నైతికతను వదిలేశారు: బ్రేవో
ఆంటిగ్వా:ఇటీవల తమ దేశ క్రికెట్ కోచ్ గా సేవలందించి విజయవంతమైన ఫిల్ సిమ్మన్స్ ను అర్ధాంతరంగా తొలగించడాన్ని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో తీవ్రంగా తప్పుబట్టాడు. ఒక కోచ్ ను తప్పించే ముందు కనీస ప్రమాణాలు పాటించుకుండా వెస్టిండీస్ బోర్డు(డబ్యూఐసీ) పెద్దలు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నైతిక విలువల్ని వదిలేసింది. అది ఎక్కడైనా చూద్దామన్నా కనిపించడం లేదు. దాంతో పాటు మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా గంభీరంగా ఉంటుంది. పాకిస్తాన్ తో టీ 20 సిరీస్ జరుగుతున్న సమయంలో అదే కనబడింది. దీనంతటకీ కారణం మా క్రికెట్ బోర్డే' అని బ్రేవో అసహనం వ్యక్తం చేశాడు. తనకు క్రికెట్ అంటే అత్యంత ఇష్టమని, ఎప్పుడూ క్రికెట్ ఫీల్డ్ లో కి వెళ్లినా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తానని బ్రేవో ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. పాకిస్తాన్ తో సిరీస్ కు బయల్దేరి ముందు 15 మందితో కూడిన జట్టును ప్రకటించి వెళ్లి ఆడమనడం ఎంతవరకూ సమంజసమని బ్రేవో ప్రశ్నించాడు. ప్రపంచంలోని ఏ సంస్థ కూడా ఈ పద్ధతిలో వ్యవహరించడం లేదన్నాడు.