'ఐరెన్‌ లెగ్‌' ఆండ్రీ రసెల్‌.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..! | Andre Russell Knocked Out Of ILT20 And BPL Within 15 Hours | Sakshi
Sakshi News home page

'ఐరెన్‌ లెగ్‌' ఆండ్రీ రసెల్‌.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!

Published Tue, Feb 4 2025 7:24 PM | Last Updated on Tue, Feb 4 2025 7:41 PM

Andre Russell Knocked Out Of ILT20 And BPL Within 15 Hours

విండీస్‌ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్‌ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్‌లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్‌ ఆడితే, ఉదయం మరో లీగ్‌లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్‌ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్‌ల్లో పాల్గొన్న వైనం సోషల్‌మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్‌ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. 

నిద్ర​ లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్‌ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్‌ జట్లు లీగ్‌ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్‌ను ఐరెన్‌ లెగ్‌ అని అంటున్నారు. రసెల్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్‌ కూడా ఓ కారణం. రసెల్‌ ఇటీవలికాలంలో ఏ లీగ్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. 

ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో మెరుపులు లేవు, బౌలింగ్‌లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్‌పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్‌ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని​ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, రసెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకుండా ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.

రసెల్‌ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో (ILT20) అబుదాబీ నైట్‌రైడర్స్‌ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఓటమితో ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్‌ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్‌కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొన్నాడు. 

ఈ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రంగ్‌పూర్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రసెల్‌ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఓవర్‌ బౌలింగ్‌ కూడా చేసిన రసెల్ వికెట్‌ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్‌ రైడర్స్‌ ఓటమికి రసెల్‌ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

ఇదిలా ఉంటే,  ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లు చివరి దశకు చేరాయి. బీపీఎల్‌లో ఫార్చూన్‌ బారిషల్‌ ఫైనల్‌కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్‌ జరుగనుంది. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. డెజర్ట్‌ వైపర్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌, ఎంఐ ఎమిరేట్స్‌, షార్జా వారియర్జ్‌ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement