ఓ పనైపోయింది!
► ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచిన భారత్
► 9 వికెట్లతో ఓడిన యూఏఈ
► అగ్రస్థానంతో లీగ్ దశ ముగింపు
► ఆసియా కప్ టి20 టోర్నీ
ఆసియాకప్‌లో ఒక మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్‌కు చేరిన భారత్ ఆఖరి మ్యాచ్‌లో పసికూన యూఏఈని కూడా చిత్తు చేసింది. పనిలోపనిగా ఇన్నాళ్లూ బెంచ్ మీద కూర్చున్న ముగ్గురు బౌలర్లు హర్భజన్, నేగి, భువనేశ్వర్‌లకూ అవకాశం ఇచ్చింది. దీనిని ఈ త్రయం చక్కగా వినియోగించుకుని బెంచ్ బలంగా ఉందని నిరూపించింది. మొత్తం మీద నాలుగో విజయంతో ఆసియాకప్ లీగ్ దశను ధోనిసేన అగ్రస్థానంతో ముగించింది.
మిర్పూర్: ఇప్పటి వరకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన భారత బౌలర్లు... వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి కాకపోయినా... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యూఏఈని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత్ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో... గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. షైమాన్ అన్వర్ (48 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. పచ్చిక వికెట్‌పై ఆరంభంలో భువనేశ్వర్, బుమ్రాలు చెలరేగితే.. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. పరుగులు నిరోధించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దీంతో భాగస్వామ్యాలు నమోదు చేయడంలో యూఏఈ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఓవరాల్‌గా ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది. భువనేశ్వర్ 2 వికెట్లు తీశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ధావన్ (20 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా... రోహిత్ జోరు కనబర్చాడు. ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పరుగులు వేగంగా వచ్చాయి. నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆరో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాది అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 35 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన యువరాజ్ (14 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) షెహజాద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. తర్వాత ధావన్‌తో కలిసి బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు సమకూర్చడంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ సొంతమైంది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
యూఏఈ ఇన్నింగ్స్: రోహన్ ముస్తఫా (సి) కోహ్లి (బి) పాండ్యా 11; స్వప్పిల్ పాటిల్ (సి అండ్ బి) భువనేశ్వర్ 1; షెహజాద్ (సి) రైనా (బి) బుమ్రా 0; అన్వర్ రనౌట్ 43; ఉస్మాన్ (సి) హర్భజన్ (బి) నేగి 9; జావేద్ (సి) నేగి (బి) హర్భజన్ 0; కలీమ్ (సి) పాండ్యా (బి) యువరాజ్ 2; ఫహద్ తారిక్ రనౌట్ 3; నవీద్ (సి) నేగి (బి) భువనేశ్వర్ 5; రజా నాటౌట్ 0; అహ్మద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 81.
వికెట్ల పతనం: 1-1; 2-2; 3-25; 4-51; 5-53; 6-62; 7-66; 8-80; 9-81.
బౌలింగ్: భువనేశ్వర్ 4-2-8-2; బుమ్రా 4-0-23-1; పాండ్యా 3-1-11-1; హర్భజన్ 4-1-11-1; నేగి 3-0-16-1; యువరాజ్ 2-0-10-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నవీద్ (బి) అహ్మద్ 39; ధావన్ నాటౌట్ 16; యువరాజ్ నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 82. వికెట్ల పతనం: 1-43.
బౌలింగ్: నవీద్ 4-0-21-0; జావేద్ 2-0-18-0; అహ్మద్ 2-0-23-1; షెహజాద్ 1.1-0-14-0; ముస్తఫా 1-0-6-0.
మార్టిన్ క్రోకు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్ ధరించి మ్యాచ్ ఆడారు. అలాగే మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు మార్టిన్ అన్న జెఫ్ క్రో ఈ మ్యాచ్‌లో రిఫరీగా విధులు కొనసాగించారు.
59 ఈ మ్యాచ్‌లో భారత్ 59 బంతులు మిగిలుండగానే గెలిచింది. టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం (బంతులపరంగా).