IND Vs WI 2nd Test: India Vs West Indies 2nd Test Live Streaming Details In Telugu - Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎదురుందా! 

Published Thu, Jul 20 2023 3:05 AM | Last Updated on Sat, Jul 22 2023 3:33 PM

Second Test against West Indies from today - Sakshi

భారత జట్టుపై టెస్టుల్లో వెస్టిండీస్‌ గెలిచి 21  ఏళ్లవుతోంది. తొలి టెస్టులో చెలరేగి సెంచరీ  సాధించిన యశస్వి జైస్వాల్‌ వయసు అప్పుడు ఐదు నెలలు! ఈ ఉదాహరణ చాలు ఇరు జట్ల మధ్య అంతరం ఎలా ఉందో చెప్పడానికి. ఆ తర్వాత భారత్, విండీస్‌ 24 సార్లు తలపడితే టీమిండియా 15 టెస్టులు, గెలవగా మరో ‘9’ డ్రా అయ్యాయి.

గత మ్యాచ్‌లో విండీస్‌ ఆట చూస్తే ఏ రకంగానూ భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి  కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో టెస్టుకు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌తో పోలిస్తే క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానం పేస్‌  బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటం ఆతిథ్య జట్టుకు సానుకూలత.   
పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ (ట్రినిడాడ్‌): ఏకపక్షంగా సాగిన తొలి టెస్టు తర్వాత భారత్, వెస్టిండీస్‌ తర్వాతి సమరానికి సిద్ధమయ్యాయి. భారత్‌ 1–0తో సిరీస్‌లో ముందంజగా ఉండగా... నేటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. మరో విజయంతో క్లీన్‌స్వీప్‌ చేయాలని రోహిత్‌ సేన భావిస్తుండగా... సొంతగడ్డపై కాస్త మెరుగైన ప్రదర్శనతో పరువు కాపాడుకోవాలని విండీస్‌ భావిస్తోంది. ఇరు జట్ల మద్య ఇది 100వ టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం.  

మార్పుల్లేకుండా... 
తుది జట్టు విషయంలో భారత్‌కు ఎలాంటి సందిగ్ధత లేదు. గెలిచిన జట్టునే కొనసాగించే క్రమంలో అదే 11 మందితో బరిలోకి దిగవచ్చు. కెరీర్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌పై మరోసారి అందరి దృష్టీ నిలిచింది. అయితే ఎన్నో అంచనాలు ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ టెస్టుల్లో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. 17 టెస్టుల తర్వాత కూడా అతని సగటు 31.96 మాత్రమే ఉంది.    

పేస్‌పై నమ్మకం... 
అరంగేట్ర టెస్టులో అతనాజ్‌ ప్రదర్శన మినహా గత మ్యాచ్‌లో విండీస్‌ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. పేలవ బ్యాటింగ్, నిస్సారమైన బౌలింగ్‌ ఆ జట్టును మరీ బలహీన ప్రత్యర్థి గా మార్చాయి. ఈ మ్యాచ్‌లోనైనా విండీస్‌ ఏమైనా పోరాడుతుందా అనేది చూడాలి. భారత్‌తో పోలిస్తే రోచ్, జోసెఫ్, గాబ్రియెల్‌ రూపంలో కాస్త అనుభవజు్ఞలైన పేసర్లు జట్టులో ఉన్నారు. పిచ్‌ను సరిగా వాడుకొని వీరు భారత బ్యాటర్లపై ఏమైనా ప్రభావం చూపించగలిగితే మ్యాచ్‌ కాస్త ఆసక్తికరంగా మారుతుంది.  

100 భారత్, విండీస్‌ మధ్య ఇది 100వ టెస్టు. ఇప్పటి వరకు జరిగిన 99 టెస్టుల్లో  విండీస్‌ 30 గెలిస్తే, భారత్‌ 23 గెలిచింది. మరో 46 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 
500  కోహ్లికి మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌. కెరీర్‌లో అతను మొత్తం 25,461 పరుగులు సాధించాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement