మరో విజయంపై టీమిండియా గురి.. ఫ్లోరిడాలో నాలుగో టీ20 | Today is the fourth T20 between India and West Indies | Sakshi
Sakshi News home page

మరో విజయంపై టీమిండియా గురి.. ఫ్లోరిడాలో నాలుగో టీ20

Published Sat, Aug 12 2023 2:47 AM | Last Updated on Sat, Aug 12 2023 5:56 PM

Today is the fourth T20 between India and West Indies - Sakshi

లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్‌ సమరం అమెరికా గడ్డకు చేరింది. సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగుతుండగా... గత మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత ఇక్కడైనా సిరీస్‌ అందుకోవాలని వెస్టిండీస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టూర్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లతో పోలిస్తే అమెరికాలోని ఈ రీజినల్‌ పార్క్‌ స్టేడియం బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే మైదానం.

గతంలోనూ ఇక్కడ భారీ స్కోర్లే నమోదయ్యాయి కాబట్టి సిరీస్‌లోని చివరి రెండు టి20ల్లో బ్యాటర్ల నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశించవచ్చు. అయితే శనివారం రోజున వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించవచ్చు. ఇక్కడ జరిగిన 13 టి20ల్లో 11 సార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది.  

అదే జట్టుతో... 
గత మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన భారత జట్టు మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. తన సత్తా చాటేందుకు యశస్వి జైస్వాల్‌కు ఇది మరో అవకాశం. అయితే రెండో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మూడు మ్యాచుల్లోనూ ‘సింగిల్‌ డిజిట్‌’ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక్కడైనా అతను ఫామ్‌ను అందుకుంటాడా చూడాలి.

ఈ ఫార్మాట్‌లో తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో సూర్యకుమార్‌ నిరూపించాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టీ హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మపై నిలిచింది. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో సత్తా చాటిన అతనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలతో పాటు వన్డేల్లోనూ తీసుకోవాలనే సూచనలు వస్తున్న నేపథ్యంలో తిలక్‌ తన జోరును కొనసాగించాల్సి ఉంది.

సంజు సామ్సన్‌కు కూడా ఇది చావోరేవోలాంటి మ్యాచ్‌. ఇక్కడా అవకాశం వృథా చేస్తే మున్ముందు కష్టమే. బౌలింగ్‌లో పేసర్లు ముకేశ్, అర్ష్ దీప్‌ అంతంత మాత్రమే ప్రభావం చూపిస్తుండగా... చహల్, కుల్దీప్‌ తమ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేస్తున్నారు. వీరు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు.  

హెట్‌మైర్‌ రాణిస్తాడా... 
విండీస్‌ జట్టులో పూరన్, హెట్‌మైర్‌లు టి20 ఫార్మాట్‌లో స్టార్‌లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరన్‌ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోగా, హెట్‌మైర్‌ ఇప్పటి వరకు ప్రభావం చూపలేకపోయాడు. ఈసారైనా అతను దూకుడుగా ఆడాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. కెపె్టన్‌ పావెల్‌ ఫామ్‌లోకి సానుకూలాంశం కాగా... మేయర్స్, చార్లెస్‌ కనీస ప్రదర్శన కూడా ఇవ్వడం లేదు. ఓపెనర్‌ కింగ్‌ కూడా శుభారంభం అందించాల్సి ఉంది.

చార్లెస్‌ స్థానంలో వన్డే కెప్టెన్‌ షై హోప్‌ను ఆడించే అవకాశం ఉంది. ఫిట్‌గా ఉంటే చేజ్‌ స్థానంలో హోల్డర్‌ తిరిగొస్తాడు. నెమ్మదైన పిచ్‌లపై మెరుగైన రీతిలో రాణించిన విండీస్‌ పేసర్లు జోసెఫ్, మెకాయ్, షెఫర్డ్‌ ఈ పిచ్‌పై భారత బ్యాటర్లను ఎలా నిలువరిస్తారనేది చూడాలి. అన్ని విధాలుగా ఆకట్టుకున్న స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌పై కూడా టీమ్‌ ఆధారపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement