ఫైనల్లో బంగ్లాదేశ్
తమ ఆఖరి మ్యాచ్‌లో పాక్‌పై విజయం లంక కూడా అవుట్
మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ మరోసారి బెబ్బులిలా గర్జించింది. ఆసియా కప్ టి20 టోర్నీలో సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (30 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం బంగ్లా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సౌమ్య సర్కార్ (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చివర్లో మహ్ముదుల్లా (15 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.
చివరి 2 ఓవర్లలో బంగ్లా విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా, సమీ వేసిన 19వ ఓవర్లోనే బంగ్లా 15 పరుగులు రాబట్టి విజయం దిశగా దూసుకుపోయింది. టోర్నీలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన బంగ్లా ఫైనల్‌కు అర్హత సాధించగా... పాకిస్తాన్, శ్రీలంక ఇంటిముఖం పట్టనున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. పాక్, శ్రీలంకల నామమాత్రపు ఆఖరి లీగ్ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఖుర్రం (సి) ముష్ఫికర్ (బి) హుస్సేన్ 1; షర్జీల్ (బి) సన్నీ 10; హఫీజ్ (ఎల్బీ) (బి) మొర్తజా 2; సర్ఫరాజ్ (నాటౌట్) 58; అక్మల్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 4; మాలిక్ (సి) షబ్బీర్ (బి) సన్నీ 41; ఆఫ్రిది (సి) షబ్బీర్ (బి) హుస్సేన్ 0; అన్వర్ (సి) షబ్బీర్ (బి) హుస్సేన్ 13; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 129.
వికెట్ల పతనం: 1-1; 2-12; 3-18; 4-28; 5-98; 6-102; 7-129.
బౌలింగ్: తస్కీన్ 4-1-14-1; హుస్సేన్ 4-0-25-3; సన్నీ 4-0-35-2; మొర్తజా 4-0-29-1; షకీబ్ 4-0-26-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (ఎల్బీ) (బి) ఇర్ఫాన్ 7; సర్కార్ (బి) ఆమిర్ 48; షబ్బీర్ (బి) ఆఫ్రిది 14; ముష్ఫికర్ (ఎల్బీ) (బి) మాలిక్ 12; షకీబ్ (బి) ఆమిర్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 22; మొర్తజా (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1-13; 2-46; 3-83; 4-88; 5-104.
బౌలింగ్: ఆమిర్ 4-0-26-2; ఇర్ఫాన్ 4-0-23-1; సమీ 4-0-30-0; ఆఫ్రిది 4-0-20-1; అన్వర్ 2.1-0-25-0; మాలిక్ 1-0-3-1.