నరైన్కు లైన్ క్లియర్
దుబాయ్: గత ఏడాది చివర్లో వివాదాస్పద బౌలింగ్తో సస్పెన్షన్ కు గురైన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఎట్టకేలకు తన యాక్షన్ ను సరిచేసుకుని క్రికెట్ లో పునరాగమనం చేయబోతున్నాడు. ఈమేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన పరీక్షల్లో నరైన్ బౌలింగ్ శైలి నిబంధనలకు లోబడే ఉందని తేలడంతో అతనికి క్లియరెన్స్ లభించింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో నరైన్ పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నరైన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
2015, నవంబర్ లో శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా నరైన్ బౌలింగ్ పై అనుమానాలు రావడంతో అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం నరైన్ ను పరీక్షించిన ఐసీసీ అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చి అతనిపై వేటు వేసింది. అయితే తన యాక్షన్ లో స్వల్ప మార్పులు చేసుకున్న అనంతరం ఈ ఏడాది మార్చి 28వ తేదీన చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్శిటీలో బౌలింగ్ పరీక్షలకు నరైన్ హాజరయ్యాడు. దీని ఆధారంగా నరైన్ బౌలింగ్ శైలిని పరీక్షించిన ఐసీసీ అతని బౌలింగ్ లో ఎటువంటి సందేహాలు లేవని స్పష్టం చేసింది. కాగా, నరైన్ బౌలింగ్ పై మళ్లీ అనుమానాస్పదంగా ఉందని భావిస్తే అంపైర్లు ఏ సమయంలోనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని ఐసీసీ ఈ సందర్భంగా పేర్కొంది.