స్యామీ.. నీ కన్నీరు వృథాకావద్దు!
కోల్ కతా: క్రికెట్ లో గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే ఒక జట్టు మ్యాచ్ ఆడాలంటే యూనిఫామ్ తప్పనిసరి. మండల స్థాయిలోనే ఈ నిబంధన కచ్చితంగా అమలవుతుంది. అలాంటిది ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ఘనత ఉన్న వెస్టిండీస్ జట్టుకు కనీసం యూనిఫామ్ కుట్టించే దిక్కులేకుండా పోయింది!
వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని చెప్పాడు విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ. మ్యాచ్ అనంతరం ఈ మాటలు చెబుతూ స్యామీ కంటతడి పెట్టిన వైనం అందరినీ ఆలోచింపజేసింది. అనిశ్చితికి మారుపేరైన విండీస్ క్రికెట్ బోర్డును బోనులో నిల్చొబెట్టినట్టైంది. క్రికెట్ లో కేవలం కాసుల వర్షమేకాదు, కొందరు ఆటగాళ్ల కన్నీటి ధారలూ ఉంటాయని మరోసారి నిరూపించింది.
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో స్యామీ మాట్లాడుతూ.. 'మొదటిగా భగవంతుడికి కృతజ్ఞతలు. మా జట్టులో ఒక పాస్టర్ ఉన్నాడు. అతనితో కలిసి మేం కూడా నిరంతరం ప్రార్థనలు చేశాం. ఈ విజయం మాకు కలకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. సరిగ్గా నెలన్నర కిందట విండీస్ టీమ్ వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే సంశయం నెలకొంది. అనేక విషయాల్లో విండీస్ బోర్డు నిర్లక్ష్యానికి ఆటగాళ్లు బలయ్యే పరిస్థితి. మొత్తానికి 15 మందిమి ఎంపికయ్యాం. దుబాయ్ లో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటుచేశారు. జట్టుకు కొత్త మేనేజర్ గా లూవీస్ ను నియమించారు. ఆయనకు అనుభవం లేదు. ఇండియాకు వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతోంది. అప్పటికింకా యూనిఫామ్ సిద్ధంకాలేదు. మమ్మల్ని దుబాయ్ లోనే వదిలేసి మేనేజర్ వెళ్లిపోయాడు. మేం కోల్ కతా చేరుకున్నాం. మొత్తానికి మొదటి మ్యాచ్ కు ముందే యూనిఫామ్ లతో తిరిగొచ్చాడు మా మేనేజర్.
విండీస్ బోర్డు పెద్దలు మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో కొంత మంది దృష్టిలో మేం చులకనైపోయాం. 'వెస్టిండీస్ ప్లేయర్లకు బ్రెయిన్ లేదు' అంటూ ఇంగ్లిష్ క్రికెటర్ మార్క్ నికోలస్ చేసిన వ్యాఖ్యలు మమ్మల్నీ తీవ్రంగా బాధించాయి. అయినాసరే మేం ఓర్చుకున్నాం. కోచింగ్ స్టాఫ్ మా వెన్నంటే ఉన్నారు. కరీబియన్ కమ్యూనిటీ(కారికామ్) పెద్దలు నిరంతరం ఫోన్లు చేస్తునే ఉన్నారు. నిరుత్సాహ పడొద్దంటూ మెసేజ్ లు, మెయిల్స్ పెట్టారు. ఫైనల్ మ్యాచ్ రోజున ఉదయం గ్రెనడా నుంచి కరీబియన్ ప్రధాని కీత్ మిఛెల్ మాతో ఫోన్లో మాట్లాడారు.
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ఒకరో, ఇద్దరో ఆటగాళ్లపై ఆధారపడేదికాదు. జట్టులో ఉండే 15 మందీ మ్యాచ్ విన్నర్లే. ఎవరికివారు తమంతటతామే బాధ్యత తీసుకున్నారు. అందుకే ఈ 15 మందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్ లో మేం కలిసి ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ మా అందరికీ ఇది చిరస్మరణీయ విజయం. ఈ విజయం కరీబియన్ ఫ్యాన్స్ కు అంకితం' అని ఈ ప్రపంచకప్ కోసం తామెంతగా కష్టపడింది చెప్పుకొచ్చాడు. స్యామీ ఎమోషనల్ స్పీచ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్ల విషయంలో విండీస్ క్రికెట్ బోర్డు తీరు మారాలనడమేకాక, 'స్యామీ.. నీ కన్నీరు వృథా కావద్దు' అని అభిమానులు కోరుకుంటున్నారు.