న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్‌లో కీలక పరిణామం... సుదీర్ఘ కాలంగా జట్టులో కీలక సభ్యుడిగా, పలు చిరస్మరణీయ విజయాల్లో ముందుండి నడిపించిన చతేశ్వర్ పుజారాపై సెలక్టర్లు విశ్వాసం కోల్పోయారు. వచ్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ను (డబ్ల్యూటీసీ 2023–2025) దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ చేయబోతున్న మార్పుల్లో భాగంగా అందరికంటే ముందుగా పుజారాపై వేటు పడింది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన భారత జట్టులో పుజారాకు చోటు దక్కలేదు.
అతనితో పాటు ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లోకి మరో పేస్ బౌలర్ నవదీప్ సైనీ కూడా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన అజింక్య రహానే తన స్థానం నిలబెట్టుకోవడంతో పాటు వైస్ కెపె్టన్‌గా కూడా ఎంపిక కావడం విశేషం.
భిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్ తన స్థానం నిలబెట్టుకోగా... గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ పేర్లను పరిశీలించలేదు. మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా, జనవరి 2021 తర్వాత మళ్లీ టెస్టు ఆడని సైనీకి మరో చాన్స్ దక్కింది. భారత్, విండీస్ మధ్య జూలై 12–16, జూలై 20–24 మధ్య డొమినికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లలో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి.
అనూహ్య ఎంపికలేమీ లేకుండా...
వెస్టిండీస్‌తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం ఎలాంటి ఆశ్చర్యకర ఎంపికలు లేవు. భారత్ ఆడిన గత 4 వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ సంజు సామ్సన్ తిరిగి జట్టులోకి ఎంపిక కావడమే చెప్పుకోదగ్గ విశేషం. ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో తొలి బంతికే వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేసినా... సూర్యకుమార్ యాదవ్‌కు మళ్లీ అవకాశం దక్కింది
. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది. ఎంపిక చేసిన 17 మందితో పాటు గాయాల నుంచి కోలుకొని బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందు బాటులోకి వస్తే 20 మందితో వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక సాగినట్లు అర్థమవుతోంది. భారత్, విండీస్ మధ్య జూలై 27, 29, ఆగస్ట్ 1 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి.
రంజీల్లో సత్తా చాటి...
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యశస్వి ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా ఘనంగా ఉండటం అతనికి టెస్టు టీమ్‌లో అవకాశం క ల్పించింది. 26 ఇన్నింగ్స్‌లలోనే అతను 80.21 సగటుతో 1845 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో 213, 144 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కూడా రిజర్వ్‌గా అతను ఇటీవల జట్టుతో పాటు లండన్ వెళ్లాడు.
ఫస్ట్‌క్లాస్‌లో 42.19 సగటు ఉన్న రుతురాజ్ రికార్డు గొప్పగా లేకపోయినా, అతని టెక్నిక్ టెస్టు ఫార్మాట్‌కు పనికొస్తుందని భావించి సెలక్టర్లు గత కొంతకాలంగా అతడిపై దృష్టి పెట్టారు. గత మూడు రంజీ సీజన్‌లలో బెంగాల్ రెండుసార్లు ఫైనల్ వెళ్లడంలో పేసర్ ముకేశ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా రాణించిన అతను 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 21.55 సగటుతో 149 వికెట్లు తీశాడు. ఈ ముగ్గురిలో రుతురాజ్ ఇప్పటికే భారత్ తరఫున ఒక వన్డే, 9 టి20లు ఆడగా మిగతా ఇద్దరు ఇంకా అరంగేట్రం చేయలేదు.
టెస్టు జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్.
Comments
Please login to add a commentAdd a comment