
వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో విండీస్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు కూడా దృవీకరించింది. కాగా ఈ ఏడాది అఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం సిమన్స్ తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నాడు.
"వెస్టిండీస్ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన కరీబియన్ అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ అనంతరం వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.
ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను" అని విలేకరుల సమావేశంలో సిమన్స్ పేర్కొన్నాడు. కాగా 2016లో టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకోవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు.
ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం
ఈ ఏడాది ప్రపంచకప్‌లో కరీబియన్ జట్టు కనీసం క్వాలిఫైయింగ్ దశను కూడా దాటలేకపోయింది. రౌండ్-1లో విండీస్ దారుణంగా విఫలమైంది. ఐర్లాండ్, స్కాట్లాండ్ లాంటి వంటి పసికూనల చేతిలో కూడా విండీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కెప్టెన్ నికోలస్ పూరన్‌పై కూడా వేటు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..!
Comments
Please login to add a commentAdd a comment