తప్పులు దిద్దుకున్నానన్న హార్దిక్ పాండ్యా
‘వాస్తవం బోధపడింది’
కాన్పూర్: ఆల్‌రౌండర్‌గా అప్పటికే చక్కటి గుర్తింపు తెచ్చుకున్నా, గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో హార్దిక్ పాండ్యా భారత జట్టులో చోటు కోల్పోయాడు. జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో తత్వం బోధపడిన పాండ్యా మళ్లీ శ్రమించి స్థానం దక్కించుకున్నాడు. ‘టి20 ప్రపంచ కప్ తర్వాత నాకు వాస్తవం తెలిసొచ్చింది. నేను ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని అర్థమైంది. ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియాలో పర్యటించడం నేను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కల్పించిం ది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నా ఆట తో పాటు మానసికంగా కూడా నా ఆలోచనాతీరును మార్చారు. అసిస్టెంట్ కోచ్ పారస్ మాంబ్రే కూడా సహకరించారు. తప్పులు సరిదిద్దుకొని మళ్లీ టీమ్‌లోకి వచ్చాను’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు.
సాయంత్రం 4.30కే టి20 మ్యాచ్: కాన్పూర్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరగనున్న తొలి టి20 మ్యాచ్ సాయంత్రం 4.30కే ప్రారంభం కానుంది. ఉత్తరాదిన తీవ్ర ప్రభావం చూపిస్తున్న మంచుతోపాటు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న గ్రీన్‌పార్క్ మైదానంలో ఫ్లడ్ లైట్ల సమస్య కూడా మరో కారణం. ‘లో లక్స్ లెవల్స్ కారణంగా ఇక్కడి ఫ్లడ్‌లైట్ల కాంతి తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత ముందుగా మ్యాచ్ ముగించాలని భావించాం. ముందుగా మ్యాచ్ ప్రారంభించేందుకు బీసీసీఐ అనుమతి తీసుకున్నాం’ అని యూపీ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు.