► సమస్యల పరిష్కారానికి పిలుపు
సెయింట్ జాన్స్/కోల్‌కతా: ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ ఆటగాళ్లకు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైనల్ గెలిచిన అనంతరం తమ బోర్డు నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని కెప్టెన్ స్యామీ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను విండీస్ బోర్డు తప్పుపట్టింది. స్యామీ విమర్శలకు దిగిన కొద్దిసేపటికే బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్ ప్రకటన చేశారు. ‘బోర్డును రచ్చకీడ్చడం స్యామీకి సరికాదు. స్టేడియంలో స్యామీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నాను’ అని అన్నారు.
అలాగే తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆటగాళ్లకు పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సమస్యలపై జూన్‌లో చర్చిస్తామని తెలిపారు. మరోవైపు తమ జట్టుకు విండీస్ బోర్డుకన్నా బీసీసీఐ మద్దతుగా నిలిచిందని ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. టైటిల్ గెలిచినా బోర్డు అధికారులు ఇప్పటికీ తమకు ఫోన్ చేయలేదని, అసలు టి20 ప్రపంచకప్ గెలవాలని వారు కోరుకోలేదని ఆరోపించాడు.
నికోలస్ క్షమాపణలు
వెస్టిండీస్ ఆటగాళ్లకు బుర్ర లేదని తన కాలమ్‌లో పేర్కొన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. ‘డారెన్ స్యామీకి, జట్టు ఆటగాళ్లకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నిజానికి ఆటగాళ్లకు బుర్ర లేదని నేను చెప్పలేదు. అయితే ఓ గొప్ప క్రికెట్ వారసత్వం కలిగిన విండీస్ గురించి అలాంటి అర్థం ధ్వనించేలా రాయాల్సింది కాదు’ అని నికోలస్ అన్నారు.
స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం
Published Tue, Apr 5 2016 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement