కన్నీటిపర్యంతమైన బ్రావో | CPL 2024: Dwayne Bravo Gets Emotional After Final Match | Sakshi
Sakshi News home page

కన్నీటిపర్యంతమైన బ్రావో

Published Fri, Sep 27 2024 5:14 PM | Last Updated on Fri, Sep 27 2024 5:41 PM

CPL 2024: Dwayne Bravo Gets Emotional After Final Match

విండీస్‌ దిగ్గజం డ్వేన్‌ బ్రావో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో సెప్టెంబర్‌ 24న సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ బ్రావో కెరీర్‌లో చివరి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో బ్రావో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్‌ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. 

2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్‌లో 582 మ్యాచ్‌లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్‌లో కేకేఆర్‌ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ 2025 నుంచి బ్రావో కేకేఆర్‌ మెంటార్‌గా వ్యవహరిస్తాడు. 


కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్‌ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్‌ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్‌లో 6300 పైచిలుకు పరుగులు సాధించి,  363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు.  

చదవండి: భారత్‌తో టెస్ట్‌ మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement