తడబడ్డా.. నిలబడ్డారు!
యూఏఈపై శ్రీలంక గెలుపు
రాణించిన చండిమల్
ఆసియా కప్
మిర్పూర్: చిన్న ప్రత్యర్థిని మొదట తేలికగా తీసుకున్న డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక... బ్యాటింగ్‌లో తడబడినా... నాణ్యమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని కట్టడి చేసి ఆసియా కప్ టి20 టోర్నీలో బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక 14 పరుగుల తేడాతో యూఏఈపై నెగ్గింది. షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. చండిమల్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడగా, దిల్షాన్ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... యూఏఈ బౌలర్ల ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. జావేద్ 3, నవీద్, షెహజాద్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది.
స్వప్నిల్ పాటిల్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. తొలి ఓవర్‌లోనే మలింగ... ముస్తఫా (0), షెహజాద్ (1)లను అవుట్ చేసి యూఏఈకి షాకిచ్చాడు. తర్వాత కులశేఖర తన రెండో ఓవర్‌లో కలీమ్ (7), ఉస్మాన్ (6)లను వెనక్కిపంపాడు. హెరాత్ వచ్చి రావడంతోనే తన తొలి రెండు ఓవర్లలో అన్వర్ (13), హైదర్ (1) వికెట్ తీయడంతో యూఏఈ 47 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. ఇక రెండు వైపుల నుంచి లంక బౌలర్లు ఒత్తిడి పెంచడంతో యూఏఈ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించాక... పాటిల్, అంజద్ జావేద్ (13)లతో పాటు నవీద్ (10)లు వరుస ఓవర్లలో అవుట్‌కావడం దెబ్బతీసింది.