Phil Simmons
-
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్ హెడ్ కోచ్ రాజీనామా
వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో విండీస్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు కూడా దృవీకరించింది. కాగా ఈ ఏడాది అఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం సిమన్స్ తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నాడు. "వెస్టిండీస్ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన కరీబియన్ అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ అనంతరం వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను" అని విలేకరుల సమావేశంలో సిమన్స్ పేర్కొన్నాడు. కాగా 2016లో టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకోవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు. ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం ఈ ఏడాది ప్రపంచకప్‌లో కరీబియన్ జట్టు కనీసం క్వాలిఫైయింగ్ దశను కూడా దాటలేకపోయింది. రౌండ్-1లో విండీస్ దారుణంగా విఫలమైంది. ఐర్లాండ్, స్కాట్లాండ్ లాంటి వంటి పసికూనల చేతిలో కూడా విండీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కెప్టెన్ నికోలస్ పూరన్‌పై కూడా వేటు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..! -
విండీస్ కోచ్ మాటలు.. అక్షర సత్యం..!
కటక్: ‘మేము ప్రస్తుతం ఒక డైరెక్షన్లో ముందుకు వెళుతున్నాం. అద్భుతాలు చేయడానికి కృషి చేస్తున్నాం. భారత్ ముందు 320 పరుగుల లక్ష్యాన్నిఉంచితే పోరాడవచ్చు. అది కూడా భారత్ వంటి పటిష్టమైన జట్టు ముందు సరిపోదనే అనుకుంటున్నా. మేము అత్యుద్భుతమైన ప్రదర్శన చేసినా అది సరిపోవకపోవచ్చు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టును ఓడించడానికి 300-320 మధ్య స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ అది మేము విజయం సాధించడానికి సరిపోతుందని నేను అనుకోవడం లేదు. భారత్‌తో జరిగే చివరి మ్యాచ్‌కు మా జట్టు సభ్యులంతా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి సమాయత్తమయ్యారు’ అని భారత్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ చెప్పిన మాటలు ఇవి.(ఇక్కడ చదవండి: ‘నంబర్ వన్’ అని నిరూపించుకుంది: పొలార్డ్) ఈ మాటలు అక్షర సత్యమయ్యాయి. విండీస్ 316 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచినా దాన్ని మనోళ్లు సునాయాసంగానే ఛేదించారు. సిమ్మిన్స్ ఏదైతే ఊహించాడో అది దాదాపు నిజమైంది. సాధారణంగా 300 పైచిలుకు పరుగులు ఛేదించాలంటే ఏ జట్టుకైనా కష్టమే. అది కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ టార్గెట్‌ను అందుకోవడం కష్టం. మరి టీమిండియా మాత్రం ఏమాత్రం తడబాటు లేకుండా దాన్ని ఛేదించింది. దీన్ని సిమ్మన్స్ ఊహించడం ఇక్కడ విశేషంగానే చెప్పొచ్చు. గతంలో విండీస్ టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సిమ్మన్స్.. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా కోచింగ్ బాధ్యతలకు దూరమయ్యాడు. కాగా, ఇటీవల మళ్లీ అతన్నే కావాలనే కోచ్‌గా నియమిస్తూ విండీస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. విండీస్ బోర్డులో పాత వారు వెళ్లిపోయి, కొత్త వారు రావడంతో సిమ్మన్స్ నియామకం మళ్లీ జరిగింది. ఒక కోచ్‌గా జట్టు పరిస్థితినే కాకుండా ప్రత్యర్థి జట్టును కూడా అంచనా వేయడమే ప్రధానంగా కోచ్‌లు చేసే పని. దాన్ని సిమ్మన్స్ ఇక్కడ నిరూపించుకున్నాడనే చెప్పాలి. ఫీల్డ్‌లో కోచ్‌ల పాత్ర ఏమీ లేకపోయినా, తమ అంచనాలు నిజమైనప్పుడు మాత్రం వారు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. ఇలా సిమ్మన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. -
‘మా అత్యుత్తమ ప్రదర్శన సరిపోదేమో’
కటక్: టీమిండియాతో చివరి వన్డేలో తాము అత్యుత్తమ ప్రదర్శన చేసినా అది సరిపోవకవచ్చని వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అభిప్రాయపడ్డాడు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియాను సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓడించలేకపోవచ్చన్నాడు. ‘ మేము అత్యుత్తమ ప్రదర్శన చేసినా విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ క్రికెట్ జట్టును ఓడించడానికి సరిపోవకపోవచ్చు. భారత్‌తో జరిగే చివరి మ్యాచ్‌కు మా జట్టు సభ్యులంతా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి సమాయత్తమయ్యారు.కానీ అది మేము విజయం సాధించేది అవుతుందని నేను అనుకోవడం లేదు. మేము అత్యుత్తమ ప్రదర్శన చేసినా టీమిండియాను ఓడించడం చాలా కష్టం. మేము ప్రస్తుతం ఒక డైరెక్షన్లో ముందుకు వెళుతున్నాం. అద్భుతాలు చేయడానికి కృషి చేస్తున్నాం. భారత్ ముందు 320 పరుగుల లక్ష్యాన్నిఉంచితే పోరాడవచ్చు. ఈ రోజుల్లో 300 పరుగుల స్కోరు సరిపోదు. అందులోనూ భారత్ వంటి పటిష్టమైన జట్టు ముందు మూడొందల స్కోరు తక్కువే’ అని సిమ్మన్స్ అన్నాడు. అయితే ఈ సిరీస్‌లో ఔటైన తమ ఆటగాళ్లకు విరాట్ కోహ్లి విన్నూత్నంగా సెండాఫ్ ఇవ్వడాన్ని తాము తేలిగ్గా తీసుకున్నామన్నాడు. అది బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ మాత్రమే అన్నాడు. అందుకోసం తాము హోటల్లో కూర్చొని అందుకు ఎలా పంచ్ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేయాల్సిన అవసరం లేదని సిమ్మన్స్ పేర్కొన్నాడు. -
అప్పుడు వేటు.. ఇప్పుడు అందలం!
ఆంటిగ్వా: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసి భంగపడ్డ ఫిల్ సిమ్మన్స్ మళ్లీ సొంత గూటికే చేరారు. మరోసారి వెస్టిండీస్ ప్రధాన కోచ్‌గా సిమన్స్ నియమించబడ్డారు. దాదాపు మూడేళ్ల క్రితం సిమ్మన్స్ ఉన్నపళంగా తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. తన తప్పును తెలుసుకుంది. 2016 టీ20 వరల్డ్‌కప్‌ను వెస్టిండీస్ సాధించడంలో కోచ్‌గా తన వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించిన సిమ్మన్స్.. ఆపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వేటు కారణంగా ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే బోర్డు సిమ్మన్స్‌ను మరోసారి అందలం ఎక్కించింది. నాలుగేళ్ల కాలానికి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పచెబుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్‌కు దూరమైన తర్వాత అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్‌గా, అటు తర్వాత కోచ్‌గా కూడా సిమ్మన్స్ సేవలందించారు. వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ పేలవ ప్రదర్శన కారణంగా సిమ్మన్స్ పదవిని పొడిగించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు మొగ్గుచూపలేదు. ఈ నేపథ్యంలో పలు క్రికెట్ బోర్డులు కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన క్రమంలో వాటికి దరఖాస్తు చేసుకుంటూనే వచ్చాడు సిమ్మన్స్. అయితే మళ్లీ విండీస్‌కే ప్రధాన కోచ్‌గా పదవే సిమ్మిన్స్ను వరించింది.సిమ్మన్స్‌ను ప్రధాన కోచ్ నియమించడంపై క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రికీ స్కరిట్ మాట్లాడుతూ.. ‘ సిమ్మన్స్‌ను తిరిగి కోచ్‌గా నియమించడం తాము చేసిన తప్పును సరిద్దిద్దుకోవడమే కాదు.. అతనిపై ఉన్న నమ్మకంతోనే మళ్లీ విండీస్ క్రికెట్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పాం. మా క్రికెట్ బోర్డు తగిన వ్యక్తినే తగిన సమయంలో నియమించింది’ అని పేర్కొన్నారు. 56 ఏళ్ల సిమ్మన్స్ కు 2016 సెప్టెంబర్‌లో స్వస్తి చెప్పింది విండీస్ బోర్డు. క్రికెటర్ల జీత భత్యాల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో బోర్డుతో సిమ్మన్స్‌కు అభిప్రాయ భేదాలు రావడంతో అతన్ని అర్థాంతరంగా తొలగించారు. కాగా, వచ్చే ఏడాది వరల్డ్ టీ20 జరుగనున్న తరుణంలో సిమ్మన్స్‌కు మరొకసారి పెద్ద పీట వేశారు. ఈ ఫార్మాట్లో విజయవంతమైన సిమ్మన్స్ మళ్లీ జట్టును గాడిలో పెడతాడని భావించి ప్రధాన కోచ్‌గా నియమించారు. -
మా ఆట తీవ్రంగా నిరాశ పరిచింది : అఫ్గాన్ కోచ్
బెంగళూరు : ఓటమి కన్నా తమ ఆటగాళ్ల ఆట తీరే తీవ్రంగా నిరాశపరిచిందని అఫ్గానిస్తాన్ కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డాడు. భారత్-అఫ్గాన్ చారిత్రక టెస్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఓడినందుకు బాధపడటం లేదు కానీ.. శుక్రవారం మేం ఆడిన విధానం తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి రోజు ఓ రెండు గంటలు మా ఆటతీరు బాగుంది. కానీ ఈ రోజు, మా ప్రదర్శపట్ల ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఓ 30 శాతం ఈ సందర్భాన్ని నిందించవచ్చు.. మిగతాది టెస్టు క్రికెట్ గురించి తమ ఆటగాళ్లకు అంతగా తెలియకపోవడం అని చెప్పొచ్చు. తాము టెస్టు క్రికెట్లో రాణించాలంటే ఎంత మెరుగవ్వాలో ఈ మ్యాచ్ ద్వారా అర్ధమైంది. తమ జట్టు చాలా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పెద్ద జట్లైనా భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వంటి ఏ జట్లతో చాలా మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే మేం టెస్టు మ్యాచ్‌ల్లో రాణించగలుగుతాం.’ అని సిమన్స్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఏర్పాటు చేయాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని సిమన్స్ స్వాగతించాడు. అలాగే తమ జట్టు తక్కువ టెస్టు ర్యాంకుల గల జింబాంబ్వే, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో ఆడాలని అప్పుడే ఆ జట్టకు గట్టిపోటీనివ్వగలుగుతుందని అభిప్రాయపడ్డాడు. త్వరలోనే తమ జట్టు టెస్టు క్రికెట్లో మంచి ఫలితాలు రాబడుతోందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
‘19 ఏళ్ల వయసు.. 30 ఏళ్ల అనుభవం’
కాబూల్: ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో దుమ్మురేపుతున్న అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై ఆ జట్టు కోచ్ ఫిల్ సిమన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. 19 ఏళ్ల వయసులో 30 ఏళ్ల అనుభవాన్ని రషీద్ ఖాన్ గడించేశాడని సిమన్స్ కొనియాడాడు. ఇందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో దోహదం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్.. మొత్తం 17 మ్యాచ్‌లాడి 21 వికెట్లతో సత్తాచాటాడు. ప్రధానంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. అతని ఆటకి ఫిదా అయిన భారత క్రికెట్ అభిమానులు రషీద్‌కి భారత పౌరసత్వం ఇవ్వాలంటూ ట్విటర్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుతో అఫ్గానిస్తాన్ ఆడనున్న తరుణంలో ఫిల్ సిమన్స్ మీడియాతో మాట్లాడాడు. ‘రషీద్ ఖాన్ వయసు ఇప్పుడు 19 ఏళ్లే. కానీ.. అతను ఇప్పటికే 30 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా కనబడుతున్నాడు. భారత్‌తో చారిత్రక టెస్టులో రషీద్ ఎలా ఆడతాడో చూద్దాం. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో రషీద్ అద్భుతమైన పరిణితి కనబరిచాడు. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో..? అతనికి బాగా తెలుసు. భారత్‌పై రషీద్ రాణిస్తాడనే ఆశిస్తున్నా. టెస్టు మ్యాచ్‌లకు సహనం అనేది చాలా అవసరం. అతని సహచర స్పిన్నర్ ముజీబ్ వయసు 17 ఏళ్లే. అతను ఇంకా యువకుడు.. నేర్చుకోవాల్సి ఉంది ’ అని కోచ్ ఫిల్ సిమన్స్ వెల్లడించాడు. -
అఫ్గానిస్తాన్ క్రికెట్ కోచ్‌గా సిమ్మన్స్
కింగ్స్టన్:వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ ఫిల్ సిమ్మన్స్ అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సిమ్మన్స్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో ప్రకటించింది. తమ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు ఆడటానికి సిద్దమవుతున్న వేళ అఫ్గాన్ క్రికెట్ కోచ్‌గా సిమ్మన్స్‌ను ఎంపిక చేయడం విశేషం. వచ్చే నెలలో జింబాబ్వేతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిమ్మన్స్ జట్టుతో కలవనున్నాడు. అంతకుముందు అఫ్గాన్ కన్సల్టెంట్‌గా సిమ్మన్స్ వ్యహరించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే అతన్ని ఎంపిక చేయడానికి మార్గం సుగమం అయ్యింది. 2016లొ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురైన సిమ్మన్స్ కోచ్ పదవిని కోల్పోయాడు. భారత్ లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలవడంలో సిమ్మన్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ వరల్డ్ కప్ అనంతరం ఆటగాళ్లకు విండీస్ బోర్డుకు విభేదాలు తలెత్తడంతో అది సిమ్మన్స్‌పై కూడా పడింది. దానిలో భాగంగా పలువురు కీలక ఆటగాళ్లతో పాటు, సిమ్మన్స్ ను కూడా కోచ్ పదవి నుంచి విండీస్ బోర్డు తప్పించింది. కాగా, గతంలో 2007 నుంచి 2015 వరల్డ్ కప్ వరకూ ఐర్లాండ్ జట్టుకు సిమ్మన్స్ కోచ్ గా వ్యహరించాడు. అతని పర్యవేక్షణలో ఐర్లాండ్ జట్టు కొన్ని అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. ప్రధానంగా 11 అసోసియేట్ ట్రోఫీల్లో ఐర్లాండ్ ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించిన సిమ్మన్స్.. 2011, 15 వన్డే వరల్డ్ కప్ కు ఆ జట్టు అర్హత సాధించడంలో కూడా ముఖ్య పాత్ర నిర్వర్తించాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లను ఐర్లాండ్ అప్పట్లో ఓడించి సంచలనం సృష్టించడంలో సిమ్మన్స్ పాత్ర వెలకట్టలేనిది. -
కోచ్ పదవికి మరో దరఖాస్తు..?
ముంబై: భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. తాజాగా వెస్టిండీస్ మాజీ కోచ్ పిల్ సిమన్స్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. విండీస్ టీ20 ప్రపంచకప్ విజయంలో సిమన్స్ కోచ్ గా కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మాజీ ఆటగాడు ఐర్లాండ్, జింబాంబ్వే జట్లకు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఇక కోచ్ గా సిమన్స్ కు మంచి రికార్డు ఉంది. ఐర్లాండ్ జట్టుకు సిమన్స్ కోచ్ గా ఎనిమిదేళ్లు సేవలందించాడు. 2011, 2015 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ సంచలన విజయాల్లో సిమన్స్ పాత్ర కీలకం. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కోచ్ పదవి కోసం మరన్ని దరఖాస్తులు ఆహ్వానిస్తూ బీసీసీఐ జూలై 9 వరకు గడువును పొడిగించింది. ఇప్పటికే కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, సెహ్వాగ్, దొడ్డా గణేశ్, లాల్ చంద్ రాజ్ పుత్ లు ఉండగా విదేశీ మాజీ ఆటగాళ్లలో రిచర్డ్ పైబస్, టామ్ మూడీ, తాజాగా పిల్ సిమన్స్ చేరాడు. అయితే వీరందరిని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహామండలి ఇంటర్వ్యూలు చేయనుంది. జులై 10న కొత్త కోచ్ ను ప్రకటిస్తామని రెండు రోజుల క్రితం గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. -
అప్ఘాన్ కన్సల్టెంట్ గా సిమ్మన్స్
ఆంటిగ్వా:గతేడాది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురై కోచ్ పదవిని కోల్పోయిన ఫిల్ సిమ్మన్స్ ఇప్పుడు అప్ఘాన్ క్రికెట్ సలహాదారుగా ఎంపికయ్యాడు. అఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు ఆడబోయే తదుపరి మూడు సిరీస్‌లకు సిమ్మన్స్ కన్సల్టెంట్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అప్ఘాన్ ప్రధాన కోచ్ లాల్ చంద్ రాజ్‌పూత్‌కు సిమ్మన్స్ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. దీనిలో భాగంగా త్వరలో ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో జరిగే సిరీస్‌లకు సిమ్మన్స్ సేవలను వినియోగించుకోనున్నారు. 2016లో భారత్ లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలవడంలో సిమ్మన్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ అనంతరం ఆటగాళ్లకు విండీస్ బోర్డుకు విభేదాలు తలెత్తడంతో అది సిమ్మన్స్‌పై కూడా పడింది. దానిలో భాగంగా పలువురు కీలక ఆటగాళ్లతో పాటు, సిమ్మన్స్ ను కూడా కోచ్ పదవి నుంచి విండీస్ బోర్డు తప్పించింది. గతంలో 2007 నుంచి 2015 వరల్డ్ కప్ వరకూ ఐర్లాండ్ జట్టుకు సిమ్మన్స్ కోచ్ గా వ్యహరించాడు. అతని పర్యవేక్షణలో ఐర్లాండ్ జట్టు కొన్ని అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. ప్రధానంగా 11 అసోసియేట్ ట్రోఫీల్లో ఐర్లాండ్ ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించిన సిమ్మన్స్.. 2011, 15వరల్డ్ కప్‌లకు ఆ జట్టు అర్హత సాధించడంలో కూడా ముఖ్య పాత్ర నిర్వర్తించాడు. ప్రధానంగా వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లను ఐర్లాండ్ అప్పట్లో ఓడించి సంచలనం సృష్టించడంలో సిమ్మన్స్ పాత్ర వెలకట్టలేనిది. -
ఇదే నా మీ తొలి చర్య?
ఆంటిగ్వా: వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్‌ను అర్థాంతరంగా తొలగించడంపై ఆ జట్టు మాజీ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అనవసరపు పట్టింపులకు పోయి జట్టును సర్వం నాశనం చేయడమే విండీస్ క్రికెట్ బోర్డు లక్ష్యంగా కనబడుతుందని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరో రెండు రోజుల్లో యూఏఈలో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని కోచ్ పదవి నుంచి సిమ్మన్స్ తప్పించడం బోర్డు అనాలోచిత చర్యగా స్యామీ పేర్కొన్నాడు. విండీస్ క్రికెట్ ను గాడిలో పెట్టడానికి చేపట్టిన తొలి చర్య ఇదేనా? అంటూ బోర్డు పెద్దలను ప్రశ్నించాడు. 'నన్ను తొలగించడంతో బోర్డు పెద్దల నైజం బయటపడింది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా కోచ్‌నే తీసేశారు. అది కూడా ఒక పర్యటనకు రెండు రోజుల ముందు కావడం బోర్డు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతుంది. గుడ్డిగా వెళితే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామన్న సంగతి గుర్తించుకుంటే మంచిది' అని స్యామీ చురకలంటిచాడు. -
మళ్లీ సిమ్మన్స్ వైపే చూపు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టులో వన్డే ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి ఇటీవల సస్పెన్షన్ గురైన ఫిల్ సిమ్మన్స్ ను తిరిగి ఆ జట్టు చీఫ్ కోచ్ గా కొనసాగించాలని విండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) భావిస్తోంది. గత కొన్ని వారాల క్రితం శ్రీలంక పర్యటనలో భాగంగా విండీస్ ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన సిమ్మన్స్ పై బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. విండీస్ క్రికెటర్ల ఎంపికపై బయట నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని సిమ్మన్స్ వ్యాఖ్యానించి సెలెక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. దేశ క్రికెట్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎంపిక జరిగితే బాగుంటుందని స్పష్టం చేసి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, తిరిగి సిమ్మన్స్ నే కోచ్ నియమిస్తే బావుంటుందని విండీస్ క్రికెట్ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విండీస్ తాత్కాలిక కోచ్ గా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎల్డిన్ బాప్టిస్టి సేవలందిస్తున్నాడు. -
సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: శ్రీలంక పర్యటనలో భాగంగా వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల శ్రీలంక టూర్ కు వెస్టిండీస్ క్రికెటర్ల ఎంపికను సిమ్మన్స్ బహిరంగంగా తప్పుబట్టారు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు ఆటగాళ్ల ఎంపిక సరిగా లేదంటూ సిమ్మన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విండీస్ క్రికెట్ బోర్డు... ఫిల్ సిమ్మన్స్ ను కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంక టూర్ కు విండీస్ జట్టుతో సిమ్మన్స్ వెళ్లడం లేదని పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ప్రస్తుతం లండన్ లో ఉన్న సిమ్మన్స్ కు వెస్టిండీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ ముయిర్ హెడ్ ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు.కాగా, సిమ్మన్స్ స్థానంలో విండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఎల్డిన్ బాప్టిస్టి తాత్కాలిక కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
'వారు మా టెస్ట్ జట్టుతో కలుస్తారనుకుంటున్నాం'
ట్రినిటాడ్:ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)-8లో విశేషంగా రాణించిన కరేబియన్ ఆటగాళ్లపై ఆ జట్టు పెద్దలు భారీ ఆశలు పెట్టుకున్నారు. పలు కారణాలతో జట్టుకు దూరంగా ఉంటున్న వారు తిరిగి జట్టులో కలుస్తారని తాను ఆశిస్తున్నట్లు వెస్టిండీస్ కొత్త కోచ్ ఫిల్ సిమ్మన్స్ స్పష్టం చేశాడు. దీనిలో భాగంగానే డ్వేన్ బ్రేవో, లెండి సిమ్మన్స్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ లో చర్చలు జరుపుతామని పేర్కొన్నాడు. 'ఆ నలుగురు ఆటగాళ్లు జట్టుతో కలుస్తారని అనుకుంటున్నా. వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ ను ముందుకు తీసుకువెళ్లడమే మా సెలెక్టర్ల ప్రధాన ఉద్దేశం. కానీ నేను ఎవర్నీ కూడా జట్టులో ఉండాలని ఆదేశాలు జారీ చేయలేను. జట్టులోకి రావాలనుకున్నా.. లేకున్నా వారి ఇష్టానుసారమే జరుగుతుంది'అని సిమ్మన్స్ తెలిపాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే బ్రేవో, సిమ్మన్స్ లు టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా, కెవిన్ పొలార్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ తాత్కాలికంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో పాటు రస్సెల్ ఫిట్ గా లేనంటూ టెస్ట్ క్రికెట్ కు దూరంగా ఉంటుండగా, సునీల్ నరైన్ వివాదాస్పద బౌలింగ్ శైలితో జట్టుకు దూరమైయ్యాడు. అయితే వెస్టిండీస్ క్రికెట్ లో ఆ నలుగురు ఆటగాళ్లు ఉండాలని కరేబియన్లు కోరుకుంటున్నారని సిమ్మన్స్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.