చక్కని పోరాటం జరగొచ్చు. ఇక్కడి పిచ్‌ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. వర్ష సూచనైతే లేదు... కానీ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌ బౌలర్లకు కాస్త ఇబ్బంది తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement