WICB
-
కీలక బ్యాట్స్ మన్ పై వేటు
సెయింట్ జాన్స్: కీలక బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీబీ) షాక్ ఇచ్చింది. ‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదంతో అతడిపై వేటు వేసింది. జింబాబ్వేలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఫలితంగా బ్రావోపై వేటు పడింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ జాసన్ మహ్మద్ ను జట్టులోకి తీసుకున్నారు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. వ్యక్తిగత కారణాలతో వైదొలగిన సునీల్ నరైన్ స్థానంలో బిషూను తీసుకున్నారు. -
పొలార్డ్‌కు 'నో' ఛాన్స్!
ఆంటిగ్వా:గత కొంతకాలంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ)కి ఆటగాళ్లకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఆ దేశంలో క్రికెట్ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానంగా జీతభత్యాల విషయంలో ఆటగాళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై గత కొంత కాలంగా క్రికెటర్లకు, బోర్డుకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమ మాట వినే ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తున్న విండీస్ క్రికెట్ బోర్డు...కీలకమైన ఆటగాళ్లను సైతం పక్కకు పెట్టడానికి వెనుకడుగు వేయడం లేదు. అయితే తాజాగా తమ దేశ క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడితే అందులో 20 శాతం సొమ్మును తమకు చెల్లించాలంటూ విండీస్ బోర్డు నిబంధన విధించింది. ఏ విండీస్ ఆటగాడైన తమ దేశానికి అవతల జరిగే ట్వంటీ 20 టోర్నమెంట్లో పాల్గొన్నట్లైతే అందులోని 20 శాతం సొమ్మును బోర్డుకు చెల్లించాలంటూ నిబంధన పెట్టింది. అలా అయితేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) ఇస్తామని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా ట్వంటీ 20 లీగ్ రామ్ స్లామ్లో ఆడటానికి రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న పొలార్డ్‌కు ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. వెస్టిండీస్ జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా విదేశీ లీగ్‌లో ఆడటానికి వెళ్లే ముందు 20 శాతం ఫీజును చెల్లించడానికి అంగీకరించి ఎన్ఓసీ తీసుకోవాలని పేర్కొంది. దాంతో త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ఆ లీగ్‌లో పొలార్డ్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆ నిబంధనకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అంగీకరించకపోవడంతో రామ్ స్లామ్ లో పొలార్డ్ పొల్గొనడం సందిగ్ధంలో పడింది. -
పాక్ ను చూసి నేర్చుకోండి!
అబుదాబి: వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో వ్యాఖ్యలు దేశ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీ)ను తీవ్రనిరాశపరిచాయని, అయితే ఓ ఒక్కరు షాక్ కు గురికాలేదని టీమ్ మేనేజర్ జోయెల్ గార్నర్ అన్నాడు. కోచ్ గా సేవలందించి విజయవంతమైన ఫిల్ సిమ్మన్స్ ను అర్ధాంతరంగా తొలగించడాన్ని విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో తీవ్రంగా విమర్శించగా.. జట్టులోని ఆటగాళ్లపై ఈ ప్రభావం పడుతుందని గార్నర్ ఆందోళన వ్యక్తంచేశాడు. అందులోనూ ప్రస్తుతం పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఓటమిపాలు కాగా, టీ20 సిరీస్ లోవైట్ వాట్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు. బుధవారం మూడో వన్డే జరగనున్న తరుణంలో ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నాడని బ్రేవోపై ఆరోపణలు చేశాడు. ఆటగాళ్లను మళ్లీ స్కూలు పిల్లల మాదిరిగా ట్రీట్ చేస్తున్నారని బ్రేవో మండిపడ్డ విషయం తెలిసిందే. సిరీస్ కు ఎలా సన్నధ్దమవ్వాలో, ఆటలో మంచి ప్రదర్శన ఎలా చేయాలో పాక్ జట్టును చూసి నేర్చుకోవాలని గార్నర్ విండీస్ ఆటగాళ్లకు సూచించాడు. ఆటగాళ్లు పాకిస్తాన్ తో సిరీస్ లకు పూర్తిగా సన్నద్ధమయ్యారని అయితే పరిస్థితులకు అనుగుణంగా రాణించలేక వైఫల్యం చెందారని గార్నర్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 10, 11 తేదీలలో బార్బడోస్ లో ఆటగాళ్లకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించామని, ఆ తర్వాతే పాక్ తో ఆడే జట్టును ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నో విషయాలపై నోరు విప్పిన మేనేజర్ మాత్రం.. దుబాయ్ కి బయలుదేరే సమయంలో ఏ క్రికెట్ బోర్డ్ అయినా ప్రధాన కోచ్ ను తప్పిస్తుందా అన్న బ్రేవో కామెంట్ పై మాత్రం స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. -
నైతికతను వదిలేశారు: బ్రేవో
ఆంటిగ్వా:ఇటీవల తమ దేశ క్రికెట్ కోచ్ గా సేవలందించి విజయవంతమైన ఫిల్ సిమ్మన్స్ ను అర్ధాంతరంగా తొలగించడాన్ని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో తీవ్రంగా తప్పుబట్టాడు. ఒక కోచ్ ను తప్పించే ముందు కనీస ప్రమాణాలు పాటించుకుండా వెస్టిండీస్ బోర్డు(డబ్యూఐసీ) పెద్దలు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నైతిక విలువల్ని వదిలేసింది. అది ఎక్కడైనా చూద్దామన్నా కనిపించడం లేదు. దాంతో పాటు మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా గంభీరంగా ఉంటుంది. పాకిస్తాన్ తో టీ 20 సిరీస్ జరుగుతున్న సమయంలో అదే కనబడింది. దీనంతటకీ కారణం మా క్రికెట్ బోర్డే' అని బ్రేవో అసహనం వ్యక్తం చేశాడు. తనకు క్రికెట్ అంటే అత్యంత ఇష్టమని, ఎప్పుడూ క్రికెట్ ఫీల్డ్ లో కి వెళ్లినా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తానని బ్రేవో ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. పాకిస్తాన్ తో సిరీస్ కు బయల్దేరి ముందు 15 మందితో కూడిన జట్టును ప్రకటించి వెళ్లి ఆడమనడం ఎంతవరకూ సమంజసమని బ్రేవో ప్రశ్నించాడు. ప్రపంచంలోని ఏ సంస్థ కూడా ఈ పద్ధతిలో వ్యవహరించడం లేదన్నాడు. -
ఇదే నా మీ తొలి చర్య?
ఆంటిగ్వా: వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్‌ను అర్థాంతరంగా తొలగించడంపై ఆ జట్టు మాజీ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అనవసరపు పట్టింపులకు పోయి జట్టును సర్వం నాశనం చేయడమే విండీస్ క్రికెట్ బోర్డు లక్ష్యంగా కనబడుతుందని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరో రెండు రోజుల్లో యూఏఈలో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని కోచ్ పదవి నుంచి సిమ్మన్స్ తప్పించడం బోర్డు అనాలోచిత చర్యగా స్యామీ పేర్కొన్నాడు. విండీస్ క్రికెట్ ను గాడిలో పెట్టడానికి చేపట్టిన తొలి చర్య ఇదేనా? అంటూ బోర్డు పెద్దలను ప్రశ్నించాడు. 'నన్ను తొలగించడంతో బోర్డు పెద్దల నైజం బయటపడింది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా కోచ్‌నే తీసేశారు. అది కూడా ఒక పర్యటనకు రెండు రోజుల ముందు కావడం బోర్డు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతుంది. గుడ్డిగా వెళితే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామన్న సంగతి గుర్తించుకుంటే మంచిది' అని స్యామీ చురకలంటిచాడు. -
స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం
► సమస్యల పరిష్కారానికి పిలుపు సెయింట్ జాన్స్/కోల్‌కతా: ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ ఆటగాళ్లకు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైనల్ గెలిచిన అనంతరం తమ బోర్డు నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని కెప్టెన్ స్యామీ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను విండీస్ బోర్డు తప్పుపట్టింది. స్యామీ విమర్శలకు దిగిన కొద్దిసేపటికే బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్ ప్రకటన చేశారు. ‘బోర్డును రచ్చకీడ్చడం స్యామీకి సరికాదు. స్టేడియంలో స్యామీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నాను’ అని అన్నారు. అలాగే తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆటగాళ్లకు పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సమస్యలపై జూన్‌లో చర్చిస్తామని తెలిపారు. మరోవైపు తమ జట్టుకు విండీస్ బోర్డుకన్నా బీసీసీఐ మద్దతుగా నిలిచిందని ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. టైటిల్ గెలిచినా బోర్డు అధికారులు ఇప్పటికీ తమకు ఫోన్ చేయలేదని, అసలు టి20 ప్రపంచకప్ గెలవాలని వారు కోరుకోలేదని ఆరోపించాడు. నికోలస్ క్షమాపణలు వెస్టిండీస్ ఆటగాళ్లకు బుర్ర లేదని తన కాలమ్‌లో పేర్కొన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. ‘డారెన్ స్యామీకి, జట్టు ఆటగాళ్లకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నిజానికి ఆటగాళ్లకు బుర్ర లేదని నేను చెప్పలేదు. అయితే ఓ గొప్ప క్రికెట్ వారసత్వం కలిగిన విండీస్ గురించి అలాంటి అర్థం ధ్వనించేలా రాయాల్సింది కాదు’ అని నికోలస్ అన్నారు. -
'మా బోర్డు కంటే బీసీసీఐ నయం'
కోల్‌కతా: వెస్టిండీస్ డాషింగ్ ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రావో, కెప్టెన్ డారెన్ స్యామీ తరహాలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. వెస్టిండీస్ బోర్డు కంటే బీసీసీఐ చాలా మద్దతుగా నిలిచిందని బ్రావో అన్నాడు. విండీస్ బోర్డు పగ్గాలు సరైన వ్యక్తుల చేతిలో లేవని బ్రావో విమర్శించాడు. టి-20 ప్రపంచ కప్ గెలిచినా బోర్డు అధికారులు లేదా డైరెక్టర్లు తమకు ఫోన్ కూడా చేయలేదని చెప్పాడు. తాము ప్రపంచ కప్ గెలుస్తామని బోర్డు అధికారులు నమ్మలేదని, గెలవాలని కోరుకోలేదని వ్యాఖ్యానించాడు. తమ బోర్డు కంటే బీసీసీఐ ఎక్కువ ఉపయోగపడిందన్నాడు. ఈ ఏడాది తమకు అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. జీతాల విషయంలో విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. -
స్యామీ.. నీ కన్నీరు వృథాకావద్దు!
కోల్ కతా: క్రికెట్ లో గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే ఒక జట్టు మ్యాచ్ ఆడాలంటే యూనిఫామ్ తప్పనిసరి. మండల స్థాయిలోనే ఈ నిబంధన కచ్చితంగా అమలవుతుంది. అలాంటిది ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ఘనత ఉన్న వెస్టిండీస్ జట్టుకు కనీసం యూనిఫామ్ కుట్టించే దిక్కులేకుండా పోయింది! వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని చెప్పాడు విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ. మ్యాచ్ అనంతరం ఈ మాటలు చెబుతూ స్యామీ కంటతడి పెట్టిన వైనం అందరినీ ఆలోచింపజేసింది. అనిశ్చితికి మారుపేరైన విండీస్ క్రికెట్ బోర్డును బోనులో నిల్చొబెట్టినట్టైంది. క్రికెట్ లో కేవలం కాసుల వర్షమేకాదు, కొందరు ఆటగాళ్ల కన్నీటి ధారలూ ఉంటాయని మరోసారి నిరూపించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో స్యామీ మాట్లాడుతూ.. 'మొదటిగా భగవంతుడికి కృతజ్ఞతలు. మా జట్టులో ఒక పాస్టర్ ఉన్నాడు. అతనితో కలిసి మేం కూడా నిరంతరం ప్రార్థనలు చేశాం. ఈ విజయం మాకు కలకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. సరిగ్గా నెలన్నర కిందట విండీస్ టీమ్ వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే సంశయం నెలకొంది. అనేక విషయాల్లో విండీస్ బోర్డు నిర్లక్ష్యానికి ఆటగాళ్లు బలయ్యే పరిస్థితి. మొత్తానికి 15 మందిమి ఎంపికయ్యాం. దుబాయ్ లో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటుచేశారు. జట్టుకు కొత్త మేనేజర్ గా లూవీస్ ను నియమించారు. ఆయనకు అనుభవం లేదు. ఇండియాకు వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతోంది. అప్పటికింకా యూనిఫామ్ సిద్ధంకాలేదు. మమ్మల్ని దుబాయ్ లోనే వదిలేసి మేనేజర్ వెళ్లిపోయాడు. మేం కోల్ కతా చేరుకున్నాం. మొత్తానికి మొదటి మ్యాచ్ కు ముందే యూనిఫామ్ లతో తిరిగొచ్చాడు మా మేనేజర్. విండీస్ బోర్డు పెద్దలు మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో కొంత మంది దృష్టిలో మేం చులకనైపోయాం. 'వెస్టిండీస్ ప్లేయర్లకు బ్రెయిన్ లేదు' అంటూ ఇంగ్లిష్ క్రికెటర్ మార్క్ నికోలస్ చేసిన వ్యాఖ్యలు మమ్మల్నీ తీవ్రంగా బాధించాయి. అయినాసరే మేం ఓర్చుకున్నాం. కోచింగ్ స్టాఫ్ మా వెన్నంటే ఉన్నారు. కరీబియన్ కమ్యూనిటీ(కారికామ్) పెద్దలు నిరంతరం ఫోన్లు చేస్తునే ఉన్నారు. నిరుత్సాహ పడొద్దంటూ మెసేజ్ లు, మెయిల్స్ పెట్టారు. ఫైనల్ మ్యాచ్ రోజున ఉదయం గ్రెనడా నుంచి కరీబియన్ ప్రధాని కీత్ మిఛెల్ మాతో ఫోన్లో మాట్లాడారు. వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ఒకరో, ఇద్దరో ఆటగాళ్లపై ఆధారపడేదికాదు. జట్టులో ఉండే 15 మందీ మ్యాచ్ విన్నర్లే. ఎవరికివారు తమంతటతామే బాధ్యత తీసుకున్నారు. అందుకే ఈ 15 మందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్ లో మేం కలిసి ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ మా అందరికీ ఇది చిరస్మరణీయ విజయం. ఈ విజయం కరీబియన్ ఫ్యాన్స్ కు అంకితం' అని ఈ ప్రపంచకప్ కోసం తామెంతగా కష్టపడింది చెప్పుకొచ్చాడు. స్యామీ ఎమోషనల్ స్పీచ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్ల విషయంలో విండీస్ క్రికెట్ బోర్డు తీరు మారాలనడమేకాక, 'స్యామీ.. నీ కన్నీరు వృథా కావద్దు' అని అభిమానులు కోరుకుంటున్నారు. -
2016లో విండీస్ పర్యటన
► నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్ సెయింట్ జాన్స్ (అంటిగ్వా): ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభణకు ఎట్టకేలకు గురువారం తెరపడింది. విండీస్‌తో సిరీస్‌ను పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది జూలై-ఆగస్టులో కరీబియన్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) నుంచి ఓ ప్రకటన వచ్చింది. ‘బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. 2016లో విండీస్‌లో సిరీస్ ఆడేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఒప్పందానికి మా బోర్డుతో పాటు ప్లేయర్స్ అసోసియేషన్ కట్టుబడి ఉంది. గతేడాది అర్ధంతరంగా టూర్ ముగిసింది. కాబట్టి ఇప్పుడు మరో సిరీస్ నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నాం’ అని డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామోరాన్ తెలిపారు. అయితే కామోరాన్ ఎక్కువ చొరవ చూపడంతో మనోహర్ హామీ ఇవ్వాల్సి వచ్చిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. -
నరైన్ కు అండగా విండీస్ బోర్డు
సెయింట్ జోన్స్:సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ కు గురైన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ కు ఊరట లభించింది. నరైన్ కు అండగా ఉంటామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) స్పష్టం చేసింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రిచర్డ్ పయ్ బస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రినిడాడ్ దేశవాళీ లీగ్ ద్వారా నరైన్ బౌలింగ్ ను మెరుగుపర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇది కచ్చితంగా నరైన్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మేలు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం అనుమానస్పద బౌలింగ్ కారణంగా సునీల్ నరైన్‌ను ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో నరైన్ బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 17న లాబోర్గ్‌లోని ఐసీసీ అక్రిడేటెడ్ ల్యాబ్‌లో స్పిన్నర్ బౌలింగ్‌ను పరీక్షించారు. నరైన్ బంతులు విసిరేటప్పుడు తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని తేలడంతో ఐసీసీ అతనిపై వేటు వేసింది. ఈ విషయాన్ని అన్ని క్రికెట్ సంఘాలు గుర్తించాలని ఐసీసీ తెలిపింది. దీంతో దేశవాళీ లీగ్‌ల్లోనూ నరైన్ ఆడటం అనుమానంగా మారిన నేపథ్యంలో విండీస్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా అతనికి గొప్ప ఉపశమనం లభించినట్లయ్యింది. -
రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్న క్రికెట్ బోర్డు
భారతదేశంలో సిరీస్‌ను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్లినందుకు దాదాపు 250 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తెలిపింది. వెస్టిండీస్ జట్టు భారత సిరీస్‌ను సగంలో వదిలిపెట్టి వెళ్లిపోయినందుకు తమకు భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు రావాలంటూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఒక్క మీడియా హక్కుల రూపంలోనే బీసీసీఐకి 35 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. టికెట్ అమ్మకాల రూపంలో మరో 2 మిలియన్ డాలర్లు, టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మైక్రోమాక్స్‌కు 1.6 మిలియన్ డాలర్లు.. ఇలా భారీ నష్టమే వాటిల్లిందని చెబుతున్నారు. ఇవి కాక ఇంకా నైక్ ఇచ్చిన కిట్ స్పాన్సర్షిప్.. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ వివరిస్తూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ లేఖ రాశారు. -
భారత్ - విండీస్‌ల ఐదో వన్డే రద్దు ?
-
భారత-విండీస్ ల ఐదో వన్డే రద్దు?
కోల్ కతా:వెస్టిండీస్ బోర్డుకు క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న విభేదాలు మరింత రాజుకుంటున్నాయి. విండీస్ ఆటగాళ్ల జీత భత్యాల విషయంలో తాము క్రికెట్ అసోసియేషన్ తో మాత్రమే నే చర్చిస్తామని.. నిరసనకు దిగిన క్రికెటర్లతో ఎటువంటి చర్చలు జరపబోమని విండీస్ బోర్డు స్పష్టం చేయడంతో వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే విండీస్ ఆటగాళ్లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగాల్సిన ఐదో వన్డేను బహిష్కరించి వెనక్కి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాలుగో వన్డే తర్వాత ఆటగాళ్లు తమ సొంత ఖర్చులతోనే స్వదేశానికి బయల్దేరవచ్చని ప్రాథమిక సమాచారం. ఆటగాళ్ల పేమెంట్ విషయంలో బోర్డు దిగిరాకపోవడంతో ఐదో వన్డేతో పాటు తదుపరి మ్యాచ్ లు జరగడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. వెస్టిండీస్ క్రికెట్లో చెల్లింపులకు సంబంధించి ఏర్పడ్డ సంక్షోభంలో ఆటగాళ్లను నిరాశపరిచే నిర్ణయం విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) తీసుకుంది. ఈ అంశంలో తాము కేవలం ప్లేయర్స్ అసోసియేషన్‌తో చర్చిస్తామని, నిరసనకు దిగిన ఆటగాళ్లతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందంలో ఉన్న నిబంధనల మేరకే మేం మధ్యవర్తిత్వం వహిస్తాం. దీనిని మీరు గౌరవించాలి. ఈ అంశంలో మరో మాటకు తావు లేదు’ అని విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్... జట్టు కెప్టెన్ డ్వేన్ బ్రేవోకు లేఖ రాయడంతో ఆటగాళ్లు అలకపూనినట్లు తెలుస్తోంది. -
పేస్ పదును తేల్చే సమయం!
సొంతగడ్డపై భారత జట్టు స్పిన్ బలం, బలగంపై కొత్తగా అనుమానాలు అవసరం లేదు. అయితే మన పిచ్‌లపై పేస్ బౌలర్లు చెలరేగడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు ధర్మశాల మైదానం అందుకు అవకాశం ఇస్తోంది. ఆస్ట్రేలియా వికెట్లతో పోలిక లేకున్నా... ఆ పర్యటనకు ముందు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా మన ప్రధాన పేసర్ల పదునేంటో ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రత్యర్థి జట్టులోనూ నాణ్యమైన పేసర్లు ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్‌కు కూడా ఈ మ్యాచ్ పరీక్షలాంటిదే. * మరో విజయంపై భారత్ గురి * ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూల వికెట్ * నలుగురు పేసర్లతో ఆడే అవకాశం * నేడు వెస్టిండీస్‌తో నాలుగో వన్డే ధర్మశాల: వెస్టిండీస్‌పై తమ ఆధిక్యం కొనసాగించాలనే పట్టుదలతో ఉన్న భారత్ మరో విజయంపై దృష్టి పెట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ దశలో నేటి మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి ఈ గెలుపు ఇరు జట్లకు అవసరం. ఇషాంత్‌కు చోటు! తొలి వన్డేలో ఓడిన భారత్ ఆ వెంటనే కోలుకొని చక్కటి విజయంతో బదులిచ్చింది. వైజాగ్ వన్డే రద్దు కావడంతో సిరీస్ నాలుగు వన్డేలకే పరిమితమైంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో స్పిన్నర్లు జడేజా, మిశ్రా కలిసి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. నాలుగో స్థానంలో వచ్చి విరాట్ కోహ్లి ఫామ్ అందుకోవడం జట్టుకు కలిసొచ్చిన పరిణామం. అయితే రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన ఓపెనర్ రహానేతో పాటు రాయుడు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి భారత పేస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో ఆడిన భువనేశ్వర్, షమీ, ఉమేశ్ యాదవ్ ఆకట్టుకున్నారు. ధర్మశాల మైదానం పేస్‌కు అనుకూలంగా ఉందని చెబుతున్న నేపథ్యంలో భారత్ నాలుగో పేసర్‌తో కూడా ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే మిశ్రా స్థానంలో ఇషాంత్ రావచ్చు. రెగ్యులర్‌గా వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఇషాంత్... ఇక్కడ చెలరేగితే అతని ప్రపంచ కప్ అవకాశాలు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. వన్డే జట్టులో చేరిన అక్షర్‌తో పాటు కుల్దీప్కు ఈ మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కకపోవచ్చు. మరో పేసర్‌ను ఆడిస్తారా? తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన వెస్టిండీస్ రెండో వన్డేలో తడబడింది. అయితే ఎనిమిదో స్థానంలో ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆ జట్టు ఏ దశలోనైనా విజృంభించవచ్చు. తొలి మ్యాచ్‌లో శామ్యూల్స్ సెంచరీ సాధించగా, తర్వాతి మ్యాచ్‌లో స్మిత్ చెలరేగాడు. పొలార్డ్, బ్రేవో బ్రదర్స్ జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించగలరు. మరో వైపు జట్టంతా పేస్ బౌలర్లతో నిండి ఉంది. రవి రాంపాల్, టేలర్ స్ట్రైక్ బౌలర్లు కాగా...డ్వేన్ స్మిత్, రసెల్, స్యామీలు కూడా మీడియం పేసర్లే. కాబట్టి గత మ్యాచ్ ఆడినట్లుగానే ఒక స్పిన్నర్ బెన్‌తో ఆ జట్టు కొనసాగవచ్చు. అయితే వికెట్ పేస్‌కు బాగా అనుకూలం అనుకుంటే... హోల్డర్, రోచ్ రూపంలో వారికి మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. పిచ్, వాతావరణం గత నాలుగు రోజులుగా ఇది పూర్తిగా పేస్ బౌలింగ్ వికెట్ అనే చెబుతున్నారు. క్యురేటర్ కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని నిర్ధారించారు. సమీపంలోని ధౌలాదర్ కొండల్లో ఎప్పుడైనా వర్షం కురవొచ్చని అంచనా. చిన్నపాటి జల్లులు వచ్చి ఆగినా...ఆ స్థితిని పేసర్లు ఉపయోగించుకోవచ్చు. ఆటగాళ్లతో చర్చించేది లేదు! కింగ్స్టన్: వెస్టిండీస్ క్రికెట్లో చెల్లింపులకు సంబంధించి ఏర్పడ్డ సంక్షోభంలో ఆటగాళ్లను నిరాశపరిచే నిర్ణయం విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) తీసుకుంది. ఈ అంశంలో తాము కేవలం ప్లేయర్స్ అసోసియేషన్‌తో చర్చిస్తామని, నిరసనకు దిగిన ఆటగాళ్లతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందంలో ఉన్న నిబంధనల మేరకే మేం మధ్యవర్తిత్వం వహిస్తాం. దీనిని మీరు గౌరవించాలి. ఈ అంశంలో మరో మాటకు తావు లేదు’ అని విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్... జట్టు కెప్టెన్ డ్వేన్ బ్రేవోకు లేఖ రాశారు.