తడబడి... నిలబడ్డారు
► యూఏఈపై నెగ్గిన పాకిస్తాన్
► ఆమిర్ అద్భుత బౌలింగ్
► మెరిసిన మాలిక్, అక్మల్
► ఆసియా కప్ టి20 టోర్నమెంట్
మిర్పూర్: తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి పాకిస్తాన్ తొందరగానే కోలుకుంది. లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా... సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉమర్ అక్మల్ (46 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో పాక్ బోణీ చేసింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఫలితంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. షైమాన్ అన్వర్ (42 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అంజద్ జావేద్ (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉస్మాన్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో ఆమిర్ (4-1-6-2), ఇర్ఫాన్లకు రెండేసి వికెట్లు దక్కాయి.
తర్వాత పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. యూఏఈ కెప్టెన్ అంజద్ జావేద్ ధాటికి మొహమ్మద్ హఫీజ్ (11), షర్జిల్ ఖాన్ (4), ఖుర్రం మంజూర్ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. దాంతో పాక్ 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్మల్, మాలిక్‌లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 13వ ఓవర్ వరకు నెమ్మదిగా ఆడిన ఈ జోడి... ఆ తర్వాత చెలరేగిపోయింది. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయింది. అయితే 16వ ఓవర్లో మాలిక్ ఇచ్చిన క్యాచ్‌ను ముస్తాక్ జారవిడవడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. అప్పటికి జట్టు గెలవాలంటే 24 బంతుల్లో 39 పరుగులు చేయాలి. ఆ తర్వాత యూఏఈ కెప్టెన్ అంజద్ జావేద్ వేసిన 18వ ఓవర్లో పాక్ 23 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది.
► 4 ఓవర్ల పూర్తి కోటాలో అతి తక్కువ ఎకానమీ (1.5)తో పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్ ఆమిర్. పాకిస్తాన్ తరఫున ఇది అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కాగా...ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాల రికార్డు హాంకాంగ్ బౌలర్ ఐజాజ్ ఖాన్ (4-1-4-2) పేరిట ఉంది.
► ఒక టి20 మ్యాచ్‌లో అత్యధికంగా 21 పరుగులివ్వని బంతులు వేసిన రికార్డును ఆమిర్ సమం చేశాడు. గతంలో ఎంపొఫు (జింబాబ్వే), బుఖారి (నెదర్లాండ్స్) ఈ ఘనత సాధించారు.
► పాకిస్తాన్‌కు ఇది 100వ టి20 మ్యాచ్. ఈ మైలురాయిని చేరిన మొదటి జట్టుగా గుర్తింపు పొందింది.
► అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు కలిపి (మూడు ఫార్మాట్లలో) ఆఫ్రిది 1000 వికెట్లు పడగొట్టాడు.