
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ కీలక విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో జెయింట్స్ ఘన విజయం సాధించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ (59 బంతుల్లో 96 నాటౌట్; 17 ఫోర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోగా, హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం వారియర్స్ 17.1 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది.
షినెల్ హెన్రీ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్రేస్ హారిస్ (30 బంతుల్లో 25; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కాశ్వీ, తనూజ చెరో 3 వికెట్లు తీశారు. వాజ్‌పేయి ఇకానా స్టేడియంలో ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కాగా...సొంత మైదానంలో యూపీ చిత్తుగా ఓడింది. తొలి ఓవర్లోనే హేమలత (2) వికెట్ కోల్పోయినా... మూనీ, హర్లీన్ రెండో వికెట్‌కు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 101 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ముఖ్యంగా మూనీ బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరును అందించింది. 37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. యూపీ బౌలర్లంతా సమష్టిగా విఫలం కాగా...ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న హైదరాబాదీ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాకు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు! ఛేదనలో వారియర్స్ మరీ పేలవంగా ఆడింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి డాటిన్ దెబ్బ కొట్టగా...పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 29/4కు చేరింది. ఆ తర్వాత ఏ దశలోనూ యూపీ కోలుకోలేకపోయింది. రెండు రోజుల విశ్రాంతి అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ ఆడుతుంది.
చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment