ఉతికి ఆరేసిన స్మిత్
మాంగ్ కాక్(హాంకాంగ్):ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ వీడ్కోలు తీసుకున్నా తనలో సత్తా మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తాజాగా ప్రారంభమైన హాంకాంగ్ ట్వంటీ 20 బ్లిట్జ్ లో స్మిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తద్వారా ఈ ఫార్మాట్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బుధవారం సీటీ కైతక్ తో జరిగిన మ్యాచ్ లో కావ్లూన్ కాంటాన్స్ తో బరిలోకి దిగిన స్మిత్ 31 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
తొలి హాఫ్ సెంచరీని 16 బంతుల్లో పూర్తి చేసిన స్మిత్.. రెండో హాఫ్ సెంచరీని సాధించడానికి 15 బంతులు తీసుకున్నాడు. డ్వేన్ స్మిత్ సెంచరీ చేసి క్రమంలో 11 సిక్సర్లు, 6 ఫోర్లతో చెలరేగిపోయాడు.ఈ మ్యాచ్ లో స్మిత్ ఓవరాల్ గా 40 బంతులు ఆడి 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. స్మిత్ చెలరేగి ఆడటంతో 200 పరుగుల లక్ష్యాన్ని కావ్లూన్ కాంటాన్స్ సునాయాసంగా ఛేదించింది. కాంటాన్స్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఇదిలా ఉంచితే స్మిత్ అరుదైన రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ట్వంటీ 20 ఫార్మాట్ లో వేగవంతమైన సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడైన గేల్ 30 బంతుల్లో శతకం చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత స్మిత్ దే ఈ ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక్కడ ఇద్దరూ విండీస్ క్రికెటర్లు కావడం మరో విశేషం. కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో ఏకైక సెంచరీ చేసిన స్మిత్..గత కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అతనికి జట్టులో స్థానం దక్కి దాదాపు రెండు సంవత్సరాలు కావడంతో విండీస్ కు గుడ్ బై చెప్పేశాడు.