ఓపెనర్లు శుభారంభం చేసినా చేయకపోయినా... ఛేదనలో మాత్రం కోహ్లి ఆటే కీలకం. అదెన్నోసార్లు రుజువైంది కూడా! మరిపుడు రోహిత్, రాహుల్ చక్కని ఆరంభమే ఇచ్చారు. కోహ్లి కూడా బాగా ఆడాడు. కానీ మిడిలార్డరే తమకు పట్టనట్టుగా చేతులెత్తేసింది. దీంతో ఒకదశలో విజయానికి ఎంతో దూరంలో భారత్ నిలిచింది. ఇలాంటి దశలో విరాట్ కడదాకా ఉండాల్సిందే. కానీ గెలిపించే ఈ నాయకుడు కూడా లక్ష్యానికి 30 పరుగుల దూరంలో అవుటయ్యాడు.
ఈ పరిణామంతో స్టేడియమే కాదు... యావత్ దేశమే షాకయ్యింది. పరాజయం ఖాయమనుకుంది. కానీ జడేజాకు టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు,1 సిక్స్) జతయ్యాడు. ఇద్దరూ గెలిపించే మెరుపులతో అలరించారు. కీలకదశలో స్ఫూర్తిదాయక బ్యాటింగ్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్‌పై భారత్‌కు వరుసగా పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించారు.
కటక్: విజయవంతమైన సారథి విరాట్ కోహ్లి ఖాతాలో మరో వన్డే సిరీస్ జమ అయింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (64 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ పొలార్డ్ (51 బంతుల్లో 74 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగారు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ నవదీప్ సైనీకి 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు), రాహుల్ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి.
మందకొడిగా ఆరంభం...
టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ పరుగుల ఆట మొదలు పెట్టింది. కరీబియన్ ఆట చాలా నెమ్మదిగా మొదలైంది. 3 ఓవర్లు ముగిసినా స్కోరు బోర్డులో మూడే పరుగులున్నాయి. ఆ తర్వాత షై హోప్ బ్యాట్‌కు పనిచెప్పడంతో కాస్త వేగం పెరిగింది. లూయిస్ కూడా అడపాదడపా బౌండరీలు బాదినా 10 ఓవర్లలో విండీస్ స్కోరు 44/0. మందకొడిగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు జడేజా బ్రేక్ ఇచ్చాడు. లూయిస్ (21)ను పెవిలియన్ చేర్చాడు. కాసేపటికి హోప్ (50 బంతుల్లో 42; 5 ఫోర్లు)ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 20 ఓవర్లలో విండీస్ 2 వికెట్ల నష్టానికి 70 పరుగులే చేయగలిగింది. చాలా ఆలస్యంగా 26వ ఓవర్లో 100 పరుగులు దాటింది. ఈ రన్‌రేట్‌తో ఇక లాభం లేదనుకున్నాడేమో హెట్‌మైర్ ధాటిని పెంచాడు. 2 ఫోర్లు 2 సిక్స్‌లు కొట్టిన హెట్‌మైర్ (33 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను సైనీ ఔట్ చేశాడు. కాసేపటికే చేజ్ (48 బంతుల్లో 38; 3 ఫోర్లు) కూడా సైనీనే పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో పూరన్, పొలార్డ్ విండీస్‌ను ఆదుకున్నారు. ముందుగా నిలదొక్కుకున్నాక భారత బౌలర్ల భరతం పట్టారు. ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ధనాధన్, ఫటాఫట్
కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్
వెస్టిండీస్ భారీ స్కోరుకు ఆఖరి మెరుపులే దోహదం చేశాయి. 45 ఓవర్లదాకా కరీబియన్ స్కోరు 238/4. హిట్టర్లు పూరన్, పొలార్డ్ క్రీజులో ఉండటం, అప్పటికే క్రీజులో పాతుకొని పోవడంతో ధనాధన్‌కు ఎదురేలేకుండా పోయింది. ఈ ఐదు ఓవర్లలో భారత్ 77 పరుగులు సమర్పించుకుంది. సైనీ 46వ ఓవర్లో పూరన్ 3 బౌండరీలు సహా మొత్తం 14 పరుగులు చేశాడు. 47వ ఓవర్లో షమీ మొదటి బంతికే పొలార్డ్ సిక్స్ బాదాడు. ఈ ఓవర్లో విండీస్ 10 పరుగులు పిండుకుంది. శార్దుల్ వేసిన 48వ ఓవర్లో పూరన్ ఔటైనా అంతకుముందే అతను 2 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. ఆఖరి బంతిని హోల్డర్ బౌండరీకి తరలించడంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. తర్వాత సైనీ, షమీ ఓవర్లలో పొలార్డ్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో విండీస్ స్కోరు 300 దాటేసింది.
వేట మొదలైందిలా...
లక్ష్యం కష్టమైందే కానీ ఫ్లాట్ పిచ్ దృష్ట్యా నిలబడితే ఛేదించే స్కోరిది. అందుకేనేమో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ ఒక్కో పరుగును జతచేస్తూ, వీలైనపుడే బౌండరీకి తరలిస్తూ పరుగుల వేటకు శ్రీకారం చుట్టారు. కాట్రెల్ తొలి ఓవర్ మెయిడెన్ కాగా... రెండో ఓవర్లో రాహుల్ ఫోర్‌తో భారత పరుగు మొదలైంది. మూడు, నాలుగు ఓవర్లో రోహిత్ ఫోర్లు, సిక్సర్‌తో వేగం పెరిగింది. రాహుల్ కూడా అదుపు తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ ‘హిట్‌మ్యాన్’ను అనుసరించాడు. 10 ఓవర్లలో జట్టు వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేయగలిగింది.
రోహిత్, రాహుల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ...
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్
ఆ తర్వాత కూడా ఓపెనర్లు అనవసర షాట్లకు వెళ్లకుండానే చేయాల్సిన రన్‌రేట్‌ను ఓ కంట కనిపెడుతూనే స్కోరును నడిపించారు. జట్టు స్కోరును 16వ ఓవర్లో 100 పరుగులు దాటించారు. ఆ వెంటనే రాహుల్ 49 బంతుల్లో, రోహిత్ 52 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. 22వ ఓవర్లో హోల్డర్ ఈ జోడీని విడగొట్టడంతో 122 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
మిడిల్...కుదేల్...
కోహ్లి అండతో రాహుల్ జోరు పెంచే ప్రయత్నం చేశాడు. జోసెఫ్ వేసిన 28వ ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. అతని నిలకడైన ఆటతీరు చూస్తుంటే సెంచరీ ఖాయమనిపించింది. కానీ జోసెఫ్ మరుసటి ఓవర్లోనే రాహుల్ లూజ్ షాట్‌తో వెనుదిరిగాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోగా అదికాస్తా రాహుల్ గ్లౌజ్‌ను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. తర్వాత వచి్చన శ్రేయస్ అయ్యర్ (7) ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయాడు. జట్టు స్కోరు 200 పరుగులు దాటాకా, సారథి కోహ్లికి సహకరించాల్సిన పంత్ (7)... అనవసరంగా వికెట్లపై కి ఆడుకొని బౌల్డయ్యాడు. కేదార్ జాదవ్ (9)ను కాట్రెల్ బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 228/5. సగం వికెట్లు కోల్పోగా ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కోహ్లి ఒక్కడే! జడేజాను అట్టిపెట్టుకుని లక్ష్యం దిశగా తీసుకెళ్లే బాధ్యత మోశాడు. అర్ధసెంచరీ సాధించాడు. ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించాక కీమో పాల్ బౌలింగ్‌లో కోహ్లి బౌల్డయ్యాడు.
శార్దుల్ చకచకా...
రవీంద్ర జడేజా,శార్దుల్ ఠాకూర్
కోహ్లి పెవిలియన్ చేరే సమయానికి భారత విజయ సమీకరణం 23 బంతుల్లో 30 పరుగులు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో పరాజయం తప్పదనుకున్నారంతా. అనుభవజ్ఞుడైన జడేజా (39 నాటౌట్; 4 ఫోర్లు)కు శార్దుల్ జత చేరగా పరుగులు చేసే బాధ్యత పూర్తిగా జడేజాదే కానీ... ఇక్కడ శార్దులే (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆ బాధ్యత తీసుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతిని కవర్స్ దిశగా బౌండరీ దాటించిన శార్దుల్... ఆ తర్వాత కాట్రెల్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. శార్దుల్ చేసినవి కాసిన్ని పరుగులే అయినా అవెంతో విలువైనవి... జట్టును గెలిపించినవి... సిరీస్‌ను అందించినవి అయ్యాయి.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఎవిన్ లూయిస్ (సి) సైనీ (బి) జడేజా 21; షై హోప్ (బి) షమీ 42; రోస్టన్ చేజ్ (బి) సైనీ 38; హెట్‌మైర్ (సి) కుల్దీప్ యాదవ్ (బి) సైనీ 37; నికోలస్ పూరన్ (సి) జడేజా (బి) శార్దుల్ 89; కీరన్ పొలార్డ్ (నాటౌట్) 74; జేసన్ హోల్డర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 315.
వికెట్ల పతనం: 1–57, 2–70, 3–132, 4–144, 5–279. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 10–0– 66–1, షమీ 10–2–66–1, నవదీప్ సైనీ 10–0–58–2, కుల్దీప్ 10–0–67–0, జడేజా 10–0–54–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) షై హోప్ (బి) హోల్డర్ 63; కేఎల్ రాహుల్ (సి) షై హోప్ (బి) జోసెఫ్ 77; కోహ్లి (బి) కీమో పాల్ 85; శ్రేయస్ అయ్యర్ (సి) జోసెఫ్ (బి) కీమో పాల్ 7; రిషభ్ పంత్ (బి) కీమో పాల్ 7; కేదార్ జాదవ్ (బి) కాట్రెల్ 9; రవీంద్ర జడేజా (నాటౌట్) 39; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (48.4 ఓవర్లలో 6 వికెట్లకు) 316.
వికెట్ల పతనం: 1–122, 2–167, 3–188, 4–201, 5–228, 6–286. బౌలింగ్: కాట్రెల్ 10–1–74–1, హోల్డర్ 10–0–63–1, కీమో పాల్ 9.4–0–59–3, చేజ్ 4–0–19–0, ఖారీ పైర్ 7–0–46–0, జోసెఫ్ 8–0–53–1.
భారత క్రికెట్‌కు 2019
అద్భుతంగా గడిచింది. ప్రపంచ కప్‌లోనూ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో 30 నిమిషాలను మినహాయిస్తే మిగతాదంతా గొప్పగా సాగింది. ఎప్పటికైనా ఐసీసీ ట్రోఫీలను పొందేందుకు మేం నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటాం. ముఖ్యంగా మా పేస్ దళం ఎక్కడైనా, ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కొనేలా తయారైంది. భారత్‌లో స్పిన్నర్లను మించి పేసర్లు రాణించడం అనేది గొప్ప పరిణామం. రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను కొత్త ఆటగాళ్లే నడిపించాలి కాబట్టి ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఎలా రాణిస్తారనే అంశాన్ని మేం పరీక్షిస్తున్నాం. ఈ రోజు మా ఆట సంతృప్తి కలిగించింది. మంచు ప్రభావం ఉండటంతో భాగస్వామ్యాలు నిర్మించడంపై దృష్టి సారించాం. ఇది పనిచేసింది. నేను అవుటయ్యాక ‘జడ్డూ’ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. కేవలం మూడు ఓవర్లలోనే శార్దుల్, జడేజా మ్యాచ్ గతిని మార్చేశారు. బయట నుంచి ఇతరులు ఆట పూర్తి చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది.’
–కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment