![MS Dhoni has No immediate Retirement Plans - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/27/Dhoni.jpg.webp?itok=HeVPUvL1)
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగబోరని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ‘ఐపీఎల్‌లో ధోనీ ఎలా ఆడుతున్నాడన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ పెద్ద టోర్నమెంట్. అందులో ఎలా ఆడుతున్నారన్నది గమనించిన తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం తుది జట్టును ప్రకటిస్తారు’ అని రవిశాస్త్రి తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం తుది జట్టు ఎంపికలో ధోనీని కూడా పరిగణనలోకి తీసుకుంటారని, అప్పటివరకు జాతీయ క్రికెట్‌లో ధోనీ కొనసాగుతారని రవిశాస్త్రి పరోక్షంగా స్పష్టం చేశారు.
ఇంగ్లండ్‌లో ముగిసిన వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ జాతీయ జట్టులో ఆడని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో ధోని రిటైర్మెంట్ ఉండకపోవచ్చునని స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఏడాదే కాదు.. ఆ మరుసటి ఏడాది (2021) కూడా ఐపీఎల్‌లో ధోనీ ఆడబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2021 ఐపీఎల్ వరకు తాను అందుబాటులో ఉంటానని తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే)కు ధోనీ సమాచారమిచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2021 ఐపీఎల్‌కు ముందే పెద్ద ఎత్తున ఆటగాళ్ల వేలంపాట ఉండనున్న నేపథ్యంలో ఈ టోర్నమెంటులో తాను ఆడబోతున్నట్టు ధోనీ సమాచారమిచ్చారని, కాబట్టి టీ20 క్రికెట్‌లో ధోనీ ఇప్పట్లో రిటైరయ్యే ప్రసక్తే లేదని సీఎస్‌కే వర్గాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment