‘మిస్టర్ పర్ఫెక్ట్’ వస్తేనే మేలు
టి20 ప్రపంచకప్ జ్ఞాపకాలను పూర్తిగా నెమరువేసుకోకముందే మరో టి20 పండగ వచ్చేస్తోంది. మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఇక దాదాపు రెండు నెలలు పూర్తిగా మళ్లీ టి20 సందడి. కానీ ఈలోపే భారత క్రికెట్‌లో ఓ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జట్టుకు కొత్త కోచ్ ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. ఇకపై పూర్తి స్థాయి కోచ్‌ను నియమిస్తామని బోర్డు ఇప్పటికే తెలిపింది. కోచ్‌గా రావాలని రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. మరి ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఈ బాధ్యతను తీసుకుంటారా..? తను వస్తే జరిగే మేలేంటి..?
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన పదవి... భారత జట్టు కోచ్. దాదాపు అన్ని దేశాల సీనియర్ కోచ్‌లు, పలువురు మాజీ క్రికెటర్లు ఈ పదవి కోసం తహతహలాడుతుంటారు. మిగిలిన ఏ దేశంలోనూ లభించని మొత్తం జీతంగా లభించడంతో పాటు... క్రికెట్‌ను మతంలా ఆరాధించే దేశం కాబట్టి పేరు కూడా బాగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం చాలామంది ఆసక్తిగానే ఉన్నారు. గతంలో మాదిరిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఈసారి ఆచితూచి వ్యవహరించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కోచ్ నియామకాన్ని భారత క్రికెట్ దిగ్గజ త్రయానికి అప్పగించింది.
సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న కమిటీని కొత్త కోచ్ గురించి ప్రతిపాదనలు ఇవ్వాలని బోర్డు కోరినట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ ఈ పదవికి సరైన వ్యక్తని, రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు మార్గనిర్దేశనం చేయగల సమర్థుడని బీసీసీఐలో అభిప్రాయం ఉంది. మిస్టర్ డిపెండబుల్‌తో కలిసి దశాబ్దానికిపైగా క్రికెట్ ఆడిన దిగ్గజ త్రయానికి కూడా తనపై మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ కోచ్‌గా వస్తే బాగుంటుందనే అభిప్రాయం భారత క్రికెట్ వర్గాల్లో మొదలైంది.
గతంలోనే అడిగినా...
వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్‌లో మార్పులు జరిగాయి. ఫ్లెచర్ కోచ్‌గా ఉండగానే రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఫ్లెచర్ వెళ్లిపోయినా శాస్త్రి కొనసాగారు. తొలుత కొన్ని సిరీస్‌లకు ఆయనే కొనసాగారు. ఆ సమయంలో కొత్త కోచ్ గురించి రకరకాల చర్చలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి జట్టు డెరైక్టర్‌గా కొనసాగుతారని ఆరు నెలల ముందే బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీ ముగియగానే బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ తనంతట తాను శాస్త్రి పదవీకాలం ముగిసిందని ప్రకటించడం విశేషం.
వాస్తవానికి వన్డే ప్రపంచకప్ ముగిశాక కొత్త కోచ్ గురించి ఆలోచన వచ్చినప్పుడే రాహుల్ ద్రవిడ్ పేరు చర్చకు వచ్చింది. దేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీలో సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో పాటు ద్రవిడ్ కూడా ఉండాల్సింది. కానీ ఇలాంటి పదవులపై తనకు ఆసక్తి లేదని, నేరుగా క్రికెటర్లతో కలిసి పని చేస్తానని ద్రవిడ్ చెప్పారు. ఆ సమయంలో భారత సీనియర్ జట్టు పదవి తీసుకోమని కోరినా ద్రవిడ్ నిరాకరించారు. అండర్-19, ‘ఎ’ జట్లతో కలిసి పని చేస్తానని, దీనివల్ల భవిష్యత్‌లో భారత్‌కు మంచి కుర్రాళ్లను అందిస్తానని చెప్పి బాధ్యతలు తీసుకున్నారు.
ద్రవిడ్ కోచింగ్‌లో ఈ రెండు జట్లు కూడా విశేషంగా రాణించాయి. కోహ్లి, ైరె నా, పుజారా సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ‘ఎ’ జట్టు తరఫున ఆడి ద్రవిడ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఇక అండర్-19 జట్టు కూడా ప్రపంచకప్‌లో ఫైనల్ వరకూ అపజయం లేకుండా సాగింది. ఈ రెండు జట్లలోని ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, బోర్డు పెద్దలు అందరూ ద్రవిడ్ కోచింగ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి ద్రవిడ్‌కు మరింత పెద్ద బాధ్యత ఇవ్వాలనే ఆలోచనలో తప్పు లేదు కూడా.
ఒప్పుకుంటాడా..?
గతంలో సీనియర్ జట్టుకు పని చేయమని అడిగితే ద్రవిడ్ నిరాకరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది సమయం సరిపోకపోవడం. కోచ్ పదవి ప్రతిపాదన వచ్చే సమయానికి ద్రవిడ్ ఐపీఎల్‌లో రాజస్తాన్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. క్రికెటర్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మిస్టర్ డిపెండబుల్ కొంతకాలం పిల్లలతో గడపాలని భావించారు.
‘పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడంలో ఉండే సరదా కూడా నేను కోల్పోయాను. ఇప్పుడు ఇలాంటి ఆనందాలను ఆస్వాదించవచ్చు’ అని రిటైర్‌మెంట్ సమయంలోనే ద్రవిడ్ చెప్పారు. భారత సీనియర్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తే తిరిగి కుటుంబానికి చాలా వరకు దూరంగా గడపాలి. కాబట్టి దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే అండర్-19, ‘ఎ’, ఐపీఎల్ జట్ల కోచ్‌గా వ్యవహరించడం వల్ల నిజానికి ద్రవిడ్‌కు పెద్దగా సమయం దొరకడం లేదు. అలాంటప్పుడు సీనియర్ జట్టుకే పని చేస్తే భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందిగా... అంటూ తనని ఒప్పించే ప్రయత్నం బోర్డు చేసే అవకాశం ఉంది.
అనుభవం కావాలి
భారత జట్టుకు టి20, వన్డేల్లో ధోని రూపంలో సీనియర్ క్రికెటర్ అండగా ఉన్నా... టెస్టుల సమయంలో సీనియర్ జట్టులో లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోహ్లి సారథ్యంలో టెస్టు జట్టులో చాలావరకు యువ క్రికెటర్లు ఉన్నారు. దీనికితోడు విరాట్‌కు దూకుడెక్కువ. దీంతో గత ఏడాది కొన్ని అనవసర వివాదాలు వచ్చాయి. జట్టుగా కోహ్లి అండ్ కో ఉపఖండంలో బాగా ఆడినా... ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో టెస్టులు గెలవడానికి సరిపోయే అనుభవం ప్రస్తుతం ఉన్న జట్టులో లేదు. ప్రపంచంలో అన్ని మూలలా భారీ స్కోర్లు చేసిన ద్రవిడ్ లాంటి స్వదేశీ కోచ్ ఉంటే కచ్చితంగా మన క్రికెటర్లకు ఉపయోగం.
పైగా రాబోయే ఏడాది కాలంలో భారత్ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే బోర్డులో ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా పని చేసినా, పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలే చేపట్టారని... తను పదవిలో ఉన్న సమయంలో భారత్ ప్రదర్శన బాగానే ఉంది కాబట్టి అతన్నే పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలని కొంత మంది కోరుతున్నారు. ద్రవిడ్ అంగీకరిస్తే తను భారత జట్టు కోచ్ కావడం ఖాయం. ఒకవేళ ద్రవిడ్ ఇంకా కొంత ఖాళీ సమయం కావాలని కోరుకుంటేనే మరో పేరు గురించి ఆలోచిస్తారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఆ సందర్భం వస్తే శాస్త్రిని కొనసాగించాలా? లేక విదేశీ కోచ్‌ను పిలవాలో ఆలోచిస్తారు. నిర్ణయం తీసుకోవడానికి ఐపీఎల్ ముగిసేవరకూ సమయం ఉంది. ఈలోపు దీనిపై స్పష్టత వస్తుంది. - సాక్షి క్రీడావిభాగం