'పొట్టి' కప్‌లో చిట్టి పోరు | Qualifying matches from today | Sakshi
Sakshi News home page

'పొట్టి' కప్‌లో చిట్టి పోరు

Published Mon, Mar 7 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

'పొట్టి' కప్‌లో చిట్టి పోరు

'పొట్టి' కప్‌లో చిట్టి పోరు

నేటినుంచి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు
ఎనిమిది జట్ల మధ్య పోటీ
రెండు జట్లకు మెయిన్ ‘డ్రా’ అవకాశం
►  బరిలో బంగ్లాదేశ్ కూడా
 

 ప్రపంచకప్... ఏ ఫార్మాట్‌లో అయినా, ఏ దేశానికైనా అతి పెద్ద లక్ష్యం. భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలతో తలపడటానికి చిన్న జట్లకు ఇదో గొప్ప వేదిక. రెండేళ్ల క్రితం నేపాల్, అంతకుముందు అఫ్ఘానిస్తాన్... ఇలా ఎదుగుతున్న దేశాలు గతంలో తమకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాయి. ఈసారి కూడా ఇలాంటి చిన్న జట్లకు ఇదో పెద్ద అవకాశం. ఇక టి20లాంటి ఫార్మాట్‌లో చిన్న జట్లు కూడా తమదైన రోజున పెద్ద జట్లకు కోలుకోలేని షాక్ ఇస్తాయి. అలాంటి సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి జరిగే ప్రధాన టోర్నీలో పెద్ద జట్లతో తలపడే అవకాశం ఈసారి కూడా రెండు చిన్న జట్లకు ఉంది. ఈ రెండు బెర్త్‌ల కోసం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. ఈ సమరానికి నేడు నాగ్‌పూర్‌లో తెరలేవనుంది.
 
 
సాక్షి క్రీడావిభాగం  ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ అదరగొట్టి ఉండొచ్చు. కానీ టి20 ప్రపంచకప్‌కు సంబంధించి మాత్రం అది చిన్న జట్టే. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. మిగతా జట్లకు క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ప్రధాన టోర్నీలో ఆడే చాన్స్ ఇచ్చారు. టాప్-8లో బంగ్లాదేశ్, జింబాబ్వే లేకపోవడంతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు గ్రూప్‌లలో కలిపి ఎనిమిది జట్లు బరిలో నిలిచాయి. ఒక్కో టీమ్ ఇతర మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన జట్టు మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తుంది. ఆదివారం వరకు మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొంటున్న జట్ల విశేషాలు.
  
 బంగ్లాదేశ్
 ఇప్పటి వరకు జరిగిన అన్ని టి20 ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్ పాల్గొంది. గతంలో ఎప్పుడూ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడలేదు. మొత్తం 18 మ్యాచ్‌లు ఆడితే,  3 మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన ఆ జట్టు 15 ఓడింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ టి20ల్లో 54 మ్యాచ్‌లు ఆడింది. 18 మ్యాచ్‌ల్లో గెలిచి, 35 మ్యాచ్‌ల్లో ఓడింది.

తాజా ఫామ్: 2015 నుంచి జింబాబ్వేపై 3, పాకిస్తాన్‌పై 2, శ్రీలంకపై 1, యూఏఈపై 1 మ్యాచ్‌లలో నెగ్గిన బంగ్లా... జింబాబ్వే చేతిలో 3, దక్షిణాఫ్రికా చేతిలో 2, భారత్ చేతిలో 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

కీలక ఆటగాళ్లు: ఇప్పుడు ఈ జట్టులో అందరూ స్టార్ క్రికెటర్ల తరహాలోనే కనిపిస్తున్నారు. ఆసియాకప్ ఫైనల్‌కు చేరడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. షబ్బీర్, మహ్మదుల్లా, షకీబ్, తమీమ్, తస్కిన్, మోర్తజా కీలక ఆటగాళ్లు.
 
 జింబాబ్వే
 2009లో మినహా మిగిలిన నాలుగు ప్రపంచకప్‌లలో జింబాబ్వే పాల్గొంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడితే 3 గెలిచి, 6 ఓడింది. ఓవరాల్‌గా టి20ల్లో ఆ జట్టు 48 మ్యాచ్‌లలో 10 గెలిచి, 37 ఓడింది. జింబాబ్వే కూడా తొలిసారి క్వాలిఫయింగ్ పోటీని ఎదుర్కొంటోంది.

 తాజా ఫామ్: 2015 నుంచి ఆడిన అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో పాకిస్తాన్ చేతిలో 4, అఫ్ఘానిస్తాన్ చేతిలో 4, బంగ్లాదేశ్ చేతిలో 3, కివీస్ చేతిలో 1, భారత్ చేతిలో 1 మ్యాచ్‌లో  ఓడిన జింబాబ్వే... బంగ్లాదేశ్‌పై 3, భారత్‌పై ఒక మ్యాచ్‌లో నెగ్గింది. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలి యదు. నిలకడలేమి పెద్ద సమస్య.

కీలక ఆటగాళ్లు: కెప్టెన్ మసకద్జతో పాటు చిగుం బురా, సికిందర్ రజా గమనించదగ్గ క్రికెటర్లు.
 
నెదర్లాండ్స్
అసోసియేట్ దేశాల క్వాలిఫయింగ్ టోర్నీలో సంయుక్త విజేతగా నిలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధిం చింది. ఈ టోర్నీలో పాల్గొనడం మూడోసారి. 2009లో ఇం గ్లండ్‌కు షాక్ ఇచ్చిన చరిత్ర ఉంది. ఈసారి టోర్నమెంట్ కోసం బెంగళూరులో రెండు వారాల పాటు ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొంది. టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్‌లతో (3) పోలిస్తే అత్యధికంగా నాలుగు విజయాలు సాధించిన జట్టు నెదర్లాండ్స్.

 స్పెషల్ ఫోకస్: గతంలో దక్షిణాఫ్రికాకు ప్రాతి నిధ్యం వహించిన రోల్ఫ్ వాండర్‌మెర్వ్ ఈసారి నెదర్లాండ్స్‌కు ఆడుతున్నాడు. టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. కెప్టెన్‌గా పీటర్ బోరెన్ ఉన్నాడు.

 కీలక ఆటగాళ్లు: స్టెఫాన్ మైబర్గ్, బెన్ కూపర్, ముదస్సర్ బుఖారి, అహ్‌సాన్ మాలిక్.
 
 
స్కాట్లాండ్
 తొలి టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో, ఈసారి క్వాలిఫయింగ్ టోర్నీలో కూడా విజేతగా నిలిచిన స్కాట్లాండ్ ప్రధాన టోర్నీలో మాత్రం సత్తా చూపలేకపోతోంది. ఆ జట్టుకు ఇది మూడో టి20 వరల్డ్‌కప్. వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న స్టార్ ఆటగాళ్లు ఎవరూ ఈ జట్టులో లేరు. దాంతో సమష్టి కృషినే ఎక్కువగా నమ్ముకుంది. గతంలో ఎలాంటి సంచలన విజయాలు కూడా లేవు.

స్పెషల్ ఫోకస్: కెప్టెన్ ప్రెస్టన్ మోమ్‌సెన్ స్కాట్లాండ్ జట్టుకు పెద్ద దిక్కు. ఏడాదిన్నర క్రితం కోయెట్జర్ గాయపడటంతో తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన అతను సమర్థంగా జట్టును నడిపిస్తున్నాడు. జట్టు ఇటీవలి విజయాలకు క్రెడిట్ తనదే.

కీలక ఆటగాళ్లు: కైల్ కోయెట్జర్, మాట్ మ్యాకన్, మ్యాథ్యూ క్రాస్, మార్క్ వాట్.
 
 హాంకాంగ్
గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి టోర్నీలో పాల్గొంటోంది. ఎక్కువ మంది కుర్రాళ్లతో ఉన్న ఈ జట్టు ఆటగాళ్ల సగటు వయసు 24.24 మాత్రమే. అయితే తక్కువ వయసు ఉన్నా జట్టులో చాలా మంది క్రికెటర్లకు మంచి అనుభవం ఉంది. మరో వైపు క్వాలిఫయింగ్ టోర్నీ తర్వాత ఆ జట్టు ఫామ్ గొప్పగా లేదు. గత నాలుగు నెలల కాలంలో ఆ జట్టు 10 టి20 మ్యాచ్‌లు ఆడితే 7 ఓడింది.

స్పెషల్ ఫోకస్: ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలు ఆడిన ర్యాన్ క్యాంప్‌బెల్ ఈ జట్టులో ఉన్నాడు. ఈ టోర్నీలో బరిలోకి దిగితే 44 ఏళ్ల వయస్సులో తొలి టి20 ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. పాక్ తరఫున అండర్-19 స్థాయిలో ఆడిన తన్వీర్ ఈ జట్టు కెప్టెన్.

కీలక ఆటగాళ్లు: బాబర్ హయత్, మార్క్ చాప్‌మన్, నదీమ్ అహ్మద్.
 
ఒమన్
గతంలో ఎంతో అనుభవం ఉన్న జట్లను ఓడించి క్వాలిఫయింగ్ టోర్నీలో ఒమన్ సంచలనాలు సృష్టించింది. అదే జోరులో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది. అర్హత టోర్నీకి ముందు 29వ ర్యాంక్‌లో, ఐదో డివిజన్‌లో ఉన్న ఆ జట్టు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన అతి తక్కువ ర్యాంకింగ్ గల జట్టు. పటిష్టమైన గ్రూప్‌లో ఉండటంతో ఈ జట్టు మెయిన్ డ్రాకు అర్హత సాధించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒమన్‌కు భారత మాజీ ఆటగాడు సునీల్ జోషి ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆసియా కప్ క్వాలిఫయర్‌లో ఓడినప్పటి నుంచి జట్టుకు చండీగఢ్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరం జరుగుతోంది.

 స్పెషల్ ఫోకస్: అన్ని స్థాయిలలో కలిపి ఒమన్ 131 మ్యాచ్‌లు ఆడితే కెప్టెన్ సుల్తాన్ అహ్మద్ ఒక్కడికే 121 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 38 ఏళ్ల సుల్తాన్‌కు గత పదేళ్లుగా ఒమన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర ఉంది. జీషాన్ మఖ్సూద్ విధ్వంసకర ఆటగాడు.
 కీలక ఆటగాళ్లు: అద్నాన్ ఇలియాస్, జతీందర్ సింగ్, ఆమిర్ కలీమ్.
 
 అఫ్ఘానిస్తాన్
 ఐసీసీ టోర్నీలలో అఫ్ఘానిస్థాన్ ఆశించిన స్థాయిలో ఎప్పుడూ ఆడలేదు. నాలుగు ఐసీసీ ఈవెంట్లలో ఆడిన ఈ జట్టు పెద్ద జట్లపై కనీసం ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. సంచలనం సాధిస్తుందనుకున్న సమయంలో విఫలమైంది.  అయితే ఇటీవలి జట్టు ఫామ్ కాస్త ఆశలు రేపుతోంది. జింబాబ్వేతో ఇటీవల రెండు సిరీస్‌లు నెగ్గడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ జట్టు వరుసగా నాలుగో సారి టి20 ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్‌లో ఆడే అవకాశం కొద్దిలో తప్పిపోయినా... గత 10 టి20 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్‌లో తనతో పోటీ పడుతున్న ఇతర మూడు జట్లతో కలిపి 19 మ్యాచ్‌లు ఆడితే అఫ్ఘాన్ 17 గెలిచింది. ఇది ఆ జట్టు మెయిన్ డ్రాకు అర్హత సాధించడంపై ఆశలు రేపుతోంది.

 స్పెషల్ ఫోకస్: వన్డే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా వచ్చిన అస్గర్ స్టానిక్‌జాయ్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. మిడిలార్డర్‌లో అతని బ్యాటింగ్‌పై జట్టు ఎంతో ఆధారపడి ఉంది. తమ ప్రత్యర్థులైన స్కాట్లాండ్, హాంకాంగ్‌లపై అస్గర్ రికార్డు అద్భుతంగా ఉంది.

 కీలక ఆటగాళ్లు: దౌలత్ జద్రాన్, మొహమ్మద్ షహజాద్, రషీద్ ఖాన్, హమీద్ హసన్.
   
 ఐర్లాండ్
అసోసియేట్ జట్లలో బలమైన టీమ్‌గా గుర్తింపు ఉంది. దాదాపు గత పదేళ్లుగా జట్టును తీర్చిదిద్దిన సీనియర్ ఆటగాళ్లతో పాటు జూనియర్లతో సమతూకంగా కనిపిస్తోంది. వన్డే, టి20 ప్రపంచకప్‌లలో తమకంటే బలమైన బంగ్లాదేశ్, ఇంగ్లండ్, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించిన రికార్డు ఉంది. టి20 ప్రపంచకప్‌లో ఐదో సారి పాల్గొంటోంది.

 స్పెషల్ ఫోకస్: గత ఏడాది కాలంగా చక్కటి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్ క్వాలిఫయింగ్ పోటీల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అద్భుత ఫీల్డర్ కూడా.  ధోని (6 వరల్డ్ కప్‌లు) తర్వాత వరుసగా ఐదోసారి తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రికార్డు అతని సొంతం.

 కీలక ఆటగాళ్లు: కెవిన్ ఓబ్రైన్, జార్జ్ డాక్‌రెల్, రాన్‌కిన్, పాల్ స్టిర్లింగ్.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement