West Indies Are Playing Cautiously In The Second Test - Sakshi
Sakshi News home page

భారత్‌తో రెండో టెస్టు: వెస్టిండీస్‌ నిలకడ 

Published Sun, Jul 23 2023 4:17 AM | Last Updated on Mon, Jul 31 2023 7:53 PM

West Indies are playing cautiously in the second Test - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. మ్యాచ్‌ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెపె్టన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (235 బంతుల్లో 75; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా...బ్లాక్‌వుడ్‌ (16 నాటౌట్‌), అలిక్‌ అతనజ్‌ (13 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది.

తొలి సెషన్‌లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, విండీస్‌ 31 పరుగులు చేసి కిర్క్‌ మెకన్జీ (57 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మెకన్జీని భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్‌ కుమార్‌ తన తొలి వికెట్‌గా పెవిలియన్‌ పంపించడం విశేషం. ముకేశ్‌ వేసిన బంతిని ఆడలేక మెకన్జీ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెకన్జీ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.

ఉనాద్కట్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌ మీదుగా సిక్స్‌ బాదాడు. లంచ్‌ విరామ సమయానికి బ్రాత్‌వైట్‌ 49 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్‌ ప్రారంభం కాగానే బ్రాత్‌వైట్‌ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే సెషన్‌లో అతని వికెట్‌ తీయడంలో భారత్‌ సఫలమైంది.

అశ్విన్‌ వేసిన చక్కటి బంతి బ్రాత్‌వైట్‌ మిడిల్‌ స్టంప్‌ను తాకింది. ఆ తర్వాత బ్లాక్‌వుడ్, అతనజ్‌ కలిసి జట్టును నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్‌కు ప్రతికూలంగా వచ్చాయి.
 
తొలి టెస్టుతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంతో మెరుగ్గా కనిపించింది. రెండో రోజు వెస్టిండీస్‌ ఓపెనర్లు పట్టుదలగా ఆడి శుభారంభం అందించారు. బ్రాత్‌వైట్, తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ (95 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి 34.2 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి 71 పరుగులు జోడించారు.

జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షాట్‌ ఆడబోయిన చందర్‌పాల్‌ పాయింట్‌లో అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే బ్రాత్‌వైట్, మెకన్జీ కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 41 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (37 నాటౌట్‌), మెకన్జీ (14 నాటౌట్‌) అజేయంగా నిలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement