
భారత-విండీస్ ల ఐదో వన్డే రద్దు?
కోల్ కతా:వెస్టిండీస్ బోర్డుకు క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న విభేదాలు మరింత రాజుకుంటున్నాయి. విండీస్ ఆటగాళ్ల జీత భత్యాల విషయంలో తాము క్రికెట్ అసోసియేషన్ తో మాత్రమే నే చర్చిస్తామని.. నిరసనకు దిగిన క్రికెటర్లతో ఎటువంటి చర్చలు జరపబోమని విండీస్ బోర్డు స్పష్టం చేయడంతో వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే విండీస్ ఆటగాళ్లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగాల్సిన ఐదో వన్డేను బహిష్కరించి వెనక్కి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాలుగో వన్డే తర్వాత ఆటగాళ్లు తమ సొంత ఖర్చులతోనే స్వదేశానికి బయల్దేరవచ్చని ప్రాథమిక సమాచారం. ఆటగాళ్ల పేమెంట్ విషయంలో బోర్డు దిగిరాకపోవడంతో ఐదో వన్డేతో పాటు తదుపరి మ్యాచ్ లు జరగడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది.
వెస్టిండీస్ క్రికెట్‌లో చెల్లింపులకు సంబంధించి ఏర్పడ్డ సంక్షోభంలో ఆటగాళ్లను నిరాశపరిచే నిర్ణయం విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) తీసుకుంది. ఈ అంశంలో తాము కేవలం ప్లేయర్స్ అసోసియేషన్‌తో చర్చిస్తామని, నిరసనకు దిగిన ఆటగాళ్లతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందంలో ఉన్న నిబంధనల మేరకే మేం మధ్యవర్తిత్వం వహిస్తాం. దీనిని మీరు గౌరవించాలి. ఈ అంశంలో మరో మాటకు తావు లేదు’ అని విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్... జట్టు కెప్టెన్ డ్వేన్ బ్రేవోకు లేఖ రాయడంతో ఆటగాళ్లు అలకపూనినట్లు తెలుస్తోంది.