తడబడి... నిలబడ్డారు | T20 Asia Cup tournament | Sakshi
Sakshi News home page

తడబడి... నిలబడ్డారు

Feb 29 2016 11:23 PM | Updated on Sep 3 2017 6:42 PM

తడబడి... నిలబడ్డారు

తడబడి... నిలబడ్డారు

తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి పాకిస్తాన్ తొందరగానే కోలుకుంది. లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా...

యూఏఈపై నెగ్గిన పాకిస్తాన్
ఆమిర్ అద్భుత బౌలింగ్
మెరిసిన మాలిక్, అక్మల్
ఆసియా కప్ టి20 టోర్నమెంట్

  
మిర్పూర్:  తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి పాకిస్తాన్ తొందరగానే కోలుకుంది. లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా... సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉమర్ అక్మల్ (46 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో పాక్ బోణీ చేసింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఫలితంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. షైమాన్ అన్వర్ (42 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అంజద్ జావేద్ (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉస్మాన్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో ఆమిర్ (4-1-6-2), ఇర్ఫాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

తర్వాత పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. యూఏఈ కెప్టెన్ అంజద్ జావేద్ ధాటికి మొహమ్మద్ హఫీజ్ (11), షర్జిల్ ఖాన్ (4), ఖుర్రం మంజూర్ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. దాంతో పాక్ 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్మల్, మాలిక్‌లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 13వ ఓవర్ వరకు నెమ్మదిగా ఆడిన ఈ జోడి... ఆ తర్వాత చెలరేగిపోయింది. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయింది. అయితే 16వ ఓవర్‌లో మాలిక్ ఇచ్చిన క్యాచ్‌ను ముస్తాక్ జారవిడవడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. అప్పటికి జట్టు గెలవాలంటే 24 బంతుల్లో 39 పరుగులు చేయాలి. ఆ తర్వాత యూఏఈ కెప్టెన్ అంజద్ జావేద్ వేసిన 18వ ఓవర్లో పాక్  23 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది.
   
4 ఓవర్ల పూర్తి కోటాలో అతి తక్కువ ఎకానమీ (1.5)తో పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్ ఆమిర్. పాకిస్తాన్ తరఫున ఇది అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కాగా...ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాల రికార్డు హాంకాంగ్ బౌలర్ ఐజాజ్ ఖాన్ (4-1-4-2) పేరిట ఉంది.

ఒక టి20 మ్యాచ్‌లో అత్యధికంగా 21 పరుగులివ్వని బంతులు వేసిన రికార్డును ఆమిర్ సమం చేశాడు. గతంలో ఎంపొఫు (జింబాబ్వే), బుఖారి (నెదర్లాండ్స్) ఈ ఘనత సాధించారు.

పాకిస్తాన్‌కు ఇది 100వ టి20 మ్యాచ్. ఈ మైలురాయిని చేరిన మొదటి జట్టుగా గుర్తింపు పొందింది.

అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు కలిపి (మూడు ఫార్మాట్‌లలో) ఆఫ్రిది 1000 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement