WI Vs Ind 2nd Test: India's Opening Pair Got Off To A Good Start In The Second - Sakshi
Sakshi News home page

భారత్‌ 182/4

Published Fri, Jul 21 2023 3:10 AM | Last Updated on Fri, Jul 21 2023 6:05 PM

Indias opening pair got off to a good start in the second  - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: రెండో టెస్టులోనూ భారత ఓపెనింగ్‌ జోడీ అదరగొట్టింది. కానీ తొలి సెషన్‌ వరకే ఈ శుభారంభం పరిమితమైంది. సెషన్‌ మారగానే వెస్టిండీస్‌ బౌలింగ్‌ ప్రతాపం మొదలైంది. ‘టాప్‌’ లేపింది. ఇరు జట్లు చెరిసగం ఆధిపత్యాన్ని పంచుకోవడంతో ఈ మ్యాచ్‌ పోటాపోటీగా మొదలైంది. టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ బౌలింగ్‌కే మొగ్గుచూపగా, యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభించారు.

ఉదయం సెషన్‌ అంతా వీళ్లిద్దరు ఆడుతూపాడుతూ పరుగులు సాధించారు. చెత్త బంతుల్ని సిక్సర్లుగా మలిచారు. ఈ క్రమంలో ముందుగా ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ 74 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 21వ ఓవర్లోనే జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే ధాటిగా ఆడుతున్న జైస్వాల్‌ కూడా 49 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 121/0 వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.

భోజన విరామం తర్వాత 30 నుంచి 40 ఓవర్ల మధ్యలో... కేవలం 8 ఓవర్ల వ్యవధిలో కీలకమైన టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ముందుగా యశస్వి జైస్వాల్‌ (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్‌)కు హోల్డర్‌ చెక్‌ పెట్టగా, రోచ్‌ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌కు శుబ్‌మన్‌ గిల్‌ (10; 2 ఫోర్లు) నిష్క్రమించాడు. కోహ్లితో కలిసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్‌ శర్మ (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను వారికన్‌ బోల్తా కొట్టించాడు.

అనుభవజ్ఞుడైన రహానే (8) క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 139/0 స్కోరు కాస్తా 182/4గా మారిపోయింది. టీ విరామానికి భారత్‌ 50.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లి (18 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గాయపడిన శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంలో అతన్ని తీసుకున్నారు. విండీస్‌ తరఫున కిర్క్‌ మెకెంజి కెరీర్‌ మొదలు పెట్టాడు.   

10  ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పదో క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్, ధోని, ద్రవిడ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 

భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య 100వ టెస్టు సందర్భంగా టీమిండియా కెపె్టన్‌ రోహిత్‌ శర్మకు జ్ఞాపికను అందజేసిన వెస్టిండీస్‌ క్రికెట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కిశోర్‌ షాలో, దిగ్గజం బ్రియాన్‌ లారా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement