పొలార్డ్కు 'నో' ఛాన్స్!
ఆంటిగ్వా:గత కొంతకాలంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ)కి ఆటగాళ్లకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఆ దేశంలో క్రికెట్ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానంగా జీతభత్యాల విషయంలో ఆటగాళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై గత కొంత కాలంగా క్రికెటర్లకు, బోర్డుకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమ మాట వినే ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తున్న విండీస్ క్రికెట్ బోర్డు...కీలకమైన ఆటగాళ్లను సైతం పక్కకు పెట్టడానికి వెనుకడుగు వేయడం లేదు.
అయితే తాజాగా తమ దేశ క్రికెటర్లు విదేశీ లీగ్లు ఆడితే అందులో 20 శాతం సొమ్మును తమకు చెల్లించాలంటూ విండీస్ బోర్డు నిబంధన విధించింది. ఏ విండీస్ ఆటగాడైన తమ దేశానికి అవతల జరిగే ట్వంటీ 20 టోర్నమెంట్లో పాల్గొన్నట్లైతే అందులోని 20 శాతం సొమ్మును బోర్డుకు చెల్లించాలంటూ నిబంధన పెట్టింది. అలా అయితేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) ఇస్తామని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా ట్వంటీ 20 లీగ్ రామ్ స్లామ్లో ఆడటానికి రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న పొలార్డ్కు ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. వెస్టిండీస్ జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా విదేశీ లీగ్లో ఆడటానికి వెళ్లే ముందు 20 శాతం ఫీజును చెల్లించడానికి అంగీకరించి ఎన్ఓసీ తీసుకోవాలని పేర్కొంది. దాంతో త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ఆ లీగ్లో పొలార్డ్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆ నిబంధనకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అంగీకరించకపోవడంతో రామ్ స్లామ్ లో పొలార్డ్ పొల్గొనడం సందిగ్ధంలో పడింది.