ఆఫ్రిదికి ఎసరు!
► టి20 ప్రపంచకప్ తర్వాత ఉద్వాసన
► అక్మల్‌పై కూడా పీసీబీ ఆగ్రహం
కరాచీ: టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మరోసారి ఓటమిపై పాకిస్తాన్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. వీధుల్లోకి వచ్చిన అభిమానులు తమ టీవీ సెట్లను పగలగొట్టడంతో పాటు ఓటమిపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కగా... కెప్టెన్సీలో దారుణంగా విఫలమయ్యాడంటూ ఆఫ్రిదిపై మాజీలు విరుచుకుపడ్డారు. భారత్‌తో మ్యాచ్‌లో ఆఫ్రిది ఏమాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎమాద్ వాసిమ్‌ను తీసుకోకుండా తప్పిదం చేశాడని విమర్శించారు. ఫామ్‌లో ఉన్న హఫీజ్‌ను పక్కనబెట్టి ఆఫ్రిది వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగడాన్ని వారు ప్రశ్నించారు.
ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న షాహిద్ ఆఫ్రిది నాయకత్వానికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఆఫ్రిది ప్రదర్శనపై.. కెప్టెన్సీపై బోర్డులో అసంతృప్తి నెలకొంది. ఈ టోర్నీ అనంతరం అతడు రిటైర్‌మెంట్ కాకుంటే మాత్రం కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఆటగాడిగా కూడా కొనసాగే అవకాశాలు తక్కువే. అలాగే కప్ గెలిచినా కూడా ప్రస్తుత సెలక్షన్ కమిటీకి ఉద్వాసన పలకడం ఖాయం’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
అక్మల్‌పై పీసీబీ ఆగ్రహం
భారత్‌తో మ్యాచ్‌లో తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకునేందుకు పాక్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ సహాయం తీసుకున్న ఉమర్ అక్మల్‌పై పీసీబీ ఆగ్రహంతో ఉంది. ఇమ్రాన్‌తో ఉమర్ మాట్లాడిన విషయాలు టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. కోల్‌కతాలోనే ఉన్న పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీమ్ మేనేజిమెంట్‌తో మాట్లాడారు. స్వార్థంగా ఆలోచించే ఉమర్‌ను ఇతర మ్యాచ్‌ల్లో ఆడనీయొద్దని రమీజ్ రాజా సూచించారు.