
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.
హార్డ్ హిట్టర్
కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్‌లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్‌గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.
విధ్వంసకర వీరుడు
ఇక ఐపీఎల్‌లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్‌లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.
ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడు
ఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్‌కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు.
ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.
బంతిని బాదగల సత్తా నాకు ఉంది
ఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్‌కప్‌లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్‌రౌండర్లకు అవకాశాలు రావచ్చు.
అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్‌తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్‌గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్‌కు ఆడతానని తెలిపాడు.
చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం!
Comments
Please login to add a commentAdd a comment