ఈ సీజన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టుకు కొత్త కోచ్‌ను నియమించనున్నారు.
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టుకు కొత్త కోచ్‌ను నియమించనున్నారు. ఇందుకోసం టి20 వరల్డ్‌కప్ తర్వాత దిగ్గజాలు సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లతో కూడిన సలహాదారుల కమిటీ కోచ్ ఎంపిక చేపట్టనుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టి20 ప్రపంచకప్ వరకు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి కొనసాగుతాడని గతంలోనే బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘టి20 వరల్డ్‌కప్ తర్వాత జరగబోయే పర్యటనకు భారత్ కొత్త కోచ్‌తో వెళ్తుంది. ఐపీఎల్ సమయంలో మాకు కోచ్‌ను ఎంపిక చేసేందుకు అవసరమైన సమయం లభిస్తుంది. సలహాదారుల కమిటీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.