దాదాపు రెండు నెలల తర్వాత జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహాలు షురూ చేస్తున్న జట్టు ఒకవైపు... వరల్డ్‌కప్‌కు అర్హత సాధించకుండా దూరంగా ఉండిపోయిన జట్టు మరోవైపు... తుది జట్టు కూర్పు ప్రయత్నాల్లో, కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నంలో ఒక జట్టు... అసలు గెలుపు, ఓటముల ప్రభావమే లేకుండా, గెలిస్తే కనీసం వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్లు కూడా అందుబాటులో లేని స్థితిలో మరో జట్టు... ఈ నేపథ్యంలో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్లతో టీమిండియా సహజంగానే ఫేవరెట్ కాగా, విండీస్ ఈ ఫార్మాట్‌లోనైనా పోటీ ఇస్తుందా అనేది చూడాలి.
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): తొలి టెస్టు గెలిచి, రెండో టెస్టులో వాన కారణంగా విజయావకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డేల్లో చెలరేగేందుకు సిద్ధమైంది. భారత్, విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తొలి పోరు జరుగుతుంది. వరల్డ్‌కప్‌నకు ముందు సాధనగా ఉపయోగపడగల ఈ సిరీస్‌లో రోహిత్ బృందం పూర్తి స్థాయిలో సత్తా చాటాలని భావిస్తుండగా... సీనియర్ల గైర్హాజరుతో పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు విండీస్ ప్రయతి్నస్తోంది.
సూర్యకుమార్‌పై దృష్టి...
23 మ్యాచ్‌లలో 433 పరుగులు... వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు ఇవి. టి20ల్లో విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నా, వన్డేల్లో అతను ఇంకా తడబడుతూనే ఉన్నాడు. ఆసీస్‌తో గత మూడు వన్డేల్లో తొలి బంతికి డకౌట్ అరుదైన రికార్డు సాధించిన అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక. వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్ మధ్య గట్టి పోటీ ఉంది.
అప్పుడప్పుడు మాత్రమే అవకాశాలు దక్కించుకున్న సామ్సన్ ఈసారి చాన్స్ వృథా చేసుకోకూడదని పట్టుదలగా ఉన్నాడు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజాలతో పాటు పిచ్‌ను బట్టి అక్షర్, శార్దుల్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.
టెస్టుల్లో సత్తా చాటిన సిరాజ్ ఇక్కడా పేస్ బౌలింగ్ దళానికి సారథి. రెండో పేసర్‌గా ఉమ్రాన్ తనకు దక్కిన అవకాశాన్ని వాడుకోవాల్సి ఉంది. చహల్‌కంటే కూడా ఈ ఏడాది భారత్ ఆడిన 9 వన్డేల్లో 8 మ్యాచ్‌లలో బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్‌కే ప్రధాన స్పిన్నర్‌గా అవకాశం ఉంది. భారత టాప్–3 రోహిత్, గిల్, కోహ్లి తమ స్థాయి మేరకు ఆడితే జట్టుకు తిరుగుండదు.
హెట్‌మైర్ పునరాగమనం...
సమీప భవిష్యత్తు గురించి ఎలాంటి స్పష్టత లేకపోయినా పరువు దక్కించుకునే ప్రయత్నంలో వెస్టిండీస్ పోరాడనుంది. వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్‌లో పేలవ ప్రదర్శన వారి వన్డే జట్టు స్థాయిని చూపిస్తోంది. హోల్డర్, పూరన్, కీమో పాల్‌లాంటి కాస్త పేరున్న ఆటగాళ్లూ ఈ సిరీస్‌కు దూరమయ్యారు.
టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఫలితంతో సంబంధం లేకుండా కొత్తగా ప్రయత్నిం చేందుకు సిద్ధమైంది. గుడకేశ్ మోతీ, యానిక్ కారియా, జేడెన్ సీల్స్‌లాంటి ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది సరైన అవకాశం. 47 వన్డేల్లో 100కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పాటు భారత్‌పైనే రెండు సెంచరీలు సాధించిన హెట్‌మైర్‌పైనే ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. కింగ్, కెప్టెన్ షై హోప్ బ్యాటింగ్‌లో ఇతర కీలక ఆటగాళ్లు.
8 ఇరుజట్ల మధ్య జరిగిన గత 8 వన్డేల్లో భారతే విజయం సాధించింది. 2019 డిసెంబర్‌లో భారత్‌ను ఆఖరిసారిగా విండీస్ ఓడించింది.
6 వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌తో భారత జట్టు ఇప్పటి వరకు పది ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడింది. ఇందులో ఆరుసార్లు భారత్, నాలుగుసార్లు వెస్టిండీస్ సిరీస్‌లు గెల్చుకున్నాయి. గత ఐదు సిరీస్‌లలో భారతే పైచేయి సాధించింది. 2006లో చివరిసారి విండీస్ సొంతగడ్డపై భారత్‌పై సిరీస్ నెగ్గింది.
పిచ్, వాతావరణం
దాదాపు ఏడాది క్రితం ఇక్కడ జరిగిన వన్డే సిరీస్‌లో బౌలర్లు బాగా ప్రభావం చూపడంతో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. అయితే ఈసారి కొంత బ్యాటింగ్‌కు అనుకూలం. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment