ఆధిపత్యం కొనసాగేనా! | India vs Sri Lanka match today | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం కొనసాగేనా!

Published Mon, Feb 29 2016 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

ఆధిపత్యం కొనసాగేనా!

ఆధిపత్యం కొనసాగేనా!

నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్
గెలిస్తే ఫైనల్‌కు అర్హత
ధోని, రోహిత్ గాయాలపై సందిగ్ధత
ఆసియా కప్ టి20 టోర్నీ  

 
దాదాపు రెండు వారాల క్రితమే ఇరు జట్లు ప్రత్యర్థులుగా తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ఓడినా... ఆ తర్వాత భారత్ పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో లంకను చిత్తు చేసింది. దానికి కొనసాగింపుగానా అన్నట్లు ఆసియా వేదికపై ఈ జట్లు మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. భారత జట్టులో ఎలాంటి మార్పు లేకపోయినా... లంక కొంత మంది సీనియర్ల చేరికతో కాస్త మెరుగైంది. అయినాగానీ వరుస విజయాలతో ఊపు మీదున్న ధోని సేనదే పైచేయిగా కనిపిస్తోంది. మరోసారి మన జట్టు ఆధిపత్యం కొనసాగిస్తుందా లేక లంక కోలుకొని పోటీనిస్తుందా చూడాలి.
 
 
మిర్పూర్: టి20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు అద్భుతంగా కొనసాగిస్తున్న భారత జట్టు అదే జోరులో మరో మ్యాచ్ విజయంపై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌లో భాగంగా నేడు (మంగళవారం) జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంకతో తలపడుతుంది. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఓడించిన భారత్ ఉత్సాహంగా ఉండగా... యూఏఈపై గెలిచినా, బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయంతో లంక ఆత్మవిశ్వాసం తగ్గింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.


మార్పులు ఉంటాయా...
ఆస్ట్రేలియాతో మొదలు పెట్టి ఈ ఏడాది వరుసగా ఎనిమిది టి20 మ్యాచ్‌లు ఆడిన భారత్ గత మ్యాచ్‌లో మాత్రమే శిఖర్ ధావన్ గాయపడటంతో తుది జట్టులో ఒక మార్పు చేసింది. అయితే నేటి మ్యాచ్‌లో ఆడే జట్టుపై మరింత సందేహం నెలకొంది. తొలి మ్యాచ్‌నుంచే వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ ధోని ఆడతాడా లేదా అనేది స్పష్టం కాలేదు. ధావన్ ఇంకా కోలుకోకపోగా... గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ కాలి బొటనవేలుకు గాయమైంది. మ్యాచ్‌కు ముందే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ కోలుకోకపోతే పార్థివ్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండగా, రైనా మాత్రం తడబడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా కష్టపడి వికెట్ కాపాడుకోగలిగిన యువరాజ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటం లేదు. వీరిద్దరికి ఇది మంచి అవకాశం.

మరోవైపు బౌలింగ్‌లో వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఆడిన ఆశిష్ నెహ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే భువనేశ్వర్‌ను ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు చక్కగా బౌలింగ్ చేస్తుండటంతో మన పేస్ బలం బాగానే ఉంది. స్పిన్‌లో కూడా అశ్విన్, జడేజాలను లంక బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్ శర్మ హాజరు కాలేదు. ధోని, ధావన్ సాధనలో పాల్గొన్నా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఆరంభంలోనే నెట్స్‌లోకి వచ్చిన పార్థివ్ ఎక్కువ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.


 మలింగ మళ్లీ దూరం!
బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయంతో శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. భారత్ చేతిలోనూ ఓడితే ఆ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు క్షీణిస్తాయి. గత మ్యాచ్‌లో గాయంతో మలింగ ఆడకపోవడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. అతని గాయం తిరగబడిందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ సహచరుడు మ్యాథ్యూస్ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా మలింగ బరిలోకి దిగడం సందేహంగానే ఉంది.

టోర్నీలో చండీమల్ మినహా ఏ బ్యాట్స్‌మన్ కూడా కనీస ప్రదర్శన కనబర్చలేదు. సీనియర్లు దిల్షాన్, మ్యాథ్యూస్, పెరీరా కలిసికట్టుగా విఫలం అవుతుండటంతో లంక పరిస్థితి మరింత దిగజారింది. వీరిలో కనీసం ఇద్దరైనా ధాటిగా ఆడితే ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించగలుగుతుంది. బౌలింగ్‌లో కూడా కులశేఖర పెద్దగా ప్రభావం చూపలేకపోగా, హెరాత్ స్పిన్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సమస్య కాదు. మలింగ లేకపోతే ఆ జట్టు బౌలింగ్ మరీ బలహీనంగా మారిపోతుంది. దాంతో యువ ఆటగాళ్లు సిరివర్దన, షనక, చమీరాలు కీలకం కానున్నారు.

 తుది జట్ల వివరాలు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ/పార్థివ్, రహానే, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.
శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), చండీమల్, తిలకరత్నే దిల్షాన్, జయసూర్య, తిసారా పెరీరా, సిరివర్దన, షనక, కపుగెదెర, కులశేఖర, చమీరా, రంగన  హెరాత్.

 పిచ్, వాతావరణం
ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఆరంభంలో ఇబ్బంది పడింది. అన్ని జట్ల పేసర్లు పిచ్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంతో భారీగా పరుగులు రాలేదు. ఈసారి కూడా మార్పు లేకుండా దాదాపుగా అదే వికెట్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి టాస్ కీలకం కావచ్చు. వర్ష సూచన లేదు.
 
ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు పెద్దగా అనుకూలించడం లేదనేది వాస్తవం. అయితే పరిస్థితులకు అనుగుణంగా మనం బౌలింగ్ మార్చుకోవాలి. టి20ల్లో వికెట్ తీయడమే కాదు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడం కూడా ముఖ్యం. నేను అదే పని చేస్తున్నాను. చివరి ఓవర్లలో మా బౌలింగ్ పదును పెరిగింది. నెహ్రా అనుభవం ఎంతో ఉపయోగపడుతుండగా, బుమ్రా యార్కర్లు, భిన్నమైన యాక్షన్‌తో చెలరేగుతున్నాడు. ఎవరు విడిగా బాగా ఆడినా జట్టుగా మంచి ఫలితాలు సాధించడమే ముఖ్యం. శ్రీలంకతో చాలా ఎక్కువగా ఆడాం కాబట్టి ఇరు జట్లకూ ప్రత్యర్థి బలాబలాల గురించి బాగా తెలుసు.     -అశ్విన్, భారత బౌలర్
 

 
పాటల పల్లకి...
బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ అధికారిక నివాసంలో ఆదివారం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నంత సేపూ ఆటగాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడా తనదైన శైలిలో ఉత్సాహం ప్రదర్శించిన విరాట్ కోహ్లి ‘జో వాదా కియా వో నిభానా పడేగా’ అంటూ తాజ్‌మహల్ చిత్రంలోని పాటను భావుకతతో పాడేశాడు. నేనేం తక్కువ కాదన్నట్లు సురేశ్ రైనా కూడా తుమ్‌సే మిల్‌కే... (పరిందా) అంటూ తనలోని గాయకుడిని బయటపెట్టడంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది.
    
 రాత్రి గం. 7 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement