Ind Vs WI 3rd ODI: Team India Eye On Whitewash Against West Indies Today, Details Inside - Sakshi
Sakshi News home page

Ind Vs WI 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను.. మార్పులతో బరిలోకి టీమిండియా!

Published Fri, Feb 11 2022 5:07 AM | Last Updated on Fri, Feb 11 2022 10:29 AM

India vs West Indies last ODI today - Sakshi

Ind Vs WI 3rd ODI:- అహ్మదాబాద్‌: సఫారీ పర్యటనలో వన్డేల్లో క్లీన్‌స్వీప్‌ అయిన భారత్‌ ఇప్పుడు సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌ చేసే పనిలో పడింది. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి పోరులో గెలిచి 3–0తో ముగించాలని ఆశిస్తోంది. పైగా ఆటగాళ్లంతా జోరు మీదున్నారు. బ్యాటర్స్‌ ఫామ్‌లో ఉండగా... మన బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు వెస్టిండీస్‌ కనీసం ఈ వన్డేలోనైనా నెగ్గి టి20లకు ముందు కాస్త ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌ విండీస్‌ను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే ఆఖరి పోరులో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.  

(చదవండి: అతిథిలా వచ్చి ఆటగాళ్లను పరుగులు పెట్టించింది)

ధావన్‌తో ఓపెనింగ్‌...
కరోనా వైరస్‌ నుంచి కోలుకోవడంతో రెగ్యులర్‌ ఓపెనర్‌ ధావన్‌ బరిలోకి దిగనున్నాడు. అతనితో కలిసి కెప్టెన్‌ రోహిత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో అతనికి అవకాశం లభించకపోవచ్చు. ధావన్‌ రాకతో పంత్‌ మిడిలార్డర్‌లో ఆడనుండగా... సూర్యకుమార్‌ యా దవ్, దీపక్‌ హుడాలలో  ఒకరికే తుది జట్టులో ఆడే అవకాశముంది. విండీస్‌ బ్యాటర్స్‌ పాలిట సింహ స్వప్నమైన బౌలింగ్‌ దళంలో మార్పులు చేయకపోవచ్చు.

ఒక వేళ కుల్దీప్‌కు చాన్సు ఇవ్వాలనుకుంటే చహల్‌ను పక్కన పెడతారు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌కు పనిచెబుతాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. ఇదే జరిగితే వెస్టిండీస్‌కు భారత బౌలర్ల నుంచే కాదు... బ్యాటింగ్‌ నుంచి కూడా కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓ మోస్తరు స్కోర్లే నమోదయ్యాయి. భారత బ్యాటర్స్‌ మూకుమ్మడిగా చెలరేగితే భారీ స్కోరు ముచ్చట కూడా ఈ మ్యాచ్‌తో తీరుతుంది. భారత యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా కోవిడ్‌ నుంచి కోలుకున్నాడు. జట్టుకు అందుబాటులోకి వచ్చినప్పటికీ తుది జట్టుకు ఆడే అవకాశమైతే లేదు.

ఒత్తిడిలో విండీస్‌
సిరీస్‌ను కోల్పోయిన కరీబియన్‌ జట్టు ఇప్పుడు ఆఖరి మ్యాచ్‌ విజయంపైనే ఆశలు పెట్టుకుంది. షై హోప్, బ్రాండన్‌ కింగ్, బ్రేవో, నికోలస్‌ పూరన్‌లతో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ చెప్పుకునేందుకు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ తీరా బరిలోకి దిగేసరికి తేలిపోతోంది. గత రెండు వన్డేలను పరిశీలిస్తే అంతో ఇంతో విండీస్‌ బౌలింగే నయం. మన స్టార్‌ బ్యాటర్స్‌ను కంగారు పెట్టించింది. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మాత్రం వారి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతూనే ఉంది.

రెండు మ్యాచ్‌ల్లోనూ టాపార్డర్‌ ఆట పేలవంగా సాగింది. గాయంనుంచి కోలుకున్న కెప్టెన్‌ పొలార్డ్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. చివరి పోరులోనైనా బ్యాటర్స్‌ బాధ్యతగా ఆడితే ఓదార్పు విజయంతోనైనా సిరీస్‌ను ముగించవచ్చని వెస్టిండీస్‌ భావిస్తోంది. ఇటీవలే సొంతగడ్డపై ఐర్లాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ ఓడిన విండీస్‌...ఇప్పుడు ఒక్క విజయంతోనైనా పరువు నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ కోసం పా యింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తోంది.  

(చదవండి: కోవిడ్‌ నుంచి కోలుకున్న రుతురాజ్‌.. అయినప్పటికి నిరాశే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement