T20 Asia Cup tournament
-
పాక్‌కు ఊరట విజయం
► ఆఖరి మ్యాచ్‌లో లంకపై గెలుపు ► రాణించిన సర్ఫరాజ్, అక్మల్ ► ఆసియా కప్ టి20 టోర్నీ మిర్పూర్: కీలకమైన టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు ఊరట విజయం లభించింది. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. దిల్షాన్ (56 బంతుల్లో 75 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), చండిమల్ (49 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. పాక్ బౌలర్లు లైన్ తప్పడంతో ఈ ఇద్దరు బౌండరీల మోత మోగించారు. ఆరో ఓవర్లో దిల్షాన్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి లంక స్కోరు 44/0కు చేరింది. తర్వాత కూడా ఈ జోడి ఓవర్‌కు ఏడు రన్‌రేట్ నమోదు చేయడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. నవాజ్ వేసిన 14వ ఓవర్లో తొలి సిక్స్ బాదిన చండిమల్ తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 14.1 ఓవర్లలో 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓ ఎండ్‌లో దిల్షాన్ నికలడగా ఆడినా... రెండో ఎండ్‌లో జయసూర్య (4), కపుగెడెర (2), షనక (0)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ ముగ్గురు 10 బంతుల వ్యవధిలో అవుట్‌కావడంతో 117/1గా ఉన్న స్కోరు 125/4గా మారింది. ఇక చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావడంతో లంకకు గౌరవ ప్రదమైన స్కోరు దక్కింది. ఇర్ఫాన్‌కు 2 వికెట్లు పడ్డాయి. అనంతరం పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (37 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. షార్జిల్ ఖాన్ (24 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు)లు చెలరేగి ఆడారు. షోయబ్ మాలిక్ (17 బంతుల్లో 13 నాటౌట్), హఫీజ్ (14) ఫర్వాలేదనిపించారు. షార్జిల్తో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించిన సర్ఫరాజ్...ఉమర్ అక్మల్‌తో మూడో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. తర్వాత అక్మల్, మాలిక్‌లు నాలుగో వికెట్‌కు 37 బంతుల్లోనే 56 పరుగులు సమకూర్చడంతో పాక్ విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: చండిమల్ (సి) షార్జిల్ (బి) రియాజ్ 58; దిల్షాన్ నాటౌట్ 75; జయసూర్య (సి) షార్జిల్ (బి) షోయబ్ మాలిక్ 4; కపుగెడెర (బి) ఇర్ఫాన్ 2; షనక (బి) ఇర్ఫాన్ 0; సిరివర్ధన నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1-110; 2-117; 3-125; 4-125. బౌలింగ్: ఆమిర్ 4-0-31-0; ఇర్ఫాన్ 4-0-18-2; ఆఫ్రిది 4-0-24-0; నవాజ్ (3) 3-0-38-0; రియాజ్ 4-0-30-1; షోయబ్ మాలిక్ 1-0-3-1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జిల్ ఖాన్ (సి) కపుగెడెర (బి) దిల్షాన్ 31; హఫీజ్ (సి అండ్ బి) జయసూర్య 14; సర్ఫరాజ్ ఎల్బీడబ్ల్యు (బి) సిరివర్ధన 38; ఉమర్ అక్మల్ (సి) పెరీరా (బి) కులశేఖర 48; షోయబ్ మాలిక్ నాటౌట్ 13; ఇఫ్తికార్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (19.2 ఓవర్లలో 4 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1-23; 2-58; 3-94; 4-150. బౌలింగ్: కులశేఖర 4-0-20-1; పెరీరా 2.2-0-25-0; జయసూర్య 1-0-13-1; షనక 1-0-6-0; చమీరా 4-0-32-0; హెరాత్ 4-0-28-0; దిల్షాన్ 1-0-2-1; సిరివర్ధన 2-0-20-1. -
ఓ పనైపోయింది!
► ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచిన భారత్ ► 9 వికెట్లతో ఓడిన యూఏఈ ► అగ్రస్థానంతో లీగ్ దశ ముగింపు ► ఆసియా కప్ టి20 టోర్నీ ఆసియాకప్‌లో ఒక మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్‌కు చేరిన భారత్ ఆఖరి మ్యాచ్‌లో పసికూన యూఏఈని కూడా చిత్తు చేసింది. పనిలోపనిగా ఇన్నాళ్లూ బెంచ్ మీద కూర్చున్న ముగ్గురు బౌలర్లు హర్భజన్, నేగి, భువనేశ్వర్లకూ అవకాశం ఇచ్చింది. దీనిని ఈ త్రయం చక్కగా వినియోగించుకుని బెంచ్ బలంగా ఉందని నిరూపించింది. మొత్తం మీద నాలుగో విజయంతో ఆసియాకప్ లీగ్ దశను ధోనిసేన అగ్రస్థానంతో ముగించింది. మిర్పూర్: ఇప్పటి వరకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన భారత బౌలర్లు... వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి కాకపోయినా... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యూఏఈని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో... గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. షైమాన్ అన్వర్ (48 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. పచ్చిక వికెట్‌పై ఆరంభంలో భువనేశ్వర్, బుమ్రాలు చెలరేగితే.. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. పరుగులు నిరోధించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దీంతో భాగస్వామ్యాలు నమోదు చేయడంలో యూఏఈ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఓవరాల్‌గా ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది. భువనేశ్వర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ధావన్ (20 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా... రోహిత్ జోరు కనబర్చాడు. ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పరుగులు వేగంగా వచ్చాయి. నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆరో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాది అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 35 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన యువరాజ్ (14 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) షెహజాద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. తర్వాత ధావన్‌తో కలిసి బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు సమకూర్చడంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ సొంతమైంది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు యూఏఈ ఇన్నింగ్స్: రోహన్ ముస్తఫా (సి) కోహ్లి (బి) పాండ్యా 11; స్వప్పిల్ పాటిల్ (సి అండ్ బి) భువనేశ్వర్ 1; షెహజాద్ (సి) రైనా (బి) బుమ్రా 0; అన్వర్ రనౌట్ 43; ఉస్మాన్ (సి) హర్భజన్ (బి) నేగి 9; జావేద్ (సి) నేగి (బి) హర్భజన్ 0; కలీమ్ (సి) పాండ్యా (బి) యువరాజ్ 2; ఫహద్ తారిక్ రనౌట్ 3; నవీద్ (సి) నేగి (బి) భువనేశ్వర్ 5; రజా నాటౌట్ 0; అహ్మద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-25; 4-51; 5-53; 6-62; 7-66; 8-80; 9-81. బౌలింగ్: భువనేశ్వర్ 4-2-8-2; బుమ్రా 4-0-23-1; పాండ్యా 3-1-11-1; హర్భజన్ 4-1-11-1; నేగి 3-0-16-1; యువరాజ్ 2-0-10-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నవీద్ (బి) అహ్మద్ 39; ధావన్ నాటౌట్ 16; యువరాజ్ నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 82. వికెట్ల పతనం: 1-43. బౌలింగ్: నవీద్ 4-0-21-0; జావేద్ 2-0-18-0; అహ్మద్ 2-0-23-1; షెహజాద్ 1.1-0-14-0; ముస్తఫా 1-0-6-0. మార్టిన్ క్రోకు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్ ధరించి మ్యాచ్ ఆడారు. అలాగే మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు మార్టిన్ అన్న జెఫ్ క్రో ఈ మ్యాచ్‌లో రిఫరీగా విధులు కొనసాగించారు. 59 ఈ మ్యాచ్‌లో భారత్ 59 బంతులు మిగిలుండగానే గెలిచింది. టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం (బంతులపరంగా). -
ఫైనల్లో బంగ్లాదేశ్
తమ ఆఖరి మ్యాచ్‌లో పాక్‌పై విజయం లంక కూడా అవుట్ మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ మరోసారి బెబ్బులిలా గర్జించింది. ఆసియా కప్ టి20 టోర్నీలో సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (30 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం బంగ్లా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సౌమ్య సర్కార్ (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చివర్లో మహ్ముదుల్లా (15 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు. చివరి 2 ఓవర్లలో బంగ్లా విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా, సమీ వేసిన 19వ ఓవర్లోనే బంగ్లా 15 పరుగులు రాబట్టి విజయం దిశగా దూసుకుపోయింది. టోర్నీలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన బంగ్లా ఫైనల్‌కు అర్హత సాధించగా... పాకిస్తాన్, శ్రీలంక ఇంటిముఖం పట్టనున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. పాక్, శ్రీలంకల నామమాత్రపు ఆఖరి లీగ్ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఖుర్రం (సి) ముష్ఫికర్ (బి) హుస్సేన్ 1; షర్జీల్ (బి) సన్నీ 10; హఫీజ్ (ఎల్బీ) (బి) మొర్తజా 2; సర్ఫరాజ్ (నాటౌట్) 58; అక్మల్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 4; మాలిక్ (సి) షబ్బీర్ (బి) సన్నీ 41; ఆఫ్రిది (సి) షబ్బీర్ (బి) హుస్సేన్ 0; అన్వర్ (సి) షబ్బీర్ (బి) హుస్సేన్ 13; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-1; 2-12; 3-18; 4-28; 5-98; 6-102; 7-129. బౌలింగ్: తస్కీన్ 4-1-14-1; హుస్సేన్ 4-0-25-3; సన్నీ 4-0-35-2; మొర్తజా 4-0-29-1; షకీబ్ 4-0-26-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (ఎల్బీ) (బి) ఇర్ఫాన్ 7; సర్కార్ (బి) ఆమిర్ 48; షబ్బీర్ (బి) ఆఫ్రిది 14; ముష్ఫికర్ (ఎల్బీ) (బి) మాలిక్ 12; షకీబ్ (బి) ఆమిర్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 22; మొర్తజా (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1-13; 2-46; 3-83; 4-88; 5-104. బౌలింగ్: ఆమిర్ 4-0-26-2; ఇర్ఫాన్ 4-0-23-1; సమీ 4-0-30-0; ఆఫ్రిది 4-0-20-1; అన్వర్ 2.1-0-25-0; మాలిక్ 1-0-3-1. -
తడబడి... నిలబడ్డారు
► యూఏఈపై నెగ్గిన పాకిస్తాన్ ► ఆమిర్ అద్భుత బౌలింగ్ ► మెరిసిన మాలిక్, అక్మల్ ► ఆసియా కప్ టి20 టోర్నమెంట్ మిర్పూర్: తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి పాకిస్తాన్ తొందరగానే కోలుకుంది. లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా... సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉమర్ అక్మల్ (46 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో పాక్ బోణీ చేసింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఫలితంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. షైమాన్ అన్వర్ (42 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అంజద్ జావేద్ (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉస్మాన్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో ఆమిర్ (4-1-6-2), ఇర్ఫాన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. యూఏఈ కెప్టెన్ అంజద్ జావేద్ ధాటికి మొహమ్మద్ హఫీజ్ (11), షర్జిల్ ఖాన్ (4), ఖుర్రం మంజూర్ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. దాంతో పాక్ 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్మల్, మాలిక్‌లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 13వ ఓవర్ వరకు నెమ్మదిగా ఆడిన ఈ జోడి... ఆ తర్వాత చెలరేగిపోయింది. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయింది. అయితే 16వ ఓవర్లో మాలిక్ ఇచ్చిన క్యాచ్‌ను ముస్తాక్ జారవిడవడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. అప్పటికి జట్టు గెలవాలంటే 24 బంతుల్లో 39 పరుగులు చేయాలి. ఆ తర్వాత యూఏఈ కెప్టెన్ అంజద్ జావేద్ వేసిన 18వ ఓవర్లో పాక్ 23 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది. ► 4 ఓవర్ల పూర్తి కోటాలో అతి తక్కువ ఎకానమీ (1.5)తో పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్ ఆమిర్. పాకిస్తాన్ తరఫున ఇది అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కాగా...ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాల రికార్డు హాంకాంగ్ బౌలర్ ఐజాజ్ ఖాన్ (4-1-4-2) పేరిట ఉంది. ► ఒక టి20 మ్యాచ్‌లో అత్యధికంగా 21 పరుగులివ్వని బంతులు వేసిన రికార్డును ఆమిర్ సమం చేశాడు. గతంలో ఎంపొఫు (జింబాబ్వే), బుఖారి (నెదర్లాండ్స్) ఈ ఘనత సాధించారు. ► పాకిస్తాన్‌కు ఇది 100వ టి20 మ్యాచ్. ఈ మైలురాయిని చేరిన మొదటి జట్టుగా గుర్తింపు పొందింది. ► అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు కలిపి (మూడు ఫార్మాట్లలో) ఆఫ్రిది 1000 వికెట్లు పడగొట్టాడు. -
ఆధిపత్యం కొనసాగేనా!
► నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్ ► గెలిస్తే ఫైనల్‌కు అర్హత ► ధోని, రోహిత్ గాయాలపై సందిగ్ధత ► ఆసియా కప్ టి20 టోర్నీ దాదాపు రెండు వారాల క్రితమే ఇరు జట్లు ప్రత్యర్థులుగా తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ఓడినా... ఆ తర్వాత భారత్ పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో లంకను చిత్తు చేసింది. దానికి కొనసాగింపుగానా అన్నట్లు ఆసియా వేదికపై ఈ జట్లు మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. భారత జట్టులో ఎలాంటి మార్పు లేకపోయినా... లంక కొంత మంది సీనియర్ల చేరికతో కాస్త మెరుగైంది. అయినాగానీ వరుస విజయాలతో ఊపు మీదున్న ధోని సేనదే పైచేయిగా కనిపిస్తోంది. మరోసారి మన జట్టు ఆధిపత్యం కొనసాగిస్తుందా లేక లంక కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. మిర్పూర్: టి20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు అద్భుతంగా కొనసాగిస్తున్న భారత జట్టు అదే జోరులో మరో మ్యాచ్ విజయంపై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌లో భాగంగా నేడు (మంగళవారం) జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంకతో తలపడుతుంది. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించిన భారత్ ఉత్సాహంగా ఉండగా... యూఏఈపై గెలిచినా, బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయంతో లంక ఆత్మవిశ్వాసం తగ్గింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మార్పులు ఉంటాయా... ఆస్ట్రేలియాతో మొదలు పెట్టి ఈ ఏడాది వరుసగా ఎనిమిది టి20 మ్యాచ్‌లు ఆడిన భారత్ గత మ్యాచ్‌లో మాత్రమే శిఖర్ ధావన్ గాయపడటంతో తుది జట్టులో ఒక మార్పు చేసింది. అయితే నేటి మ్యాచ్‌లో ఆడే జట్టుపై మరింత సందేహం నెలకొంది. తొలి మ్యాచ్‌నుంచే వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ ధోని ఆడతాడా లేదా అనేది స్పష్టం కాలేదు. ధావన్ ఇంకా కోలుకోకపోగా... గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ కాలి బొటనవేలుకు గాయమైంది. మ్యాచ్‌కు ముందే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ కోలుకోకపోతే పార్థివ్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండగా, రైనా మాత్రం తడబడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా కష్టపడి వికెట్ కాపాడుకోగలిగిన యువరాజ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటం లేదు. వీరిద్దరికి ఇది మంచి అవకాశం. మరోవైపు బౌలింగ్‌లో వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఆడిన ఆశిష్ నెహ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే భువనేశ్వర్‌ను ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు చక్కగా బౌలింగ్ చేస్తుండటంతో మన పేస్ బలం బాగానే ఉంది. స్పిన్‌లో కూడా అశ్విన్, జడేజాలను లంక బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్ శర్మ హాజరు కాలేదు. ధోని, ధావన్ సాధనలో పాల్గొన్నా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఆరంభంలోనే నెట్స్‌లోకి వచ్చిన పార్థివ్ ఎక్కువ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మలింగ మళ్లీ దూరం! బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయంతో శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. భారత్ చేతిలోనూ ఓడితే ఆ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు క్షీణిస్తాయి. గత మ్యాచ్‌లో గాయంతో మలింగ ఆడకపోవడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. అతని గాయం తిరగబడిందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ సహచరుడు మ్యాథ్యూస్ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా మలింగ బరిలోకి దిగడం సందేహంగానే ఉంది. టోర్నీలో చండీమల్ మినహా ఏ బ్యాట్స్‌మన్ కూడా కనీస ప్రదర్శన కనబర్చలేదు. సీనియర్లు దిల్షాన్, మ్యాథ్యూస్, పెరీరా కలిసికట్టుగా విఫలం అవుతుండటంతో లంక పరిస్థితి మరింత దిగజారింది. వీరిలో కనీసం ఇద్దరైనా ధాటిగా ఆడితే ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించగలుగుతుంది. బౌలింగ్‌లో కూడా కులశేఖర పెద్దగా ప్రభావం చూపలేకపోగా, హెరాత్ స్పిన్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సమస్య కాదు. మలింగ లేకపోతే ఆ జట్టు బౌలింగ్ మరీ బలహీనంగా మారిపోతుంది. దాంతో యువ ఆటగాళ్లు సిరివర్దన, షనక, చమీరాలు కీలకం కానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ/పార్థివ్, రహానే, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), చండీమల్, తిలకరత్నే దిల్షాన్, జయసూర్య, తిసారా పెరీరా, సిరివర్దన, షనక, కపుగెదెర, కులశేఖర, చమీరా, రంగన హెరాత్. పిచ్, వాతావరణం ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఆరంభంలో ఇబ్బంది పడింది. అన్ని జట్ల పేసర్లు పిచ్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంతో భారీగా పరుగులు రాలేదు. ఈసారి కూడా మార్పు లేకుండా దాదాపుగా అదే వికెట్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి టాస్ కీలకం కావచ్చు. వర్ష సూచన లేదు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు పెద్దగా అనుకూలించడం లేదనేది వాస్తవం. అయితే పరిస్థితులకు అనుగుణంగా మనం బౌలింగ్ మార్చుకోవాలి. టి20ల్లో వికెట్ తీయడమే కాదు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడం కూడా ముఖ్యం. నేను అదే పని చేస్తున్నాను. చివరి ఓవర్లలో మా బౌలింగ్ పదును పెరిగింది. నెహ్రా అనుభవం ఎంతో ఉపయోగపడుతుండగా, బుమ్రా యార్కర్లు, భిన్నమైన యాక్షన్‌తో చెలరేగుతున్నాడు. ఎవరు విడిగా బాగా ఆడినా జట్టుగా మంచి ఫలితాలు సాధించడమే ముఖ్యం. శ్రీలంకతో చాలా ఎక్కువగా ఆడాం కాబట్టి ఇరు జట్లకూ ప్రత్యర్థి బలాబలాల గురించి బాగా తెలుసు. -అశ్విన్, భారత బౌలర్ పాటల పల్లకి... బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ అధికారిక నివాసంలో ఆదివారం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నంత సేపూ ఆటగాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడా తనదైన శైలిలో ఉత్సాహం ప్రదర్శించిన విరాట్ కోహ్లి ‘జో వాదా కియా వో నిభానా పడేగా’ అంటూ తాజ్‌మహల్ చిత్రంలోని పాటను భావుకతతో పాడేశాడు. నేనేం తక్కువ కాదన్నట్లు సురేశ్ రైనా కూడా తుమ్సే మిల్కే... (పరిందా) అంటూ తనలోని గాయకుడిని బయటపెట్టడంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
యూఏఈపై బంగ్లా గెలుపు
ఆసియా కప్ టి20 టోర్నీ మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ కోలుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 51 పరుగుల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్ మొహమ్మద్ మిథున్ (41 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 72/1తో ఒక దశలో మెరుగ్గా కనిపించిన బంగ్లా... యూఈఏ బౌలర్లు రాణించడంతో 61 పరుగులకు మిగతా 7 వికెట్లు కోల్పోయింది. చివర్లో మహ్ముదుల్లా (27 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బౌలింగ్‌లో నవీద్ (2/12), జావేద్ (2/34) రాణించారు. అనంతరం యూఈఏ 17.4 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్ ఉస్మాన్ (30 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. మొర్తజా (2/12), ముస్తఫిజుర్ (2/18), మహ్ముదుల్లా (2/5), షకీబ్ (2/20) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మహ్ముదుల్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.