కింగ్‌స్టన్:వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ ఫిల్ సిమ్మన్స్ అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సిమ్మన్స్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో ప్రకటించింది. తమ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు ఆడటానికి సిద్దమవుతున్న వేళ అఫ్గాన్ క్రికెట్ కోచ్‌గా సిమ్మన్స్‌ను ఎంపిక చేయడం విశేషం. వచ్చే నెలలో జింబాబ్వేతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిమ్మన్స్ జట్టుతో కలవనున్నాడు. అంతకుముందు అఫ్గాన్ కన్సల్టెంట్‌గా సిమ్మన్స్ వ్యహరించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే అతన్ని ఎంపిక చేయడానికి మార్గం సుగమం అయ్యింది.
2016లొ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురైన సిమ్మన్స్ కోచ్ పదవిని కోల్పోయాడు. భారత్ లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలవడంలో సిమ్మన్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ వరల్డ్ కప్ అనంతరం ఆటగాళ్లకు విండీస్ బోర్డుకు విభేదాలు తలెత్తడంతో అది సిమ్మన్స్పై కూడా పడింది. దానిలో భాగంగా పలువురు కీలక ఆటగాళ్లతో పాటు, సిమ్మన్స్ ను కూడా కోచ్ పదవి నుంచి విండీస్ బోర్డు తప్పించింది.
కాగా, గతంలో 2007 నుంచి 2015 వరల్డ్ కప్ వరకూ ఐర్లాండ్ జట్టుకు సిమ్మన్స్ కోచ్ గా వ్యహరించాడు. అతని పర్యవేక్షణలో ఐర్లాండ్ జట్టు కొన్ని అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. ప్రధానంగా 11 అసోసియేట్ ట్రోఫీల్లో ఐర్లాండ్ ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించిన సిమ్మన్స్.. 2011, 15 వన్డే వరల్డ్ కప్ కు ఆ జట్టు అర్హత సాధించడంలో కూడా ముఖ్య పాత్ర నిర్వర్తించాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లను ఐర్లాండ్ అప్పట్లో ఓడించి సంచలనం సృష్టించడంలో సిమ్మన్స్ పాత్ర వెలకట్టలేనిది.
Comments
Please login to add a commentAdd a comment