పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను సెంచరీతో చిరస్మరణీయం చేసుకున్నాడు. విరాట్ కోహ్లి (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) శతకానికి తోడు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు సాధించారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగుల భారీ స్కోరు సాధించింది.
రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. ఆ వెంటనే కోహ్లి కూడా 180 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లోనే జడేజా అర్ధ సెంచరీ పూర్తయ్యింది. కొత్త బంతితో కరీబియన్ జట్టు శుక్రవారం ఆట ఆరంభించినప్పటికీ సీమర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రితంరోజు లాగే కోహ్లి–జడేజా తొలిసెషన్‌లో క్రీజును వీడకుండా విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. యథేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు సులువుగానే వచ్చాయి.
ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించాక జట్టు స్కోరు 341 వద్ద కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. స్క్వేర్‌లెగ్ దిశగా ఆడిన కోహ్లి సింగిల్ తీసే క్రమంలో కాస్త వెనకడుగు వేశాడు. అయితే ముందుకే వెళ్లినా...జోసెఫ్ డైరెక్ట్ త్రో నాన్‌స్రై్టకింగ్ ఎండ్ వద్ద వికెట్లను తాకడంతో రనౌటయ్యాడు. మరికొద్దిసేపటికే రోచ్ బౌలింగ్‌లో జడేజా వెనుదిరిగాడు. లంచ్ విరామ సమయానికి 373/6 స్కోరు వద్ద ఇషాన్ కిషన్ (25; 4ఫోర్లు), అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు.
అనంతరం టెయిలెండర్లు ఉనాద్కట్ (7), సిరాజ్ (0)లతో కలిసి అశ్విన్ జట్టు స్కోరును 400 దాటించాడు. రోచ్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న అశ్విన్ మరో ఫోర్ కొట్టి ఆఖరి బంతికి బౌల్డ్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 128 ఓవర్లలో 438 పరుగుల వద్ద ముగిసింది. వారికన్, రోచ్ చెరో 3 వికెట్లు తీశారు.
తొలిరోజు ఆఖరి సెషన్‌లో...
రెండో సెషన్‌లో వరుస విరామాల్లో 4 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్‌కు ఆఖరి సెషన్‌లో చుక్కెదురైంది. కోహ్లి, జడేజా క్రీజులో పాతుకుపోవడంతో ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 97 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో సెషన్ ఆసాంతం ఆడి అబేద్యమైన ఐదో వికెట్‌కు 106 పరుగులు జతచేశారు. 288/4 స్కోరు వద్ద తొలిరోజు ఆట ముగిసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలందేసరికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (4 బ్యాటింగ్), తేజ్‌నారాయణ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
29 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. డాన్ బ్రాడ్‌మన్ (29)ను అతను సమం చేశాడు.
76 అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి శతకాల సంఖ్య
5 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహా్వగ్ (8586) ను దాటి కోహ్లి (8676) ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), సునీల్ గావస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8781) మాత్రమే కోహ్లికంటే ముందున్నారు.
400 అంతర్జాతీయ క్రికెట్‌లో కీమర్ రోచ్ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెకెంజీ (బి) హోల్డర్ 57; రోహిత్ (బి) వారికన్ 80; శుబ్‌మన్ (సి) జొషువా (బి) రోచ్ 10; కోహ్లి రనౌట్ 121; రహానె (బి) గ్యాబ్రియెల్ 8; జడేజా (సి) జొషువా (బి) రోచ్ 61; ఇషాన్ కిషన్ (సి) జొషువా (బి) హోల్డర్ 25; అశ్విన్ (బి) రోచ్ 56; ఉనాద్కట్ (స్టంప్డ్) జొషువా (బి) వారికన్ 7; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికన్ 0; ముకేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (128 ఓవర్లలో ఆలౌట్) 438.
వికెట్ల పతనం: 1–139, 2–153, 3–155, 4–182, 5–341, 6–360, 7–393, 8–416, 9–426, 10–438. బౌలింగ్: రోచ్ 22–2–104–3, జోసెఫ్ 22–0– 97–0, గ్యాబ్రియెల్ 18–0–74–1, వారికన్ 39–7–89–3, హోల్డర్ 21–3–57–2, అలిక్ 4–0–12–0, బ్రాత్‌వైట్ 2–1–1–0.
Comments
Please login to add a commentAdd a comment