సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ప్రేమించు..లేకుంటే ప్రాణం తీస్తా’ అంటూ కిరాతకంగా వ్యవహరించిన ప్రేమోన్మాదులు యువతుల గొంతుకోసిన దారుణ సంఘటనలు వేలూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. వేలూరు జిల్లా కేదాంతపట్టి గ్రామానికి చెందిన మునిరాజ్ కుమార్తె లావణ్య (23) హాస్టల్‌లో ఉంటూ కడలూరు జిల్లా చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లావణ్యకు ఆమె సొంతూరికి చెందిన వ్యక్తి, చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ (27)కు మధ్య స్నేహం ఉంది. అయితే నవీన్‌కుమార్ మాత్రం ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. దీంతో విసిగిపోయిన లావణ్య గత 20 రోజులుగా నవీన్‌కుమార్‌తో మాట్లాడడం మానేసింది. ఫోన్ కూడా తీయడం లేదు.
దీంతో సోమవారం ఉదయం చిదంబరానికి వచ్చిన నవీన్‌కుమార్‌నేరుగా లావణ్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి గేటుముందే నిలబడి మాట్లాడుకోవడంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపగించుకున్న నవీన్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి విచక్షణారహితంగా ముఖంపై కత్తితో దాడిచేశాడు. లావణ్య పెట్టిన కేకలకు పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు ఉలిక్కిపడి ప్రేమోన్మాదిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు కత్తితో బెదిరించడంతో బలమైన రాళ్లు విసిరి యువతిని రక్షించారు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో సమీపంలోని లావణ్యను ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు నవీన్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలకు గురైన అన్ని ఆసుపత్రిలో చేర్పించి అన్నామలైనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాట్పాడిలో..
వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన షబ్బీర్ (23) అనే ఎంబీఏ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాం..లేకుంటే చంపేస్తాను అని బెదిరించేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులు గత నెల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువతిని అడ్డుకుని షబ్బీర్ కత్తితో గొంతుకోశాడు. ఆమె పెట్టిన కేకలతో జనం అక్కడికి చేరడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వేలూరు పోలీసులు షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment