సాక్షి, స్పోర్ట్స్: జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఇక తాను వెస్టిండీస్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం చాలా కష్టమని డ్వేన్ బ్రేవో అభిప్రాయపడ్డాడు. లేటు వయసులో విండీస్ జట్టులో చోటు కోసం ఎంతగా శ్రమించాలో అర్థం కావడం లేదంటూ నిరాశావహ దృక్పథంతో ఉన్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా టెస్ట్ జట్టులో, 2014 నుంచి వన్డే జట్టులో డ్వేన్ బ్రేవో చోటు సంపాదించలేకపోయాడు. అయితే గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. అయితే 34 ఏళ్ల వయసులో మళ్లీ జాతీయ జట్టులోకి రావడమన్నది తనకు కలేనని బ్రేవో అంటున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉన్న సమయంలోనే జట్టు నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
డ్వేన్ బ్రేవో మీడియాతో మాట్లాడుతూ.. 'విండీస్ జట్టుకు దూరమై కాలమవుతోంది. టెస్టులు, వన్డే జట్ల ఎంపికలో నాకు పిలుపు రావడం లేదు. కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నా. పూర్తి ఫిట్‌గా ఉన్నప్పుడు జట్టుకు నన్ను దూరం చేశారు. 34 ఏళ్ల వయసులో ప్రస్తుతం మరోసారి జట్టులోకి రావడం దాదాపు అసాధ్యమే. అందుకే పొట్టి ఫార్మాట్ (ట్వంటీ20, టీ10) టోర్నీల్లో ఆడుతూ అభిమానులను అలరించాలనుకుంటున్నాను. ఇలాంటి టోర్నీల్లో రాణిస్తేనైనా జాతీయ జట్టు నుంచి ఏదో ఓ రోజు పిలుపు రావచ్చు. మొత్తానికి ఏదో ఫార్మాట్లో ఆడుతూ మరికొంత కాలం క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాలన్నదే నా ముందున్న లక్ష్యమని' వివరించాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న టీ10 లీగ్‌లో సెహ్వాగ్ నేతృత్వంలోని మరాఠా అరేబియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment