ఇదే నా మీ తొలి చర్య?
ఆంటిగ్వా: వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ను అర్థాంతరంగా తొలగించడంపై ఆ జట్టు మాజీ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అనవసరపు పట్టింపులకు పోయి జట్టును సర్వం నాశనం చేయడమే విండీస్ క్రికెట్ బోర్డు లక్ష్యంగా కనబడుతుందని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరో రెండు రోజుల్లో యూఏఈలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని కోచ్ పదవి నుంచి సిమ్మన్స్ తప్పించడం బోర్డు అనాలోచిత చర్యగా స్యామీ పేర్కొన్నాడు. విండీస్ క్రికెట్ ను గాడిలో పెట్టడానికి చేపట్టిన తొలి చర్య ఇదేనా? అంటూ బోర్డు పెద్దలను ప్రశ్నించాడు.
'నన్ను తొలగించడంతో బోర్డు పెద్దల నైజం బయటపడింది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్లో భాగంగా కోచ్నే తీసేశారు. అది కూడా ఒక పర్యటనకు రెండు రోజుల ముందు కావడం బోర్డు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతుంది. గుడ్డిగా వెళితే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామన్న సంగతి గుర్తించుకుంటే మంచిది' అని స్యామీ చురకలంటిచాడు.