మళ్లీ సిమ్మన్స్ వైపే చూపు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టులో వన్డే ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి ఇటీవల సస్పెన్షన్ గురైన ఫిల్ సిమ్మన్స్ ను తిరిగి ఆ జట్టు చీఫ్ కోచ్ గా కొనసాగించాలని విండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) భావిస్తోంది. గత కొన్ని వారాల క్రితం శ్రీలంక పర్యటనలో భాగంగా విండీస్ ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన సిమ్మన్స్ పై బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. విండీస్ క్రికెటర్ల ఎంపికపై బయట నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని సిమ్మన్స్ వ్యాఖ్యానించి సెలెక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు.
దేశ క్రికెట్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎంపిక జరిగితే బాగుంటుందని స్పష్టం చేసి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, తిరిగి సిమ్మన్స్ నే కోచ్ నియమిస్తే బావుంటుందని విండీస్ క్రికెట్ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విండీస్ తాత్కాలిక కోచ్ గా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎల్డిన్ బాప్టిస్టి సేవలందిస్తున్నాడు.