
లక్ష్యం క్లీన్‌స్వీప్
♦ మరో విజయంపై భారత్ దృష్టి
♦ నేటి నుంచి శ్రీలంకతో మూడో టెస్టు
భారత జట్టు తమ టెస్టు చరిత్రలో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లను నాలుగు సార్లు క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇవన్నీ సొంతగడ్డపైనే వచ్చాయి. 85 ఏళ్లలో ఒక్కసారి కూడా విదేశాల్లో ఆ ఘనత నమోదు చేయలేదు. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం కోహ్లి సేన ముందుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు ప్రత్యర్థి పేలవ ఆటతీరు కూడా భారత్ విజయంపై అంచనాలు పెంచుతోంది. తొలి రెండు టెస్టుల్లాగే ఈ సారి కూడా మన జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తుందా...? స్వదేశంలో వరుస పరాభవాలు ఎదు ర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పోటీ ఇచ్చి పరువు కాపాడుకోగలదా చూడాలి.
కాండీ: బ్యాటింగ్‌లో జోరు, పేసర్ల దూకుడు, స్పిన్నర్ల సత్తా... వెరసి శ్రీలంక పర్యటనలో భారత జట్టు తిరుగులేని ఆటతీరు కనబరుస్తోంది. తొలి రెండు టెస్టులను భారీ తేడాతో గెలుచుకున్న టీమిండియా అదే ఊపులో మరో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత్, శ్రీలంక మధ్య ఇక్కడి పల్లెకెలె మైదానంలో మూడో టెస్టు జరగనుంది. సీనియర్లు దూరమయ్యాక ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో పాటు కీలక ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడటంతో శ్రీలంక పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. రెండు ఓటముల తర్వాత ఈ మ్యాచ్‌లోనైనా కోలుకోవడంపై చండిమాల్ బృందం దృష్టి పెట్టింది.
భువీకి చోటు!
తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఈ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. మ్యాచ్ ముందు రోజు వరకైతే పచ్చికను తొలగించలేదు. పైగా ఇక్కడి శీతల వాతావరణం కారణంగా స్వింగ్ కూడా ప్రభావం చూపిస్తుంది. మ్యాచ్ రోజు కూడా పిచ్ ఇలాగే ఉంటే సస్పెన్షన్‌కు గురైన జడేజా స్థానంలో మూడో పేసర్‌గా భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే రెండో స్పిన్నర్ కూడా అవసరమని భావిస్తే పాండ్యా స్థానంలో భువీ వస్తాడు. అప్పుడు కుల్దీప్‌కు కూడా అవకాశం దక్కుతుంది. దక్షిణాఫ్రికా నుంచి ఈ మ్యాచ్ కోసం వచ్చిన అక్షర్ పటేల్ బెంచీకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ. వరుస రికార్డులతో చెలరేగిపోతున్న అశ్విన్‌ను ఎదుర్కోవడం కూడా లంకకు సులువు కాదు. ఓపెనర్లు ధావన్, రాహుల్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి, రహానే బ్యాటింగ్ గురించి కూడా ఎలాంటి బెంగ లేదు. ఇక పుజారా అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌లో మరే భారత బ్యాట్స్‌మన్ మూడు మ్యాచుల్లోనూ సెంచరీ చేయలేదు. పుజారా ఆటను చూస్తే అతను ఈ ఘనత సాధించగలడని అనిపిస్తోంది. మొత్తంగా ఎలాంటి లోపాలు లేని విధంగా భారత లైనప్ కనిపిస్తోంది. కెప్టెన్‌గా కోహ్లి వరుసగా 29వ టెస్టులోనూ తుది జట్టులో మార్పులు చేయనుండటం విశేషం.
ముగ్గురు పేసర్లతో...
గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక చూపిన పోరాట పటిమ ఆ జట్టుకు విజయాన్ని ఇవ్వలేకపోయింది కానీ టీమ్ సభ్యులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరును మార్చుకుంటే ఫలితాలు రాబట్టవచ్చని ఆ ఇన్నింగ్స్ నిరూపించింది. ఇప్పుడు అదే పట్టుదలను వారు కనబర్చాల్సి ఉంది. ఈ ఏడాది లంక బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కరుణరత్నే మరోసారి కీలకం కానున్నాడు. తన తాజా ఫామ్‌ను అతను మరో రెండు ఇన్నింగ్స్‌ల పాటు కొనసాగించాలని లంక కోరుకుంటోంది. ఇక కుశాల్ మెండిస్, డిక్‌వెలా కూడా తమ బ్యాటింగ్ సామర్థ్యాన్ని గత మ్యాచ్‌లో చూపించారు. వీరితో పాటు మాథ్యూస్, కెప్టెన్ చండిమాల్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే శ్రీలంక మెరుగైన స్థితిలో నిలుస్తుంది. బౌలింగ్‌లో ఆ జట్టు కూడా ముగ్గురు పేసర్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విశ్వ ఫెర్నాండో, గమగేలను ఈ మ్యాచ్ కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేశారు. మూడో బౌలర్‌గా పేసర్ చమీరా లేదా చైనామన్ లక్షణ్ సందకన్‌లలో ఒకరికి చోటు దక్కుతుంది. విజయం కంటే కూడా ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా లంక పరువు దక్కుతుంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, ఉమేశ్, షమీ, భువనేశ్వర్/ పాండ్యా, కుల్దీప్.
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్‌వెలా, ధనంజయ డి సిల్వా, దిల్‌రువాన్ పెరీరా, ఫెర్నాండో, గమగే, చమీరా/ సందకన్.
‘జడేజా లేకపోవడం నిరాశ కలిగించేదే. ఆటగాళ్లకు ఐసీసీ నిబంధనలపై అవగాహన ఉండాలనే మాట వాస్తవం. అయితే నిబంధనల విషయంలో ఐసీసీ అన్ని సమయాలు, సందర్భాల్లో ఒకే తరహా విధానాన్ని పాటిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇలాంటి విషయంలో ఐసీసీ మరింత స్పష్టతనిస్తే మంచిది.’
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
గత మూడేళ్లలో శ్రీలంకలో ఒక్క టెస్టు కూడా ‘డ్రా’ కాలేదు. ఈ మధ్య కాలంలో జరిగిన మొత్తం 18 టెస్టులలోనూ ఫలితం వచ్చింది.
పిచ్, వాతావరణం
పల్లెకెలె మైదానం సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలం. మంచి బౌన్స్‌తో పాటు ఆరంభంలో స్వింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా నిలబడితే ఆ తర్వాత పరుగులు రాబట్టవచ్చు. ఇక్కడ వర్షం చాలా సహజం. కాబట్టి మ్యాచ్‌కు అప్పుడప్పుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం