విశాఖలో విధ్వంసం | 2nd ODI India Beat West Indies By 107 Runs | Sakshi
Sakshi News home page

విశాఖలో విధ్వంసం

Published Thu, Dec 19 2019 1:16 AM | Last Updated on Thu, Dec 19 2019 8:29 AM

2nd ODI India Beat West Indies By 107 Runs - Sakshi

రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌

సాగర తీరం పరుగుల సునామీతో హోరెత్తింది. ఫోర్లు, సిక్సర్లతో విశాఖపట్నం పోటెత్తింది. బ్యాట్‌కు తగలడమే తరువాయి బంతులు వేగంగా బౌండరీలు దాటాయి. చెన్నైలో దెబ్బ తిన్న తర్వాత టీమిండియా తగిన రీతిలో జవాబిచి్చంది. ముందుగా రోహిత్, రాహుల్‌ అద్భుత సెంచరీలకు అయ్యర్, పంత్‌ దూకుడైన బ్యాటింగ్‌ తోడు కావడంతో భారత్‌ భారీ స్కోరుతో ప్రత్యరి్థకి సవాల్‌ విసిరింది. ఆ తర్వాత మిగతా పనిని మన బౌలర్లు పూర్తి చేశారు.

హోప్, పూరన్‌ పోరాడినా భారీ లక్ష్యాన్ని ఛేదించడం విండీస్‌కు శక్తికి మించిన పనే అయింది. ‘చైనామన్‌ బౌలర్‌’ కుల్దీప్‌ యాదవ్‌ కూడా తన రెండో వన్డే హ్యాట్రిక్‌తో మెరవడంతో భారత్‌ గెలుపు సులువైంది. మొత్తంగా వైజాగ్‌ వన్డే ఏకంగా 667 పరుగులు, 29 సిక్సర్లతో ప్రేక్షకులకు వినోదం పంచగా... సిరీస్‌ను సమం చేసిన కోహ్లి సేన ఆదివారం కటక్‌లో జరిగే చివరి పోరుకు ‘సై’ అంటూ  సిద్ధమైంది.   

సాక్షి, విశాఖపట్నం: వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓటమి నుంచి భారత్‌ వెంటనే కోలుకుంది. బుధవారం ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు.

వీరిద్దరు తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించడం విశేషం. శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. షై హోప్‌ (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (47 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా, కీమో పాల్‌ (42 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. షమీ, కుల్దీప్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు తీశారు.  తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌ ఆదివారం కటక్‌లో జరుగుతుంది.
 
భారీ భాగస్వామ్యం...
ఇన్నింగ్స్‌ ఆరంభంలో సహచరుడు రోహిత్‌కంటే రాహుల్‌ ధాటిగా ఆడాడు. కాట్రెల్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను హోల్డర్‌ వేసిన తర్వాతి ఓవర్లో సిక్సర్‌తో దూకుడు పెంచాడు. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 55 పరుగులకు చేరింది. కొద్ది సేపటికి 46 బంతుల్లో ముందుగా రాహుల్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత 67 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాతా వీరిద్దరు తమ జోరును కొనసాగించారు. భారత ఓపెనర్లు చక్కటి స్ట్రోక్‌లతో ఆకట్టుకోగా... వీరిని నిలువరించడంలో విండీస్‌ బౌలర్లు విఫలమయ్యారు.32 ఓవర్లు ముగిసేసరికి కూడా రాహుల్‌కంటే వెనుకబడిన రోహిత్‌ తర్వాతి ఓవర్లో చెలరేగి తన సహచరుడిని దాటేశాడు.

ఖారీ పైర్‌ వేసిన ఈ ఓవర్లో ఫోర్, సిక్సర్‌ బాది శతకానికి చేరువయ్యాడు. హోల్డర్‌ వేసిన తర్వాతి ఓవర్లో లాంగాన్‌ దిశగా సింగిల్‌ తీసి రోహిత్‌ 107 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఈ ఏడాది రోహిత్‌కిది 7వ సెంచరీకాగా... కెరీర్‌లో 28వ సెంచరీ. తొలి వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం దాటాక... జోసెఫ్‌ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టడంతో రాహుల్‌ కూడా సెంచరీని అందుకున్నాడు. అయితే అదే ఓవర్‌ చివరి బంతికి థర్డ్‌మ్యాన్‌ వద్ద క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ వెనుదిరగడంతో విండీస్‌ ఊపిరి పీల్చుకుంది. అయితే మరో ఎండ్‌లో రోహిత్‌ మాత్రం తగ్గలేదు. సెంచరీ తర్వాత తాను ఎదుర్కొన్న 30 బంతుల్లోనే అతను 59 పరుగులు రాబట్టాడు. హోల్డర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో 150 కు చేరుకున్నాడు. మరో డబుల్‌ సెంచరీకి సన్నద్ధమైనట్లు కనిపించిన రోహిత్‌ను కాట్రెల్‌ అవుట్‌ చేశాడు. అప్పటికే అలసిన రోహిత్‌ కీపర్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  

ఇద్దరు మినహా...
దాదాపు అసాధ్యంగా కనిపించిన లక్ష్య ఛేదనలో విండీస్‌కు ఓపెనర్లు హోప్, లూయిస్‌ (35 బంతుల్లో 30; 5 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. రాహుల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన హోప్‌ దానిని సద్విని యోగం చేసుకున్నాడు. చకచకా పరుగులు సాధిం చిన వీరిద్దరు తొలి పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరును 56 పరుగులకు చేర్చారు. అయితే లూయిస్‌ను అవుట్‌ చేసి శార్దుల్‌ దెబ్బ తీయగా, జట్టు నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ (4) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ కావడం విండీస్‌ను బాగా దెబ్బ తీసింది. అయ్యర్‌ అద్భుత ఫీల్డింగ్‌ అందుకు కారణమైంది. పాయింట్‌ నుంచి బౌండరీ వరకు పరుగెత్తి బంతిని ఆపిన అయ్యర్‌...ఆ తర్వాత అదే జోరులో నాన్‌స్రై్టకింగ్‌ ఎండ్‌ వైపు విసరడం, జడేజా స్టంప్స్‌ను పడగొట్టడం వెంటనే జరిగిపోయాయి.

ఛేజ్‌ (4) విఫలం కాగా... హోప్, పూరన్‌ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పూరన్‌ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో అతను కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. జడేజా తర్వాతి ఓవర్లో మరింత చెలరేగిపోయిన పూరన్‌... రెండు సిక్సర్లు, ఫోర్‌ బాదాడు. షమీ, కుల్దీప్‌ వరుస ఓవర్లలోనూ అతను మళ్లీ సిక్స్, ఫోర్‌ కొట్టాడు. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి పూరన్‌ వెనుదిరగడంతో 106 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి బంతికే పొలార్డ్‌ (0) అవుటవ్వడంతో విండీస్‌ గెలుపు ఆశలు కోల్పోయింది. అనంతరం కుల్దీప్‌ ‘హ్యాట్రిక్‌’తో ఆ జట్టు పూర్తిగా కుప్పకూలింది.  

ఒకే ఓవర్లో 31 పరుగులు

రోహిత్‌ను అవుట్‌ చేసిన ఆనందం వెస్టిండీస్‌కు మిగలకుండా యువ ఆటగాళ్లు అయ్యర్, పంత్‌ చెలరేగిపోయారు. వీరిద్దరు భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి కేవలం 25 బంతుల్లోనే 73 పరుగులు జోడించడం విశేషం. జోసెఫ్‌ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పంత్‌...కాట్రెల్‌ వేసిన 46వ ఓవర్లో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 6, 0, 4, 6, 4, 4 కొట్టాడు. దాంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఛేజ్‌ వేసిన మరుసటి ఓవర్లో అయ్యర్‌ వంతు వచ్చింది. ఈ ఓవర్‌ తొలి బంతి పంత్‌ సింగిల్‌ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో అయ్యర్‌ వరుసగా 6, 6, 4, 6, 6 కొట్టాడు. ఈ ఓవర్లో భారత్‌ ఖాతాలో 31 పరుగులు చేరాయి. భారత వన్డే చరిత్రలో ఒకే ఓవర్లో ఇన్ని పరుగులు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ రెండు ఓవర్లలో కలిపి 55 పరుగులు రాబట్టిన భారత్‌... చివరి 3 ఓవర్లలో 24 పరుగులు రాబట్టింది. ఇందులో జాదవ్‌ 3 ఫోర్ల సహాయంతో చేసిన 16 పరుగులు ఉన్నాయి.  

కుల్దీప్‌ రెండో హ్యాట్రిక్‌

వన్డేల్లో రెండోసారి హ్యాట్రిక్‌ నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లోని 33వ ఓవర్లో కుల్దీప్‌ వరుస బంతుల్లో హోప్, హోల్డర్, జోసెఫ్‌లను అవుట్‌ చేశాడు. ఇంతకుముందు 2017లో ఆ్రస్టేలియాపై కోల్‌కతాలో కుల్దీప్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఇంతకుముందు భారత్‌ తరఫున వన్డేల్లో చేతన్‌ శర్మ (1987లో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై), కపిల్‌ దేవ్‌ (1991లో కోల్‌కతాలో శ్రీలంకపై), మొహమ్మద్‌ షమీ (2019లో అఫ్గానిస్తాన్‌పై సౌతాంప్టన్‌లో) కూడా హ్యాట్రిక్‌లు సాధించారు.  

రోహిత్‌ క్యాచ్‌ను వదిలేసి..

రోహిత్‌ శర్మలాంటి బ్యాట్స్‌మన్‌కు రెండో అవకాశం ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో గతంలో చాలాసార్లు రుజువైంది. ఈసారి కూడా అదే జరిగింది. ఛేజ్‌ వేసిన 28వ ఓవర్లో 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ బంతిని గాల్లోకి లేపగా...లాంగాన్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచి్చన హెట్‌మైర్‌ దానిని వదిలేశాడు. ఆ తర్వాత రోహిత్‌ తన స్కోరుకు మరో 89 పరుగులు జోడించాడు. భారత ఫీల్డర్లు కూడా రెండు క్యాచ్‌లు వదిలేసినా మ్యాచ్‌ తుది ఫలితంపై వాటి ప్రభావం పడలేదు. హోప్‌ ‘0’ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్, పూరన్‌ 22 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను దీపక్‌ చాహర్‌ వదిలేశారు.  

సెల్యూట్‌ లేదు!

వికెట్‌ తీయగానే సైనికుడి తరహాలో సెల్యూట్‌ చేయడం విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ శైలి. స్వయంగా ఆర్మీలో పని చేస్తున్న అతను తన కెరీర్‌ ఆరంభం నుంచి దీనిని అలవాటుగా మార్చుకున్నాడు. రెండో వన్డేలో రోహిత్‌ను అవుట్‌ చేసినప్పుడు కూడా ఇది కనిపించింది. అయితే అయ్యర్‌ను అవుట్‌ చేశాక ఆ ఆనందం అతనిలో ఏమాత్రం కనిపించలేదు. అంతకుముందు ఓవర్లో పంత్‌ దెబ్బకు 24 పరుగులు ఇచ్చుకొని డీలా పడిన కాట్రెల్‌కు ఈసారి సెల్యూట్‌ చేసే ఓపిక కూడా లేకపోయింది.  

కోహ్లి గోల్డెన్‌ డక్‌
విశాఖ మైదానంలో అత్యద్భుత రికార్డు ఉన్న కోహ్లి ఈసారి దానికి ‘దిష్టి చుక్క’ పెట్టాడు. ఇక్కడ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో మొత్తం 556 పరుగులు చేసిన విరాట్‌ బుధవారం పోరులో ‘గోల్డెన్‌ డక్‌’గా (ఆడిన తొలి బంతికే అవుటవ్వడం) వెనుదిరిగాడు. పొలార్డ్‌ ఆఫ్‌స్టంప్‌పై వేసిన బంతిని ఆడబోయిన కోహ్లి షార్ట్‌ మిడ్‌వికెట్‌లో ఛేజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కోహ్లిని అవుట్‌ చేసిన ప్రత్యర్థి జట్టు కెపె్టన్‌ పొలార్డ్‌ కూడా బ్యాటింగ్‌లో తన తొలి బంతికే అవుటయ్యాడు. వన్డేల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి.  

1 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఏడాది అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా తన పేరిటే ఉన్న రికార్డును రోహిత్‌ శర్మ (77 సిక్స్‌లు) సవరించాడు. గతేడాది రోహిత్‌ (74 సిక్స్‌లు) కొట్టాడు.  

3 తన వన్డే కెరీర్‌లో కోహ్లి ‘గోల్డెన్‌ డక్‌’ల సంఖ్య. 2011లో విండీస్‌తో మ్యాచ్‌లో... 2013లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లి ‘గోల్డెన్‌ డక్‌’గా వెనుదిరిగాడు.

4 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రోహిత్‌ (28 సెంచరీలు) శ్రీలంక ప్లేయర్‌ జయసూర్య (28)తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. సచిన్‌ (49), కోహ్లి (43), పాంటింగ్‌ (30) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.  

6 వన్డేల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గా కుల్దీప్‌ నిలిచాడు. మలింగ (శ్రీలంక) మూడు హ్యాట్రిక్‌లు తీయగా... అక్రమ్, సక్లాయిన్‌ ముస్తాక్‌ (పాక్‌), వాస్‌ (శ్రీలంక), బౌల్ట్‌ (న్యూజిలాండ్‌) రెండేసి హ్యాట్రిక్‌లు తీశారు.

ముంబైలో జరిగిన టి20తో కలిపి చూస్తే వరుసగా మూడు మ్యాచ్‌లలో మేం బాగా ఆడాం. ముందుగా బ్యాటింగ్‌ చేసి కూడా మంచి స్కోర్లు సాధించగలిగాం. ఛేదనలో మా జట్టు ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదనంగా 40–50 పరుగులు సాధించడం ఎప్పుడైనా కలిసొస్తుంది. రోహిత్, రాహుల్‌ శుభారంభం అందిస్తే శ్రేయస్, పంత్‌ అద్భుతంగా ఆడారు. రాబోయే రోజుల్లో వన్డేల్లో ఎలాంటి పెద్ద టోర్నీ లేదు కాబట్టి ఇలాంటి సిరీస్‌లలో ఎంత దూకుడుగా ఆడితే అంత మంచిది. టాస్‌ ఓడి కూడా ఈ తరహాలో గెలిచామంటే మా దృష్టిలో టాస్‌కు ప్రాధాన్యత లేదు. మా ఫీల్డింగ్‌ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది. ఇలా క్యాచ్‌లు వదిలేస్తే కష్టం.
–కోహ్లి, భారత కెప్టెన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement