నరైన్ కు అండగా విండీస్ బోర్డు
సెయింట్ జోన్స్:సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ కు గురైన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ కు ఊరట లభించింది. నరైన్ కు అండగా ఉంటామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) స్పష్టం చేసింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రిచర్డ్ పయ్ బస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రినిడాడ్ దేశవాళీ లీగ్ ద్వారా నరైన్ బౌలింగ్ ను మెరుగుపర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇది కచ్చితంగా నరైన్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మేలు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గత రెండు రోజుల క్రితం అనుమానస్పద బౌలింగ్ కారణంగా సునీల్ నరైన్‌ను ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో నరైన్ బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 17న లాబోర్గ్‌లోని ఐసీసీ అక్రిడేటెడ్ ల్యాబ్‌లో స్పిన్నర్ బౌలింగ్‌ను పరీక్షించారు. నరైన్ బంతులు విసిరేటప్పుడు తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని తేలడంతో ఐసీసీ అతనిపై వేటు వేసింది. ఈ విషయాన్ని అన్ని క్రికెట్ సంఘాలు గుర్తించాలని ఐసీసీ తెలిపింది. దీంతో దేశవాళీ లీగ్‌ల్లోనూ నరైన్ ఆడటం అనుమానంగా మారిన నేపథ్యంలో విండీస్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా అతనికి గొప్ప ఉపశమనం లభించినట్లయ్యింది.