అప్ఘాన్ కన్సల్టెంట్ గా సిమ్మన్స్
ఆంటిగ్వా:గతేడాది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురై కోచ్ పదవిని కోల్పోయిన ఫిల్ సిమ్మన్స్ ఇప్పుడు అప్ఘాన్ క్రికెట్ సలహాదారుగా ఎంపికయ్యాడు. అఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు ఆడబోయే తదుపరి మూడు సిరీస్లకు సిమ్మన్స్ కన్సల్టెంట్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అప్ఘాన్ ప్రధాన కోచ్ లాల్ చంద్ రాజ్పూత్కు సిమ్మన్స్ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. దీనిలో భాగంగా త్వరలో ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్లతో జరిగే సిరీస్లకు సిమ్మన్స్ సేవలను వినియోగించుకోనున్నారు.
2016లో భారత్ లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలవడంలో సిమ్మన్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ అనంతరం ఆటగాళ్లకు విండీస్ బోర్డుకు విభేదాలు తలెత్తడంతో అది సిమ్మన్స్పై కూడా పడింది. దానిలో భాగంగా పలువురు కీలక ఆటగాళ్లతో పాటు, సిమ్మన్స్ ను కూడా కోచ్ పదవి నుంచి విండీస్ బోర్డు తప్పించింది.
గతంలో 2007 నుంచి 2015 వరల్డ్ కప్ వరకూ ఐర్లాండ్ జట్టుకు సిమ్మన్స్ కోచ్ గా వ్యహరించాడు. అతని పర్యవేక్షణలో ఐర్లాండ్ జట్టు కొన్ని అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. ప్రధానంగా 11 అసోసియేట్ ట్రోఫీల్లో ఐర్లాండ్ ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించిన సిమ్మన్స్.. 2011, 15వరల్డ్ కప్లకు ఆ జట్టు అర్హత సాధించడంలో కూడా ముఖ్య పాత్ర నిర్వర్తించాడు. ప్రధానంగా వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లను ఐర్లాండ్ అప్పట్లో ఓడించి సంచలనం సృష్టించడంలో సిమ్మన్స్ పాత్ర వెలకట్టలేనిది.