'వారు మా టెస్ట్ జట్టుతో కలుస్తారనుకుంటున్నాం'
ట్రినిటాడ్:ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)-8లో విశేషంగా రాణించిన కరేబియన్ ఆటగాళ్లపై ఆ జట్టు పెద్దలు భారీ ఆశలు పెట్టుకున్నారు. పలు కారణాలతో జట్టుకు దూరంగా ఉంటున్న వారు తిరిగి జట్టులో కలుస్తారని తాను ఆశిస్తున్నట్లు వెస్టిండీస్ కొత్త కోచ్ ఫిల్ సిమ్మన్స్ స్పష్టం చేశాడు. దీనిలో భాగంగానే డ్వేన్ బ్రేవో, లెండి సిమ్మన్స్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ లో చర్చలు జరుపుతామని పేర్కొన్నాడు.
'ఆ నలుగురు ఆటగాళ్లు జట్టుతో కలుస్తారని అనుకుంటున్నా. వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ ను ముందుకు తీసుకువెళ్లడమే మా సెలెక్టర్ల ప్రధాన ఉద్దేశం. కానీ నేను ఎవర్నీ కూడా జట్టులో ఉండాలని ఆదేశాలు జారీ చేయలేను. జట్టులోకి రావాలనుకున్నా.. లేకున్నా వారి ఇష్టానుసారమే జరుగుతుంది'అని సిమ్మన్స్ తెలిపాడు.
ఇదిలా ఉండగా ఇప్పటికే బ్రేవో, సిమ్మన్స్ లు టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా, కెవిన్ పొలార్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ తాత్కాలికంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో పాటు రస్సెల్ ఫిట్ గా లేనంటూ టెస్ట్ క్రికెట్ కు దూరంగా ఉంటుండగా, సునీల్ నరైన్ వివాదాస్పద బౌలింగ్ శైలితో జట్టుకు దూరమైయ్యాడు. అయితే వెస్టిండీస్ క్రికెట్ లో ఆ నలుగురు ఆటగాళ్లు ఉండాలని కరేబియన్లు కోరుకుంటున్నారని సిమ్మన్స్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.