4 బంతుల్లో 4 వికెట్లు | West Indies beat England West Indies won by 17 runs | Sakshi
Sakshi News home page

4 బంతుల్లో 4 వికెట్లు

Published Tue, Feb 1 2022 5:37 AM | Last Updated on Tue, Feb 1 2022 5:37 AM

West Indies beat England West Indies won by 17 runs - Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): వెస్టిండీస్‌తో ఐదో టి20లో ఇంగ్లండ్‌ విజయానికి ఆఖరి ఓవర్లో 20 పరుగులు కావాలి. జోరు మీదున్న బిల్లింగ్స్‌ సహా నాలుగు వికెట్లు ఉండటంతో అసాధ్యమేమీ అనిపించలేదు. అయితే తొలి బంతికి ‘నోబాల్‌’ సహా రెండు పరుగులిచ్చిన జేసన్‌ హోల్డర్‌ మరుసటి బంతికి పరుగు ఇవ్వలేదు. ఆ తర్వాత అతని మ్యాజిక్‌ మొదలైంది. వరుసగా నాలుగు బంతుల్లో జోర్డాన్, బిల్లింగ్స్, రషీద్, సాఖిబ్‌ అవుట్‌... మరో బంతి మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ ఆలౌట్‌. 17 పరుగులతో నెగ్గిన వెస్టిండీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

కెప్టెన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రవ్‌మన్‌ పావెల్‌ (17 బంతుల్లో 35 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు), బ్రెండన్‌ కింగ్‌ (31 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కైల్‌ మేయర్స్‌ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఇంగ్లండ్‌ 19.5 ఓవర్లలో 162 పరుగులే చేయగలిగింది. జేమ్స్‌ విన్స్‌ (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌), స్యామ్‌ బిల్లింగ్స్‌ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. అకీల్‌ హొసీన్‌ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సొంత మైదానంలో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన (5/27) కనబర్చి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన హోల్డర్‌... మొత్తం 15 వికెట్లతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.

మార్పుల్లేకుండానే భారత్‌కు...
భారత్‌తో జరిగే టి20 సిరీస్‌లో తలపడే వెస్టిండీస్‌ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇంగ్లండ్‌పై సిరీస్‌ నెగ్గిన టీమ్‌లో ఎలాంటి మార్పు చేయకుండా ఆ 16 మందినే భారత పర్యటనకు ఎంపిక చేశారు. తగిన ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అందుకోలేకపోయిన హెట్‌మైర్‌కు, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు ఆడని ఎవిన్‌ లూయిస్‌కు ఈసారి కూడా చోటు దక్కలేదు. భారత్, విండీస్‌ మధ్య ఈ నెల 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.  

వెస్టిండీస్‌ జట్టు: కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), నికోలస్‌ పూరన్‌ (వైస్‌ కెప్టెన్‌), ఫాబియాన్‌ అలెన్, డారెన్‌ బ్రేవో, రోస్టన్‌ ఛేజ్, షెల్డన్‌ కాట్రెల్, డొమినిక్‌ డ్రేక్స్, జేసన్‌ హోల్డర్, షై హోప్, అకీన్‌ హొసీన్, బ్రండన్‌ కింగ్, రవ్‌మన్‌ పావెల్, రొమారియా షెఫర్డ్, ఒడియాన్‌ స్మిత్, కైల్‌ మేయర్స్, హేడెన్‌ వాల్‌‡్ష జూనియర్‌.

అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడు జేసన్‌ హోల్డర్‌. గతంలో  లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌; 2019లో ఐర్లాండ్‌పై), లసిత్‌ మలింగ (శ్రీలంక; 2019లో న్యూజిలాండ్‌పై), క్యాంఫర్‌ (ఐర్లాండ్‌; 2021 లో నెదర్లాండ్స్‌పై) ఈ ఘనత సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement